ఆస్ట్రేలియాకు బిగ్ షాక్, సిరీస్ నుంచి హేజిల్‌వుడ్ ఔట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతున్న వేళ ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్ వుడ్ గబ్బా టెస్టులో గాయపడ్డాడు. నాలుగోరోజు ఆట చివరి సెషన్ లో మైదానాన్ని వీడాడు. కొన్ని ఓవర్ల పాటు బౌలింగ్ చేసి గ్రౌండ్ ను వదిలి వెళ్ళాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతున్న వేళ ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్ వుడ్ గబ్బా టెస్టులో గాయపడ్డాడు. నాలుగోరోజు ఆట చివరి సెషన్ లో మైదానాన్ని వీడాడు. కొన్ని ఓవర్ల పాటు బౌలింగ్ చేసి గ్రౌండ్ ను వదిలి వెళ్ళాడు. కాలు పిక్కలు పట్టేయడంతో అతను బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో ఫిజియో వచ్చి అతన్ని తీసుకెళ్లాడు. అతడిని స్కానింగ్ కు పంపించినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. వేసిన కొన్ని ఓవర్లు 132 కి.మీ వేగంతో బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో ఈ ఆసీస్ పేసర్ కోహ్లీ వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతానికి ఆసీస్ బోర్డు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే గాయం తీవ్రత కాస్త ఎక్కువగానే ఉండడంతో సిరీస్ లో మిగిలిన రెండు మ్యాచ్ లకు అతను దూరమయ్యే అవకాశాలున్నాయి. తొలి టెస్ట్ తర్వాత అడిలైడ్ మ్యాచ్ కు గాయంతోనే హాజిల్ వుడ్ అందుబాటులో లేడు. అతని స్థానంలో స్కాట్ బొలాండ్ పింక్ బాల్ టెస్ట్ ఆడి రాణించాడు. అయితే మూడో టెస్ట్ సమయానికి హాజిల్ వుడ్ కోలుకోవడంతో బొలాండ్ బెంచ్ కే పరిమితమయ్యాడు.
ఇప్పుడు మిగిలిన రెండు మ్యాచ్ లకు అతను దూరమైతే బొలాండ్ తోనే ఆసీస్ రీప్లేస్ చేసే అవకాశముంది. ఇదిలా ఉంటే నాలుగో రోజు హేజల్ వుడ్ దూరం కావడంతో ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురు దెబ్బ తగలనుంది. ఫాస్ట్ బౌలింగ్ భారమంతా కెప్టెన్ కమ్మిన్స్, స్టార్క్ లపై పడనుంది. ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే భారత్ ను ఫాలో ఆన్ ఆడించాలన్న ఆస్ట్రేలియా కోరిక నెరవేరలేదు. రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో పాటు చివర్లో ఆకాశ్ దీప్, బుమ్రా కీలక పార్టనర్ షిప్ తో భారత్ ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కింది. చివరి వికెట్ పడకుండా బుమ్రా, ఆకాశ్ దీప్ పోరాటం టీమిండియాను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాయి. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే మరో 33 పరుగులు అవసరమైన వేళ 9వ వికెట్ పడినా.. చివరి వికెట్ కు బుమ్రా, ఆకాశ్ దీప్ అజేయంగా 39 పరుగులు జోడించడంతో టీమ్ ఊపిరి పీల్చుకుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 252 రన్స్ చేసింది.