BJP on BRS: కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే.. బీజేపీ కొత్త వ్యూహంతో కేసీఆర్‌కు ఇబ్బందులేనా ?

కాంగ్రెస్, బీఆర్ఎస్ కలవాలంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు బీజేపీకి పెద్ద బూస్ట్ ఇస్తున్నాయి. ఆ రెండు పార్టీల్లో దేనికి ఓటేసినా అది కేసీఆర్ కు వేసినట్టేననే ప్రచారం మొదలు పెట్టింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 16, 2023 | 04:04 PMLast Updated on: Feb 16, 2023 | 4:04 PM

Bjp Targets Brs Over Komatireddy Comments

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని మలుపులు కనిపిస్తున్నాయ్. ఏ పావు ఎక్కడి నుంచి కదులుతుందో.. ఎక్కడికి దారి తీస్తుందో అంచనా వేయడం కష్టంగా మారిందిప్పుడు! బీఆర్ఎస్, బీజేపీ మధ్యే యుద్ధం అనుకుంటే.. కాంగ్రెస్‌ రయ్‌ అని దూసుకొచ్చింది రేసులోకి ! పాదయాత్రతో మైలేజ్‌ కూడగడుతోంది. దీంతో ఎప్పుడు ఏ పార్టీ రాజకీయంగా పైచేయి సాధిస్తుందో చెప్పే పరిస్థితి లేదు. మూడోసారి అధికారం దక్కించుకోవాలని బీఆర్ఎస్‌.. ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని బీజేపీ.. అధికారంలోకి వచ్చి బౌన్స్‌బ్యాక్‌ కావాలని కాంగ్రెస్‌.. ఇలా పార్టీల వ్యూహాలన్నీ అధికారం చుట్టే తిరుగుతున్నాయ్.

ఇలాంటి పరిణామాల మధ్య కోమటిరెడ్డి వ్యాఖ్యలు సంచలనం రేపాయ్‌. కాంగ్రెస్‌తో కేసీఆర్‌ కలవాలని అనుకుంటున్నారంటూ ఆయన చెప్పిన మాటలు.. రాజకీయంగా హీట్‌ రేపుతున్నాయ్. కారును, కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు ఏ అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న బీజేపీ.. కోమటిరెడ్డి మాటలను గట్టిగా పట్టుకుంది. దీన్నే జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. కారు పార్టీ, కాంగ్రెస్ ఒక్కటేనని.. హస్తానికి ఓటేసినా.. అది కారుకే చేరుతుందంటూ కొత్త రాగాన్ని అందుకుంది. కలిసి పోటీ చేయకపోయినా.. పోటీ చేశాక కలవడం మాత్రం గ్యారంటీ అని ప్రచారం మొదలుపెట్టింది. బీఆర్ఎస్‌కు సొంతంగా అధికారంలోకి వచ్చే నమ్మకం ఎలాగూ లేదని.. రెండు పార్టీలో ఒకటే అనే మాటలను బీజేపీ నేతలు జనాల్లోకి బలంగా తీసుకెళ్తూ.. కేసీఆర్‌ను, కారు పార్టీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కమ్యూనిస్టులను కలుపుకున్నారు.. ఎంఐఎం కూడా మిత్రపక్షంగా ఉంది.. గెలవలేమని తెలిసి కాంగ్రెస్‌తో లోలోపల ఒప్పందం కుదుర్చుకున్నారని.. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. అది చేరిది కారు ప్రాంగణానికే అని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

కారు, కాంగ్రెస్‌ ఒక్కటే అనే ప్రచారంతో.. జనాల అటెన్షన్‌ డ్రా చేయడంతో పాటు.. రెండు పార్టీల్లో నేతలకు గాలం వేయడం.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కేడర్‌ను తమవైపు తిప్పుకోవచ్చనే వ్యూహంతో బీజేపీ ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. అధికారం కోసం ఎంత దూరం వెళ్లేందుకు అయినా సిద్ధం అన్నట్లుగా కనిపిస్తున్న బీజేపీ.. కోమటిరెడ్డి మాటలను ఆయుధంగా మార్చుకుంటోంది. దీన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లి.. తమ పార్టీ బలం పెంచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. మరి ఇది వర్కౌట్ అవుతుందా అంటే.. రాజకీయంలో అసాధ్యమనేది లేదు అన్నది మరికొందరి అభిప్రాయం.