ఆస్ట్రేలియాకు బిగ్ షాక్, మెగా టోర్నీకి కమ్మిన్స్ డౌట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచి జోష్ లో ఉన్న ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కు గాయమైంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచి జోష్ లో ఉన్న ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కు గాయమైంది. దీంతో ఈ మెగా టోర్నీలో అతను ఆడడం అనుమానంగా మారింది. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్.. లంకతో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్ కోసం జట్టును ప్రకటించింది. ఇందులో కమిన్స్ పేరు లేదు. వ్యక్తిగత కారణాలతో అతడు అందుబాటులో ఉండట్లేదని తెలిపింది. లంకతో సిరీస్ జరిగే సమయానికి కమ్మిన్స్ భార్యకు రెండో డెలివరీ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటే కమ్మిన్స్ కు ప్రస్తుతం చీలిమండ గాయమైంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా చీఫ్ సెలక్టర్ జార్జ్ బెలీ చెప్పాడు. కమిన్స్ కు త్వరలోనే గాయం తీవ్రత తెలుసుకోవడానికి స్కానింగ్ చేస్తారని చెప్పుకొచ్చాడు.
దీంతో, ప్యాట్ కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాడా లేదా అనేది ప్రస్తుతం అనుమానంగా మారింది. ఎందుకంటే గాయం తీవ్రత ఎక్కువ ఉంటే అతడు ఈ మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశం ఉందని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు ఆడతాడా లేదా అనేది ప్రస్తుతం కచ్చితంగా చెప్పలేమని క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు తెలిపాయి. స్కానింగ్ రిపోర్ట్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందేనని వెల్లడించాయి. ఒకవేళ కమ్మిన్స్ దూరమైతే మాత్రం ఆసీస్ కు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఎందుకంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కమిన్స్ అదరగొట్టాడు. లీడింగ్ వికెట్ టేకర్ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఫామ్ లో ఉన్న కమ్మిన్స్ పలు మేజర్ టోర్నీల్లో ఆసీస్ ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నాడు. వన్డే ప్రపంచకప్ , యాషెస్ సిరీస్, డబ్ల్యూటీసీ ఛాంపియన్ షిప్ తో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా కమ్మిన్స్ సారథ్యంలోనే ఆసీస్ గెలుచుకుంది.
ఇదిలా ఉంటే ఆసీస్ మరో పేసర్ హ్యాజిల్ వుడ్ కూడా గాయపడి భారత్ తో సిరీస్ మధ్యలోనే తప్పుకున్నాడు. ఒకవేళ వీరిద్దరూ అందుబాటులో లేకుంటే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ పేస్ ఎటాక్ బలహీనపడుతుంది. కాగా, ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ బీలో ఉంది. ఇదే గ్రూప్ లో అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 22న లాహోర్ వేదికగా ఇంగ్లాండ్ తో తలపడనుంది.