ఆడకుంటే జీతాల్లో కోత, క్రికెటర్లకు బీసీసీఐ షాక్

భారత క్రికెటర్లకు బీసీసీఐ దిమ్మతిరిగే షాకివ్వబోతోంది..బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యంతో సీరియస్ గా ఉన్న బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది..ఇటీవల నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో పలు ప్రతిపాదనలపై చర్చించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 14, 2025 | 05:52 PMLast Updated on: Jan 14, 2025 | 5:52 PM

Bcci Shocks Cricketers Cuts Salaries If They Dont Play

భారత క్రికెటర్లకు బీసీసీఐ దిమ్మతిరిగే షాకివ్వబోతోంది..బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యంతో సీరియస్ గా ఉన్న బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది..ఇటీవల నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో పలు ప్రతిపాదనలపై చర్చించింది. దీనిలో భాగంగా ఆటగాళ్ళ పేమెంట్స్ పై సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. కార్పొరేట్‌ శైలిలో అప్రైజల్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలనే ఉద్దేశంలో బోర్డు ఉన్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. మ్యాచుల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి వేతనాల పెంపు ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అదేసమయంలో ప్రదర్శన సరిగ్గా చేయని వారికి, వేతనాల్లో కోత విధించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆటగాళ్లు జవాబుదారీగా ఉండాలి. వారు ప్రదర్శనలు అంచనాలకు తగ్గట్టుగా చేయ లేకపోతే ఇలాంటి చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. అవకాశాలు ఇచ్చినప్పుడు రాణించకపోతే జట్టులో చోటు కోల్పోవడమే కాదు జీతాల్లో కోత కూడా తప్పదని ఆ అధికారి తెలిపారు. అయితే దీనిపై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. తీసుకున్న తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇస్తూ బీసీసీఐ ప్రోత్సాహకాలను అందిస్తోంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో నిలకడగా రాణించే ప్లేయర్స్ ను ప్రోత్సహిస్తోంది. ఒక క్యాలెండర్‌ ఇయర్ లో కనీసం 75 శాతం టెస్ట్‌లు ఆడే ప్లేయర్ కు, ఒక టెస్ట్ మ్యాచ్‌కు ఫీజు 15 లక్షలతో పాటు 45 లక్షలు చెల్లిస్తున్నారు. 50 శాతం నుంచి 75 శాతం మ్యాచ్‌లు ఆడే ప్లేయర్స్ కు ఒక్కో మ్యాచ్‌కు 30 లక్షల బోనస్ అందిస్తున్నారు. జట్టులో ఎంపికై ఆడని సభ్యులకు 15 లక్షలు ఇస్తున్నారు.

ఇలాంటి ప్రోత్సహకాలు అందించే విషయంలో ముందుండే బీసీసీఐ ఆటగాళ్ళ జీతాల్లో కోత పెట్టాలనుకోవడం నిజంగా సంచలనమే.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అలాగే స్వదేశంలో కివీస్ పై వైట్ వాష్ పరాభవం కూడా మరో కారణంగా భావిస్తున్నారు. పనిలో పనిగా చాలా మంది క్రికెటర్లు టీ ట్వంటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, టెస్టుల్లో ఆడేందుకు ఆసక్తిగా లేకపోవడంపైనా బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. దీనిపైనా త్వరలోనే కీలక ప్రతిపాదనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.