BJP MANIFESTO: మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు.. మేనిఫెస్టోలో బీజేపీ వరాలు !
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీలు, మహిళలే లక్ష్యంగా బీజేపీ తన మేనిఫెస్టోని ప్రకటించింది. మహిళలకు 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చింది.
BJP MANIFESTO: సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో బీజేపీ మేనిఫెస్టోని ప్రకటించింది. అందుకోసం 10 అంశాలతో కార్యాచరణ ప్రకటించింది. తెలంగాణకు మొదటి బీసీ సీఎం ను చేస్తామనీ హామీ ఇచ్చింది. హైదరాబాద్ లో బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిలీజ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీలు, మహిళలే లక్ష్యంగా బీజేపీ తన మేనిఫెస్టోని ప్రకటించింది. మహిళలకు 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చింది.
మహిళా రైతుల కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు, విత్తనాల కొనుగోలుకు 2 వేల 500 కోట్లతో ఇన్ పుట్ అసిస్టెన్స్ అందిస్తామన్నది. అలాగే ఉజ్వల లబ్దిదారులకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా అందించనుంది. EWS కోటాను అమలు చేస్తూ.. అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను 6 నెలల్లో భర్తీ చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. UPSC తరహాలో TSPSC గ్రూప్స్ పరీక్షలను నిర్వహిస్తామని బీజేపీ ప్రకటించింది. అలాగే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. మండల కేంద్రాల్లో నోడల్స్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్రంలో అర్హత కలిగిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల దాకా ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉచిత వైద్యం అందిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో తెలిపింది. అలాగే జిల్లా స్థాయిలో మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ నిర్మించడానికి చర్యలు తీసుకుంటామన్నది. సింగరేణి కార్మికులకు ఆదాయం పన్ను రీయింబర్స్ మెంట్, సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహణ, నిజాం ఫ్యాక్టరీ పునరుద్దరిస్తామని హామీ ఇచ్చింది. సమ్మక్క, సారలమ్మ జాతరను జాతీయ స్థాయిలో నిర్వహిస్తామని బీజేపీ తెలిపింది. వృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ యాత్రను అందిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఉద్యోగులు, ఫించనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర సమీక్షించడంతో పాటు.. గత పదేళ్ళ BRS పాలనలో జరిగిన కుంభకోణాలు అన్నింటిపైనా విచారణ కమిటీ ఏర్పాటు చేసి… దోషులను న్యాయస్థానం ముందు ఉంచుతామని హామీ ఇచ్చింది బీజేపీ. ధరణి స్థానంలో పారదర్శకమైన మీ భూమి పోర్టల్ వ్యవస్థను తెస్తామంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రత్యేక నోడల్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని బీజేపీ.. మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.