MLA Tellam Venkat Rao: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక స్థానం భద్రాచలం. ఇక్కడి నుంచి తెల్లం వెంకట్రావ్ ఒక్కరే బీఆర్ఎస్ నుంచి గెలవగా, మిగిలిన స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరుతుండటంతో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం సున్నాగానే చెప్పాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 7, 2024 | 03:32 PMLast Updated on: Apr 07, 2024 | 3:32 PM

Bhadrachalam Brs Mla Tellam Venkat Rao Joins In Congress

MLA Tellam Venkat Rao: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు వరుసగా పార్టీని వీడి వెళ్తున్నారు. తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో తెల్లం.. కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా చేరికలపై దృష్టిపెట్టింది.

CHANDRABABU NAIDU: కుప్పంలో వాలంటీర్ల రాజీనామా.. చంద్రబాబుకు ఓటమి తప్పదా..?

బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, ఇతర నేతల్ని వరుసగా కాంగ్రెస్‌లో చేర్చుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక స్థానం భద్రాచలం. ఇక్కడి నుంచి తెల్లం వెంకట్రావ్ ఒక్కరే బీఆర్ఎస్ నుంచి గెలవగా, మిగిలిన స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరుతుండటంతో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం సున్నాగానే చెప్పాలి. కొంతకాలంగా తెల్లం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే మంత్రి తుమ్మలతో జరిగిన సమావేశంలోనూ పాల్గొన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమనే ప్రచారం జరిగింది. ఇక.. శనివారం తుక్కుగూడలో నిర్వహించిన జన జాతర సభలోనూ తెల్లం వెంకట్రావ్ కనిపించారు. అందరూ అనుకున్నట్లుగానే ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పటికే ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.

దానం సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి బరిలో దిగే అవకాశాలున్నాయి. కడియం శ్రీహరి కూతురు కావ్య వరంగల్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. తెల్లం వెంకట్రావ్ చేరికతో బీఆర్ఎస్ నుంచి అధికారికంగా కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది. అయితే, దాదాపు పాతిక మందికిపైగా ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీంతో రాబోయే రోజుల్లో మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా… కారు దిగి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.