A broken train wheel: విరిగిన చక్రంతో ప్రయాణించిన పవన్ ఎక్స్ ప్రెస్.. తప్పిన పెను ప్రమాదం.
రైలు ప్రయాణం అంటేనే వెన్నులో ఒణుకు పుట్టేలా చేసింది ఒడిశా రైలు ప్రమాదం. ఇది జరిగి కేవలం వారాల వ్యవధి మాత్రమే అవుతుంది. ఇప్పటికీ ఆ వైబ్రేషన్స్ ప్రతి ఒక్కరిలో మెదులుతూనే ఉంది. దీని నుంచి సామాన్య ప్రజలు కోలుకునే లోపే మరో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. బీహార్ లోని హాజిపూర్ - ముజఫర్ పుర్ రైల్వే పరిధిలోని భగవాన్ పుర్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది.
ఆదివారం రాత్రి ముజఫర్ పుర్ స్టేషన్ నుంచి పవన్ ఎక్స్ ప్రెస్ ముంబాయికి బయలుదేరింది. ఇలా బయలు దేరిన కొంత సమయానికే ఎస్ – 11 కోచ్ క్రింది భాగంలో పెద్దపెద్ద శబ్ధాలు వినిపించడం మొదలైంది. వీటిని గమనించిన కోచ్ లోని ప్రయాణీకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో రైలు వేగంగానే ప్రయాణిస్తుందని అందులోని ప్రయాణికులు చెప్పారు. ఇలా 10 కిలోమీటర్ల దూరం వెళ్లాక భగవాన్ పూర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది పవన్ ఎక్స్ ప్రెస్. అప్రమత్తమైన ప్రయాణీకులు చైన్ లాగి.. స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఈ శబ్దాలకు కారణాన్ని గుర్తించేందుకు ఎస్ 11 కోచ్ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. లోపల ఎలాంటి సమస్య లేకపోవడంతో బోగి కింది భాగంలో చెక్ చేశారు. అక్కడ రైలు చక్రం విరిగి ఉండటాన్ని గుర్తించారు రైల్వే అధికారులు. దీని కారణంగానే శబ్ధం వచ్చినట్లు నిర్ధారించి వెంటనే మరమ్మత్తులు చేసేందుకు టెక్నికల్ టీంను పిలిపించారు. విరిగిపోయిన పవన్ ఎక్స్ ప్రెస్ రైలు చక్రాన్ని బాగు చేసేందుకు సహాయక బృందం రంగంలోకి దిగి రిపేర్ చేశారు. దీంతో కొంత ఆలస్యంగా రైలు తిరిగి ప్రయాణం సాగించింది. చిన్న అంతరాయం కారణంగా ఇలాంటి సమస్య తలెత్తిందని ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని రైల్వే అధికారి వీరేంద్ర కుమార్ వెల్లడించారు.