Bhajan Lal Sharma: రాజస్తాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ.. ప్రత్యేకత ఏంటో తెలుసా..?

రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మను ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. రాజవంశానికి చెందిన దియా కుమారి, ప్రేమ్ చంద్ భైర్వాను ఉప ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించబోతున్న భజన్ లాల్ తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యే కావడం విశేషం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 12, 2023 | 05:43 PMLast Updated on: Dec 12, 2023 | 5:43 PM

Bhajan Lal Sharma Is Next Rajasthan Cm Vasundhara Raje Proposes Name

Bhajan Lal Sharma: రాజస్తాన్ ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై పది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు బీజేపీ తెరదించింది. రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మను ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. రాజవంశానికి చెందిన దియా కుమారి, ప్రేమ్ చంద్ భైర్వాను ఉప ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించబోతున్న భజన్ లాల్ తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యే కావడం విశేషం. తాజా ఎన్నికల్లో ఆయన సాంగ్నర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

KCR video from Hospital:మీరు యశోదాకు రావొద్దు – పేషెంట్లకు ఇబ్బంది : కేసీఆర్

ముఖ్యమంత్రి ఎంపిక కోసం బీజేపీ తీవ్ర కసరత్తు చేసింది. పోటీ ఎక్కువగా ఉండటంతో నియామకం ఆలస్యమైంది. మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల పార్టీ కేంద్ర పరిశీలకుల బృందం ఆధ్వర్యంలో రాజస్థాన్ బీజేఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎంలను ఎన్నుకున్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా వాసుదేవ్ దేవ్నానీని ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి రేసులో ముందున్న వసుంధర రాజే గౌరవంగా పోటీ నుంచి తప్పుకొన్నారు. ఆమె తదుపరి ముఖ్యమంత్రిగా భజన్ లాల్ పేరును ప్రతిపాదించారు. వసుంధర రాజేతో పాటు సీఎం పదవి రేసులో దియాకుమారి, కిరోరి లాల్ మీనా, బాలక్ నాథ్.. తదితరులు కూడా ఉన్నారు.

అయితే, అధిష్టానం అనూహ్యంగా భజన్ లాల్‌ను ఎంపిక చేసింది. సీఎంగా ఎంపికైన అగ్రవర్ణానికి చెందిన భజన్ లాల్ శర్మ ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న నాయకుడు. గత నెలలో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 200 స్థానాలున్న రాజస్తాన్‌లో 199 సీట్లకు ఎన్నికలు జరగగా, 115 సీట్లను బీజేపీ గెల్చుకుంది. భజన్ లాల్ శర్మ.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సన్నిహితుడిగా పేరుంది.