BJP-TDP: టీడీపీతో బీజేపీ పొత్తు.. పవన్‌కు సలహా ఇచ్చిన బీజేపీ

బీజేపీ తమతో కలవాలి అని టీడీపీ అడగదు. జనసేనతోపాటు టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని బీజేపీ చెప్పదు. దీంతో ఇంతకాలంగా ఈ పొత్తుపై ఎటూ తేలలేదు. తాజాగా.. దీనిపై బీజేపీ నుంచి ఒక ప్రకటన వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 4, 2024 | 08:15 PMLast Updated on: Jan 04, 2024 | 8:17 PM

Bjp Alliance With Tdp Bjp Leader Satya Kumar Advised To Pawan Kalyan

BJP-TDP: ఏపీలో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయనే సంగతి తెలిసిందే. మరోవైపు జనసేన-బీజేపీ కూడా కలిసే ఉన్నట్లు కనిపిస్తోంది. ఎటొచ్చీ బీజేపీ-టీడీపీ పొత్తు అంశంపైనే స్పష్టత రావడం లేదు. పవన్ మాత్రం బీజేపీని తమ కూటమిలోకి తేవాలని భావిస్తున్నారు. అయితే, ఇక్కడే బీజేపీ, టీడీపీ వ్యవహరిస్తున్న తీరే అనుమానాలకు తావిస్తోంది. బీజేపీ తమతో కలవాలి అని టీడీపీ అడగదు. జనసేనతోపాటు టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని బీజేపీ చెప్పదు. దీంతో ఇంతకాలంగా ఈ పొత్తుపై ఎటూ తేలలేదు.

YS SHARMILA: లైట్ తీస్కో..! షర్మిల చేరికను పట్టించుకోని టి కాంగ్రెస్..

తాజాగా.. దీనిపై బీజేపీ నుంచి ఒక ప్రకటన వచ్చింది. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవాలని పవన్ భావిస్తే.. టీడీపీ నుంచే ఆ ప్రకటన చేయించి ఉండాల్సిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. ఈ అంశంపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. పొత్తులపై బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని, తమ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని భావిస్తున్న పార్టీలు బీజేపీ అధిష్టానంతో మాట్లాడాలని సూచించారు. బీజేపీతో పొత్తు కోరుకుంటున్నట్లు టీడీపీ నేతలతో పవన్ చెప్పించాలన్నారు. యువగళం వేదిక మీదే బీజేపీతో పొత్తు కోరుకుంటున్నామని పవన్ టీడీపీతో చెప్పించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో బీజేపీ బలహీనంగా ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా బలంగా ఉన్నట్లు సత్యకుమార్ గుర్తు చేశారు. బీజేపీ.. టీడీపీతో పొత్తు కావాలనుకుంటే తమ పార్టీ జాతీయ నాయకత్వంతో పవన్, టీడీపీ నేతలు టచ్‌లోకి వెళ్లాలన్నారు.

ఈ వ్యాఖ్యలను బట్టి టీడీపీ, జనసేనతో కలిసేందుకు ఆ పార్టీ సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. జాతీయ పార్టీ, పైగా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి.. ఈ అంశంలో బీజేపీ నుంచి ప్రతిపాదన వచ్చే అవకాశం లేదని అర్థమవుతోంది. కానీ, టీడీపీ, జనసేన కలిసి.. పొత్తుపై అధిష్టానాన్ని కోరితేనే పొత్తు పొడిచే అవకాశం ఉంది. అంటే.. ఈ విషయంలో ముందడుగు వేయాల్సింది టీడీపీయేనని సత్యకుమార్ వ్యాఖ్యలతో స్పష్టమైంది. మరి ఆయన వ్యాఖ్యలపై జనసేన, టీడీపీ ఎలా స్పందిస్తాయో చూడాలి.