వధువు, వరుడు.. ఒక పాము.. ఎవర్రా మీరంతా.. ఇదెక్కడి పైత్యం !
కాలంతో పాటు కల్యాణం చేసుకునే విధానాలు కూడా మారుతున్నాయ్. ఒకప్పుడు పెళ్లి పీటల మీదే పెళ్లి కూతురును చూసేవారు. ఆ తర్వాత పెళ్లి చూపుల కల్చర్ వచ్చింది. కాలంతో టెక్నాలజీ పోటీ పడుతున్న కాలంలో.. ప్రీ వెడ్డింగ్ కల్చర్ అని దాపురించింది ఒకటి ! పెళ్లికి ముందు.. ఇద్దరు కలిసి కొండలు, గుట్టల తిరుగుతూ.. ఫొటోలు, వీడియోలు తీసుకొని.. దోస్తులతో, ఫ్యామిలీతో పంచుకుంటారన్న మాట.
సినిమా ప్రోమోలకి మించి చేసుకుంటున్నారు చాలామంది ! ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో కొందరు చేస్తున్న పనులు ఇప్పుడు వెగటు పుట్టిస్తోంది. బురదలో కూరుకొని అచ్చిక బుచ్చికలాడిన జోడి ఒకటయితే.. మంటలు అంటించుకొని ఫొటో చేసుకున్న జంట మరొకటి. ఇలాంటి వారిని మర్చిపోక ముందే.. పిచ్చి పీక్స్‌కు చేరిందనేలా.. ఓ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంది. పాము కలిపింది ఇద్దరిని అనే కాన్సెప్ట్‌తో వాళ్లు చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలు, వీడియోలు చూసిన వారికి నవ్వాలో, ఏడవాలో కూడా తెలియని పరిస్థితి.
వివేక్ అనే యూజర్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్. ఫొటోషూట్ ద్వారా చిన్న కథను చెప్పే పయత్నం చేసిందా జంట. యువతి నడుస్తు వస్తుంటే.. పాము ఎదరవుతుంది. ఆమె భయపడి పోయి రెస్క్యూ సర్వీసుకు కాల్ చేసి పిలిపించింది. ఇందులో స్కూటీపై ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి.. అందులో ఓ వ్యక్తి యువతి వైపు చూసి నవ్వుతాడు. ఆ తర్వాత పామును బాక్సులో వేసుకొని వెళ్తూ.. యువతిని ఫోన్ చేయమని సైగ చేస్తాడు. ఆ తర్వాత వారు ఫోన్‌లో మాట్లాడుతూ ప్రేమలో పడిపోతారు. పాము కలిపింది ఇద్దరిని అనే థీమ్‌తో ఫొటో షూట్ నిర్వహించారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజమైన పాముతో షూటింగ్ ఏంట్రా.. మీ క్రియేటివిటీ కాకులెత్తుకెళ్ల అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఎవర్ర మీరంతా.. ఇంత వయలెంట్‌గా ఉన్నారేంటి అని కొందరు.. పిచ్చి బాగా ముదిరిపోయింది భయ్యా అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.