Telangana BJP: కమలదళం ‘స్లో అండ్ స్టడీ’ ప్లాన్.. కాంగ్రెస్ ప్రకటించాకే బీజేపీ ఫస్ట్ లిస్ట్ ?
తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో బీజేపీ కాస్త ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.
బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ఆగస్టు చివరి వారంలోనే అని అందరూ అనుకున్నారు.. కానీ ఇప్పటిదాకా ఆ ఊసే లేదు. అసెంబ్లీ బరిలో నిలువబోయే బీజేపీ దిగ్గజాల మొదటి జాబితా సెప్టెంబరు మొదటివారంలోనే రిలీజ్ అవుతుందని ఎంపీ లక్ష్మణ్ స్వయంగా వెల్లడించారు. అయితే ఈవారంలో కూడా ఫస్ట్ లిస్టు రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఎందుకు ? అనే దానిపై రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఓ వైపుగా శరవేగంగా కేసీఆర్ అండ్ టీమ్ పావులు కదుపుతుంటే.. మరోవైపు బీజేపీ స్లోగా నిర్ణయాలు తీసుకుంటుండటం కొత్త చర్చకు తెరలేపుతోంది. పరిస్థితిని చూస్తుంటే.. బీజేపీ కంటే ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు రిలీజ్ చేసేలా ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇంత స్లోగా బీజేపీ వ్యవహరిస్తుండటం వెనుక కూడా బలమైన రాజకీయ వ్యూహం ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఇతర పార్టీల ముఖ్య నేతల చేరికతో కమల దళం మునుపటి కంటే చాలా బలోపేతమైంది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి.. కాంగ్రెస్ నుంచి ?
బీఆర్ఎస్ లో టికెట్లు దక్కని వారు కాంగ్రెస్ లోకి చేరుతుండటాన్ని గమనించిన బీజేపీ.. అలాంటి వారి కోసం పార్టీ తలుపులను తెరిచే ఉంచే ఉద్దేశంతో వేచిచూసే ధోరణిని అవలంభిస్తోందని పరిశీలకులు అంటున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ టికెట్స్ దక్కనివారు తమ పార్టీ వైపు చూసే అవకాశం ఉంటుందనే అంచనాతో బీజేపీ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది. బలమైన అభ్యర్థులు పార్టీలో చేరితే .. దానికి అనుగుణంగా ఇప్పటికే అంతర్గతంగా రెడీ చేసి పెట్టుకున్న జాబితాలో మార్పులు చేయాలని కమలదళం యోచిస్తోంది. బీజేపీలో టికెట్స్ ఆశిస్తున్నవారు ఒకవేళ భంగపాటుకు గురైతే ఇతర పార్టీలలోకి జంప్ అయ్యే అవకాశం ఉంటుందని పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాక.. జాబితాల విడుదల ప్ర్రక్రియను మొదలుపెడితే ఆ రిస్క్ ను కూడా అధిగమించవచ్చని బీజేపీ అనుకుంటోంది.
ప్లస్ ల కంటే మైనస్ లే ఎక్కువని..
దాదాపు 30 మంది బీజేపీ కీలక నేతలు ఈసారి పోటీకి రెడీ అవుతున్నారు. అయితే వీరి అభ్యర్థిత్వాలను ముందుగానే ప్రకటిస్తే వారంతా తమ నియోజకవర్గాలకే పరిమితమై ఇతర ప్రాంతాల్లో నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారనే అభిప్రాయంతో పార్టీ పెద్దలు ఉన్నారు.అందుకే అభ్యర్థుల ప్రకటన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని సమాచారం. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నందున ముందుగానే అభ్యర్థుల ప్రకటనతో భారీగా వ్యయం పెరుగుతుందని.. ఇటువంటి సమస్యలు తప్ప పెద్దగా సానుకూలత ఉండే అవకాశం లేదని బీజేపీ అగ్ర నేతలు భావిస్తున్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా కూడా అభ్యర్థుల ప్రకటన విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదని, పార్టీ కార్యక్రమాల నిర్వహణపైనే దృష్టిపెట్టాలని సూచించారు. ఈసారి రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వుడు స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను గుర్తించి వారిని పోటీకి దింపడం ద్వారా ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఒక్కో నియోజకవర్గంలో నుంచి ప్రజా బలమున్న ఇద్దరు నేతలను గుర్తించి వారిలో ఒకరిని ఫైనల్ చేయాలని నిర్ణయించుకున్నారు.