Karnataka results: రాముడు జాలి చూపించాడు.. హనుమంతుడు మాత్రం తన్ని తరిమేశాడు! బీజేపీకి గదతో బుద్ధి చెప్పిన బజరంగబలి!

రాముడు గుడిని చూపించి ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీకి హనుమంతుడు చెక్ పెట్టాడు. భక్తి ముసుగులో ఓట్ల లబ్ధి పొందాలని చూసిన కాషాయ పార్టీని కర్ణాటకతో తన్ని తరిమేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 13, 2023 | 12:47 PMLast Updated on: May 13, 2023 | 12:53 PM

Bhajrang Dal Politics Lord Hanuman Hits Back At Bjp As Karnataka Grabbed A Win Over Saffron Party In Karanataka Assembly Elections

అయోధ్య రామమందిరం అంశం దేశంలోని చాలా రాష్ట్రాల్లో హిందువులను ఓకే తాటిపైకి తీసుకొచ్చింది. ముఖ్యంగా నార్త్‌ ఇండియాలో బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ప్రత్యక్షంగా కారణమైంది. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్య రామమందిరానికి లైన్‌ క్లియర్‌ అవ్వడంతో నాటి నుంచి బీజేపీకి ఓట్లు దండుకోవడానికి ఓ అస్త్రం దూరమైంది. ఛాన్స్‌ దొరికితే మత విద్వేష రాజకీయాలకు పూనుకునే బీజేపీకి కర్ణాటకలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హనుమంతుడి పేరు వాడుకొని అధికారంలోకి రావాలని చూసిన కాషాయ పార్టీని పీకి పక్కన పెట్టారు కన్నడిగులు.

బజరంగ్‌ దళ్‌ పాలిటిక్స్‌:

అధికారంలోకి వస్తే బజరంగ్‌ దళ్‌ లాంటి సంస్థలను నిషేధిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం కన్నడ నాట హాట్ టాపిక్‌గా మారింది. బజరంగ్‌ దళ్‌ని పీఎఫ్‌ఐ(PFI)తో పోల్చిన కాంగ్రెస్‌పై బీజేపీ ఎదురుదాడికి దిగింది. బజరంగ్‌ దళ్‌ని నిషేధించడమంటే హనుమంతుడిని ఆలయంలో పెట్టి తాళం వేయడమేనంటూ వితండ వాదన చేసింది. ముస్లిం ఓట్ల కోసం హిందువులను కాంగ్రెస్‌ ద్రోహం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టిందంటూ బీజేపీ పెద్దలు మాటల దాడి చేశారు. ప్రధాని మోదీ సైతం సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి హనుముంతుడిపై ఎనలేని ప్రేమ చూపించారు. బజరంగ్‌ దళ్‌ని బజరంగబలితో సాక్ష్యాత్తు మోదీనే పోల్చడం విడ్డూరం. లవర్స్‌ డే టైమ్‌లో పార్కుల్లో తప్ప మిగిలిన రోజుల్లో పెద్దగా కనపడని బజరంగ్‌ దళ్‌ లాంటి సంస్థను దేవుడితో పోల్చిన వైనం అక్కడి ప్రజలను కూడా షాక్‌కు గురిచేసింది. వాళ్లకి దేవుడితో పోలికేంటో అర్థంకాని దుస్థితి యావత్ దేశ ప్రజలది.

డప్పు కొట్టుకున్నా ప్రయోజనం శూన్యం:

బజరంగ్‌ దళ్‌ లాంటి సంస్థలు తప్పు చేస్తే పీఎఫ్‌ఐ తరహాలోనే బ్యాన్‌ చేస్తామని కాంగ్రెస్‌ ప్రకటించిన నాటి నుంచి బీజేపీ మద్దతుదారులు సోషల్‌ మీడియాలో ఓ కొత్త ప్రచారానికి తెరతీశారు. కాంగ్రెస్‌కు హనుమంతుడు బుద్ది చెబుతాడంటూ ‘జై బజరంగబలి’ నినాదాలతో ట్రెండింగ్‌లు చేశారు. ఇక విశ్లేషకులు సైతం కాంగ్రెస్‌ చివరి ఓవర్‌లో హిట్‌ వికెట్ చేసుకుందని.. గెలిచే స్థితిలో ఉన్న కాంగ్రెస్‌ బజరంగ్‌ దళ్‌ని నిషేధిస్తామంటూ తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుందంటూ అభిప్రాయపడ్డారు. అయితే ప్రజల తీర్పు మాత్రం వేరేలా ఉంది. బజరంగ్‌ దళ్‌కి బజరంగబలికి నక్కకు నాగ లోకానికి ఉన్న తేడాను గ్రహించిన కన్నడ ఓటర్లు బీజేపీని సైలెంట్‌గా సైడ్ చేశారు.

ఇకపై దేవుడి పేరు వాడుకుంటే ఇదే గతి?

ఇంకెంతకాలం దేవుడు పేరుతో రాజకీయాలు చేస్తారు? రాముడుతో పనైపోయిందని హనుమంతుడి జోలికొస్తే ఎలా? ఈ విషయం ఇప్పటికైనా బీజేపీ గ్రహిస్తే మంచిది. ప్రతీసారి ఒక్కటే ఫార్ములా వర్కౌట్ అవ్వదు. అది కూడా ప్రతి రాష్ట్రంలో ఓటర్ల నాడి ఓకేలా ఉండదు. యూపీలో చేసే మత రాజకీయాలు దక్షిణాదిలో చేస్తే ప్రజలు తిప్పికొడతారు. దేనికైనా లిమిట్ ఉంటుంది.. ఆ హద్దు బీజేపీ దాటిపోయింది..అందుకే కన్నడిగులు బీజేపీని దూరం పెట్టారు. మిగిలిన రాష్ట్రాల్లోనైనా దేవుడి పేరు వాడుకొని కాకుండా చేసిన అభివృద్ధి చూపించి ఓట్లు అడిగితే మంచిది. లేకపోతే కర్ణాటకలో పట్టిన గతే పడుతుంది.