ఎన్టీఆర్ కి రాజకీయ పార్టీలు అరుదైన గౌరవాన్ని ఇవ్వడం వెనుక ఉన్న వ్యూహం ఇదేనా..?

వంద నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించిన కేంద్ర ప్రభుత్వం. ఈ నాణేనికి ఒకవైపు అభిమానం, గౌరవం అని తెగ చెప్పుకొస్తోంది. అయితే అదే నాణానికి మరో వైపు ఉన్న రాజకీయ కోణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 29, 2023 | 08:10 AMLast Updated on: Aug 29, 2023 | 12:50 PM

Bjp And Chandrababu Are Looking To Get Political Mileage By Using Ntrs Name

ఎన్టీఆర్ ఈపేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది నటనలో అద్భుతమైన ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. అలాగే తన స్వశక్తితో తెలుగుదేశంపార్టీ పెట్టి కేవలం 9నెలల అనతి కాలంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇంతటి మహానుభావునికి నేడు ఒక్కొక్కరు ఒక్కో రకమైన గౌరవాన్ని ఇస్తున్నారు. అప్పటి కాలం వ్యక్తికి ఇప్పుడు ప్రశంశల వర్షం కురిపించడం వెనుక మతలబు ఏంటి అనే సందేహం అందరిలో కాకపోయినా కొందరిలో అయినా కలుగవచ్చు. అందుకే దీని వెనుక ఉన్న రాజకీయ కోణాన్ని ఒక్కసారి గమనిద్దాం.

ఎన్టీఆర్ ను ముందుగా గుర్తించిన జగన్..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చేపట్టిన పాదయాత్ర సాక్షిగా ఎన్టీఆర్ ను ఒక సారి స్మరించుకున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాగా ఉన్న దానిని తాను అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా పేరు మారుస్తా అన్నారు. పాదయాత్రలో చెప్పిన విధంగానే జిల్లా విస్తరణలో భాగంగానే ఆయన పేరుతో నామకరణం చేశారు. దీంతో తాను ఎన్టీఆర్ వ్యతిరేకి కాదనే భావన ప్రజల్లో కలిగింపజేశారు. అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పరిపాలించారు. ఏ ఒక్కసారి కూడా ఇలాంటి ఆలోచనే చేయలేదు ఇతి అతనికి ఎన్టీఆర్ పై ఉండే చిత్తశుద్ది అని బాహాటంగానే విమర్శించారు. ఇలా చంద్రబాబును కార్నర్ చేస్తూ పొలిటికల్ గా మంచి మైలేజి సంపాదించారు.

శతజయంతి ఉత్సవాలు అందుకేనా..

ఎన్టీఆర్ పేరును వాడుకొని 151 సీట్లు సాధించి జగన్ కొట్టన బలమైన దెబ్బకు చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోలేదు. పైగా వెన్నుపోటు దారుడు అనే ముద్ర బలంగా ఉంది. దీనిని కడుక్కోవడం కోసం ఎన్టీఆర్ 100వ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ శతజయంతి పేరుతో అంగరంగ వైభవంగా ఒక ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రజనీకాంత్ ని కూడా ఆహ్వానించారు. అయితే అనుకున్నంత మేర ఈ కార్యక్రమం విజయవంతం కాలేదు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడిన మాటలు అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఈ కార్యక్రమం మైలేజ్ రాకపోగా డైవర్ట్ అయింది.

బీజేపీ వ్యూహం ఇదేనా..

ఇక పోతే బీజేపీ కూడా తాను ఏం తక్కువ తినలేదు అన్న కోణంలో వ్యవహరిస్తోంది. గత రెండు నెలల క్రితమే ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించింది. అప్పటి వరకూ క్రియాశీలకంగా ఉన్న సోము వీర్రాజును ఉన్న పళంగా తప్పించడానికి గల కారణం ఏంటని రాజకీయంగా కొంత చర్చ కూడా జరిగింది. ఇలాంటి క్రమంలో ఇక ఎన్నికలకు ఆరు నెలలు ఉన్న సమయంలో ఎన్టీఆర పేరును మరో సారి తెరపైకి తెచ్చింది. 100 రూపాయల నాణెం మీద ఎన్టీఆర్ బొమ్మను ముద్రించి దానిని రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటూ ఎన్టీఆర్ కుటుంబసభ్యులు అందరికీ ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు జేపీ నడ్డాతో రహస్యంగా సమావేశం ఏర్పాటు చేసి ఏపీ రాజకీయాలపై మంతనాలు జరిపినట్లు సమాచారం. పవన్ ద్వారా బీజేపీతో పొత్తు కుదరని పరిస్థితుల్లో తానే నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. పైగా పురందేశ్వరిని కూడా వెంటపెట్టుకోవడం తద్వారా ఎన్నికల నాటికి అందరూ కలిసికట్టుగా పొత్తులకు వెళ్ళే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒక యాంగిల్ లో చూస్తే బీజేపీకి కూడా టీడీపీ, పవన్ తో పొత్తు అవసరం అన్న విధంగానే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్థమవుతున్నాయి. దీనికి నిదర్శనమే పురంధేశ్వరి కీలకపదవిని కట్టబెట్టడం అని అంతా భావిస్తున్నారు.

ఈ వంద రూపాయల నాణెం కోసం చాలా మంది ఎన్టీఆర్ అభిమానులతో పాటూ మరికొందరు తెగ ఎగబడుతున్నారు. అంటే నేటికీ మన సమాజంలో ఎన్టీఆర్ అంటే పడిచచ్చే అభిమానులు లక్షల్లో ఉన్నారు. ఈ అభిమానాన్ని పావుగా వాడుకొని ఓటరుగా తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సరికొత్త విధానానికి బీజేపీ తెరలేపి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు వాపోతున్నారు. అయితే రానున్న రోజులో ఈ చర్యలు సఫలీకృతం అవుతాయా లేదా బెడిసి కొడతాయా అనేది వేచి చూడాలి.

T.V.SRIKAR