జైపూర్ వేదికగా బిగ్ ఫైట్, ఆర్సీబీ సవాల్ కు రాజస్థాన్ రెడీ

ఐపీఎల్ 18వ సీజన్ లో ఆదివారం ఆసక్తికర పోరు జరగనుంది. జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ సీజన్ లో నిలకడగా రాణిస్తూ ప్లే ఆఫ్ రేసులో ముందుకెళుతున్న ఆర్సీబీ గత మ్యాచ్ లో ఓడిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 13, 2025 | 12:13 PMLast Updated on: Apr 13, 2025 | 12:13 PM

Big Fight In Jaipur Rajasthan Ready For Rcb Challenge

ఐపీఎల్ 18వ సీజన్ లో ఆదివారం ఆసక్తికర పోరు జరగనుంది. జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ సీజన్ లో నిలకడగా రాణిస్తూ ప్లే ఆఫ్ రేసులో ముందుకెళుతున్న ఆర్సీబీ గత మ్యాచ్ లో ఓడిపోయింది. హోంగ్రౌండ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై అనూహ్యంగా పరాజయం పాలైంది. ఇప్పుడు రాజస్థాన్ పై గెలిచి మళ్ళీ పుంజుకోవాలని భావిస్తోంది. నిజానికి ఢిల్లీతో మ్యాచ్ లో ఆర్సీబీకి అద్భుతమైన ఆరంభం దక్కింది. కానీ పవర్ ప్లే చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవంతో అనుకున్నంత స్కోర్ చేయలేకపోయింది. కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఫామ్ లో ఉన్నప్పటకీ కీలక సమయంలో ఔట్ అవుతుండడం ఆర్సీబీకి ఇబ్బందిగా మారుతోంది. మిడిలార్డర్ లో మరొక బ్యాటర్ రాణించడం లేదు. రజత్ పటిదార్ ఫామ్ కొనసాగిస్తున్నా… అతనికి సపోర్ట్ ఇచ్చే బ్యాటర్ ఉండడం లేదు. అటు బౌలింగ్ లోనూ ఆర్సీబీ మళ్ళీ గాడి తప్పింది. ఢిల్లీపై భువనేశ్వర్ కుమార్ తప్పిస్తే మిగిలిన బౌలర్లంతా తేలిపోయారు. హ్యాజిల్ వుడ్, యశ్ దయాల్ భారీగా పరుగులిచ్చేశారు. దీంతో రాజస్థాన్ బ్యాటర్లపై ఆర్సీబీ బౌలింగ్ కు సవాల్ గానే మారనుంది. కాగా ఆర్సీబీ తొలి మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ పై గెలిచి..తర్వాత చెన్నైని కూడా నిలువరించింది. కానీ మూడో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై పరాజయం పాలైన ఆర్సీబీ మళ్ళీ ముంబైని ఓడించి ఫామ్ అందుకుంది. అయితే బ్యాటర్ల వైఫల్యంతో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది.

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ క్రమంగా ఫామ్ అందుకుంది. ఆరంభంలో రియాన్ పరాగ్ కెప్టెన్సీలో పరాజయాలు చవిచూసిన రాజస్థాన్ ఇప్పుడు సంజూ శాంసన్ సారథ్యంలో మళ్ళీ గాడిన పడింది. తొలి రెండు మ్యాచ్ లలో ఓడిన ఆ జట్టు తర్వాత చెన్నై, పంజాబ్ లను ఓడించింది. గత మ్యాచ్ లో మాత్రం గుజరాత్ చేతిలో ఓడిపోయింది. జైశ్వాల్ ఫామ్ లోకి రావాల్సి ఉండగా… సంజూ , నితీశ్ రాణా, రియాన్ పరాగ్ లపై అంచనాలున్నాయి. హెట్ మెయిర్ ఇప్పటి వరకూ మెరుపులు మెరిపించలేదు. హోంగ్రౌండ్ కావడంతో రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ పై అంచనాలు పెరిగాయి. బౌలింగ్ లో సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, ఫరూఖీ, దేశ్ పాండే వంటి బౌలర్లు అంచనాలు అందుకుంటే మాత్రం ఆర్సీబీ బ్యాటర్లకు చుక్కలే. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడు విజయాలతో నాలుగో స్థానంలో ఉండగా.. రెండు విజయాలతో రాజస్థాన్ రాయల్స్ ఏడో ప్లేస్ లో కొనసాగుతోంది.

ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న జైపూర్ పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుందని అంచనా… అయితే పేసర్లు కూడా ప్రభావం చూపించే ఛాన్సుంది. ఈ పిచ్ పై ఛేజింగ్ టీమ్స్ రికార్డు మెరుగ్గా ఉంది. ఇదిలా ఉంటే ఇరు జట్ల మధ్య గత రికార్డులను చూస్తే హోరాహోరీగానే కనిపిస్తోంది. ఇరు జట్లు 29 మ్యాచ్ లలో తలపడితే 15 సార్లు ఆర్సీబీ, 14 మ్యాచ్ లలో రాజస్థాన్ గెలిచాయి.