CM Jagan: బీజేపీ మాటా అమరావతే..! జగన్ వెనకడుగు వేయక తప్పదా ?
ఏపీ రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం ఆడుతున్న మూడుముక్కలాటకు చెక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. శాసన, న్యాయ, పాలనా రాజధాని పేరుతో ఏపీకి మూడు రాజధానులను ప్రకటించిన జగన్ దాన్ని పూర్తి స్థాయిలో ఇప్పటికీ అమలు చేయలేకపోయారు.
రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించి.. భారీ అంచనాలతో హైదరాబాద్ తరహా మహానగరాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినా.. ఆ తర్వాత వచ్చిన వైసీపీకి అమరావతి అంటే గిట్టలేదు. అమరావతిని టీడీపీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా ప్రొజెక్టు చేసిన జగన్ అండ్ కో.. చివరకు మూడు రాజధానుల జపం అందుకున్నారు. అయితే సీఆర్డీయే చట్టాన్ని రద్దు చేసి మూడు రాజధానుల దిశగా అడుగులు వేసినా.. ప్రాక్టికల్ గా మూడు రాజధానుల నుంచి పాలన మొదలు కాలేదు. మూడు రాజధానుల విషయంలో మిగతా పార్టీలన్నీ ఒకవైపు.. జగన్ మాత్రమే మరోవైపు ఉన్నట్టు కనిపిస్తోంది.
ఆ మూడు పార్టీల వాదనే నెగ్గబోతోందా ?
ఎవరెన్ని కుప్పిగంతులు వేసినా.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే.. మేం అధికారంలోకి రావడం ఖాయం.. మళ్లీ అమరావతిని పట్టాలెక్కించడం ఖాయం..ఇదీ టీడీపీ చెబుతున్నమాట. అటు బీజేపీ కూడా ఈ విషయంలో చాలా క్లారిటీతో ఉంది. చంద్రబాబు విధానాలను ఏపీ బీజేపీ నేతలు విమర్శించినా.. రాజధాని విషయంలో మాత్రం విజయవాడ నుంచి ఢిల్లీ వరకు అందరు బీజేపీ నేతలది ఒకటే మాట. మూడు వద్దు రాజధాని ముద్దు..ఇదే బీజేపీ విధానమని స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురంధేశ్వరి కూడా అమరావతే రాజధాని అని కుండబద్దలు కొట్టి చెప్పారు. కేంద్రం కూడా ఏపీకి అమరావతినే రాజధాని అని పరిగణిస్తున్నట్టు చెప్పారు. ఇక మరో వైపు జనసేనది కూడా మొదటి నుంచి ఇదే విధానం. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజధాని విషయంలో చాలా క్లారిటీతో ఉన్నారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ డ్రామాలాడుతోందని.. ఏపీకి ఎప్పటికీ అమరావతే కాపిటల్ గా ఉంటుందని పదేపదే చెబుతున్నారు.
అమరావతి విషయంలో టీడీపీకి పెరిగిన మద్దతు
విజయవాడ గుంటూరు మధ్య అమరావతి పేరుతో టీడీపీ రాజధానిని ప్రకటించడంపై అప్పట్లో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా…అంతిమంగా రాజకీయాలకు అతితంగా అందరూ ఆమోదించారు.ఏకంగా నిండు సభలో అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడంపై తనకు గానీ, తమ పార్టీకి గానీ ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అండ్ కో వాయిస్ పూర్తిగా మారిపోయింది.అమరావతి ఎక్కడికీ తరలిపోదూ అంటూ నాడు ప్రకటనలు గుప్పించిన వాళ్లే ఆ తర్వాత మూడు రాజధానుల పల్లవి అందుకున్నారు. రాజకీయంగా చంద్రబాబుపై ఎవరు ఎన్ని విమర్శలు గుప్పించినా.. గడిచిన నాలుగేళ్లుగా… మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న హడావుడి మాత్రం ప్రజల ఆమోదం పొందలేకపోయింది. రాష్ట్రానికి రాజధాని అంటూ లేకుండా చేశారన్న భావన ప్రజల్లోకి కూడా వెళ్లిపోయింది. ఇదే సమయంలో టీడీపీ వాదనకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలుగా టీడీపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీచేస్తాయో లేవో గానీ.. రాజధాని విషయంలో ఈ మూడు పార్టీలు ఓకే మాటపై ఉన్నాయి.
జగన్ కూడా అమరావతికి కట్టుబడతారా ?
జీవో కాగితాలపై రాజధానిని మూడు ముక్కులు చేస్తే సరిపోదు. మూడు రాజధానులు అన్నవి స్పష్టంగా ప్రజల కంటికి కనిపించాలి. అమరావతి నడిబొడ్డులో ఉన్న ఏపీ హైకోర్టు కర్నూలుకు తరలివెళితే తప్ప కర్నూలును న్యాయ రాజధాని అని పిలవలేదు. ఏపీ హైకోర్టును తరలించే ప్రతిపాదన ఏదీ తమ దగ్గర లేదని ఇప్పటికే కేంద్ర స్పష్టం చేసింది. అలాంటప్పుడు ఇక కర్నూలును న్యాయ రాజధానిగా ఎలా చూస్తాం. ఇదే సమయంలో జగన్ ఒక్కరు వైజాగ్‌కు మకాం మార్చగానే అది పరిపాలనా రాజధాని అయిపోదు. ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేని సందర్భంలో మూడు రాజధానులపై హడావుడి చేసి… పాలన సాగించినా.. అది ప్రాక్టికల్ గా మూడు రాజధానులు అనిపించుకోదు.
కేంద్ర వైఖరికి భిన్నంగా జగన్ ముందుకెళ్తారా ?
రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్రం నర్మగర్భంగా చెబుతున్నా.. ఏపీ రాజధాని విషయంలో మాత్రం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమరావతికే కట్టుబడి ఉంది. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ మూడు రాజధానులకు కేంద్రం మద్దతు ప్రకటించే అవకాశమే లేదు. ఇలాంటి సమయంలో మూడు రాజధానులపై జగన్ ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. అమరావతిలో పేదలకు ఇళ్లు పంచిపెట్టినా.. హైదరాబాద్ తరహా రాజధానిని లేకుండా చేశారన్న ఫీలింగ్ అయితే ఏపీ ప్రజలకు, వైసీపీయేతర పార్టీలకు ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా మూడు రాజధానులపై జగన్ ముందుకెళ్లడం ద్వారా రాజకీయంగా ఒనగూరే ప్రయోజనాలు కూడా పెద్దగా లేవు. అందుకే ఆయన కూడా అమరావతికి కట్టుబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైకి చెప్పకపోయినా.. ఎన్నికల వరకు మూడు రాజధానుల విషయంలో కదలిక లేకపోతే ఇలాగే భావించాలి.