BRS and BJP: బీఆర్ఎస్ స్పీడ్‌కు బీజేపీ బ్రేకులు.. ఒక్కపనితో కారు పార్టీకి షాక్ ఇచ్చిందా?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 4, 2023 | 10:34 AMLast Updated on: Feb 04, 2023 | 10:34 AM

Bjp Breaks Brs Speed

కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో పక్కాగా తెలుసు అన్నట్లు అవసరం అయితే అన్ని పార్టీలతో కూటమి ఏర్పాటుకు సిద్ధమనే సంకేతాలు పంపారు ఖమ్మంలో! ఢిల్లీ మీద దండయాత్ర మొదలుపెట్టిన బీఆర్ఎస్.. ప్రతీ అవకాశాన్ని ఆయుధంగా మార్చుకుంటోంది. అదానీ, అంబానీ వ్యవహారంలో బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు మేలు చేస్తూ సామాన్య జనాలకు అన్యాయం చేస్తున్నారని అనేక సందర్భాల్లో ఆరోపించింది బీఆర్ఎస్.

ఇప్పుడు అదానీకి గ్రూపు సంస్థలపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదిక… స్టాక్ మార్కెట్ తో పాటు పొలిటికల్ సర్కిల్స్‌లో రేపుతున్న అలజడి అంతా ఇంతా కాదు. బీజేపీని ఇరుకునె పెట్టే వ్యూహం కోసం ఎదురుచూస్తున్న విపక్ష పార్టీలకు ఇప్పుడు ఆయుధం లభించినట్లు అయింది. హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అటు ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ కూడా వాయిదా తీర్మానాలు తీసుకువచ్చాయ్. ముందే ఊహించిందా.. ఇంకేదైనా కారణం ఉందో కానీ.. సరిగ్గా పార్లమెంట్ సమావేశాలకు ముందు రెండో చార్జిషీట్ బయటపెట్టింది.

ఇక్కడే కథ అసలు మలుపులు తిరిగినట్లు కనిపిస్తోంది. ఈ చార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరుతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరును కూడా చేర్చింది ఈడీ ! ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. విపక్షాలు దూకుడు పెంచుతాయని.. ముఖ్యంగా కారు పార్టీ జోరు చూపిస్తుందని తెలిసి వాళ్ల విరుగుడుకు.. ఈడీ చార్జిషీట్‌ను మంత్రంగా బీజేపీ వాడుకుందా అనే చర్చ జరుగుతోంది. ఆప్, బీఆర్ఎస్ బంధం బయటపడిందనే కామెంట్లు కమలం పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ల స్ట్రాటజీ ఏంటో !

పార్లమెంట్ సంగతి ఎలా ఉన్నా.. రాష్ట్రంలో బీజేపీకి ఇప్పుడు భారీ ఆయుధం దొరికినట్లు అయింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీంతో ఇక్కడ కారుకు, కమలానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. మద్యం కుంభకోణం వ్యవహారంలో మొదటి నుంచి బీఆర్ఎస్ మీద దూకుడు చూపిస్తున్న బీజేపీ.. ఇకపై మరింత జోరు పెంచే అవకాశాలు కచ్చితంగా ఉంటాయ్.

తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయ్. ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి సమావేశాలు ఇవి ! దీంతో రాజకీయంగా భారీ యుద్ధం జరగడం.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అది పీక్స్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రం విధానాలపై మొదటి నుంచి విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్… అదాని వ్యవహారంలో బీజేపీని నిలదీసే అవకాశం ఉంటుందని అనుకున్నారు. ఐతే మీరు అదానీ ఎత్తితే.. మేము అది ఎత్తుతాం అన్నట్లుగా మద్యం కుంభకోణం చార్జిషీట్ వ్యవహారాన్ని బీజేపీ ఆయుధంగా మార్చుకుంది. దీంతో యుద్ధం ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది మరింత ఆసక్తికరంగా మారింది.

(N)