Bengaluru water crisis: బెంగళూరులో నీటి కటకట.. వాటర్ ట్యాంకర్లే దిక్కు..
నగరంలోని పలు ప్రాంతాల్లో బోర్‌వెల్స్ ఎండిపోవడంతో నీటి సంక్షోభం పతాకస్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు నీటి కోసం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.
Bengaluru water crisis: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం నీటి కటకటతో అల్లాడిపోతోంది. గొంతు తడుపుకొనేందుకు గుక్కెడు నీళ్ల కోసం కటకటలాడుతున్నారు. బెంగళూరుకు నీటి సరఫరా తగ్గిపోవడంతోపాటు భూగర్భ జలాలు కూడా అడుగంటడమే దీనికి కారణం. బెంగళూరు మహా నగరానికి వేసవి ఆరంభంలోనే నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో బోర్‌వెల్స్ ఎండిపోవడంతో నీటి సంక్షోభం పతాకస్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు నీటి కోసం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇదే అదనుగా భావించిన కొందరు ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు ఇష్టారీతిన ధరలు పెంచేశారు.
IND VS ENG: తొలిరోజు టీమిండియాదే.. సత్తా చాటిన బౌలర్లు.. అదరగొట్టిన బ్యాటర్లు
గతంలో ఒక్కో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్‌కు రూ.600 నుంచి రూ.1,000 ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ దోపిడీపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. అధిక ధరలు వసూలు చేసే వాటర్ ట్యాంకర్ల యజమానులపై చర్యలు తీసుకుంటామని కోరింది. ధరలు తగ్గించాలని సూచించింది. దీంతో కొన్ని ట్యాంకర్లు పలు ప్రాంతాలకు నీళ్లు అందించడమే మానేశారు. ఇక.. జనం నీళ్ల కోసం ఆర్‌ఓ ప్లాంట్‌కు వెళ్తున్నారు. అయితే, అక్కడ కూడా నీళ్లకు డిమాండ్ ఉంది. దీతో ఒక్కొక్కరికి ఒక్కో క్యాన్ చొప్పున మాత్రమే నీళ్లు ఇస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పైగా నీటి కోసం గంటల కొద్ది క్యూలలో వేచి ఉండాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల ప్రజలు.. తమకు నీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. కనీసం స్నానం చేసేందుకు, వంట చేసుకునేందుకు కూడా తగినంత నీటి సరఫరా ఉండటం లేదన్నారు. వంటకు, తాగేందుకు కూడా కార్పొరేషన్ నీటిని వాడుకుంటున్నట్లు చెబుతున్నారు. బెంగళూర్ నీటి సరఫరా, సీవరేజ్ బోర్డ్ అధికారులకు ఫోన్ చేస్తున్నా స్పందించడం లేదని స్థానికులు అంటున్నారు. నీటి సంక్షోభాన్ని పర్యవేక్షించేందుకు పలు సొసైటీలు.. నీటి వినియోగంపై ఆంక్షలు విధిస్తున్నాయి.
నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించకుంటే రూ.5,000 జరిమానా విధించాలని వైట్‌ఫీల్డ్‌లోని ఒక సొసైటీ నిర్ణయించింది. మరోవైపు బెంగళూరులోని నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ ట్యాంకర్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గత వారం చెప్పారు. ఈ మేరకు ట్యాంకర్ల యజమానులు ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలని, ఈ నెల 12న వారితో సమావేశం నిర్వహిస్తామని డీకే అన్నారు. నీటి సమస్య ఎదుర్కొంటున్న వారికోసం తాలూకా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు, హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. నీటి సమస్య నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని నిధులు మంజూరు చేస్తుందన్నారు. సమస్యను పరిష్కరిస్తామన్నారు. బెంగళూరు నగరంతోపాటు కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో ఇదే నీటి ఎద్దడి కొనసాగుతోంది. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే.. మిగతా రోజుల్లో నీళ్ల కోసం ఇంకెంత అల్లాడాలో అని జనం ఆందోళన చెందుతున్నారు.