Love Propose: శైవక్షేత్రంలో ప్రపోజ్ చేసిన జంటకు ఆలయ కమిటీ అభ్యంతరం.. మద్దతుగా నిలిచిన బాలీవుడ్ నటి..
ప్రేమంటే సులువు కాదురా అంటారు ఒకరు, ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా అంటారు మరోకరు, ప్రేమంటే నూరేళ్ళ మంట అని మరికొందరు ఇలా రకరకాలుగా భావిస్తారు. కానీ ఇక్కడ ఒక జంట మాత్రం ప్రేమంటే పవిత్రమైనదని చాటి చెబుతూ ఒక వీడియో తీసింది. దానిని యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఇప్పుడు వారిపై చర్యలు తీసుకోవాలని ఆలయ సిబ్బందిని కోరారు కొందరు. అదేంటి ప్రేమిస్తే.. ప్రేమను ఎక్స్ ప్రెస్ చేస్తే చర్యలు తీసుకుంటారా అనే సందేహం మీలో కలుగవచ్చు. వీరి గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది.
అది కేదార్ నాథ్ ఆలయం. చుట్టూ మంచు కొండలు. పైగా అద్భుతమైన వాతావరణం. ప్రశాంతమైన కమనీయ ప్రదేశం. అందులోనూ మహిమాన్విత శక్తి కలిగిన మహేశ్వరుని స్థలం. ఇక ఇంతకన్నా గొప్ప ప్రదేశం ఏముంటుంది చెప్పండి ప్రేమించడానికైనా, పెళ్లి చేసుకోవడానికైనా. ఒకరిని ఒకరం అర్థం చేసుకొని ప్రయాణం సాగించారు. దైవ సాక్షిగా మహాదివ్య క్షేత్రంలో తన ప్రేమను ప్రియుడికి చెప్పాలనుకుంది ప్రేయసి. ఇందుకు తగిన ఏర్పాట్లు పూర్తిచేసుకుంది. అందులో భాగంగా ఇరువురు పసుపు వర్ణంలోని వస్త్రాలు ధరించేలా ఆమె ప్లాన్ చేశారు. ఇక దైవ సన్నిధికి చేరుకొని ఆలయ గోపురాన్ని చూసి కళ్లు మూసుకొని నమస్కరించుకున్నారు ఇద్దరు. ఈ సమయంలో తన ప్రేయసి వెనక ఉన్న వారి అనుచరులతో ఉంగరం ఉండే బాక్స్ ఇవ్వమని చేతితో సైగ చేశారు. వారి సంబంధీకులు ఒకరు ఆ ఉంగరం ఉన్న బాక్స్ ని ఆమె చేతిలో పెట్టారు. అప్పటికీ నమస్కార ముద్ర నుంచి ప్రియుడు బయటకు రాలేదు. ఈలోపూ ఆమె మోకాలిమీద కూర్చొని ప్రేమను చెప్పేందుకు సిద్దపడ్డారు. అప్పుడే కళ్లు తెరిచి చూశాడు ప్రియుడు. ఇక చేతిలో ఉంగారాన్ని, ప్రేమను అంగీకరించమని తన ప్రియురాలు కూర్చున్న స్థితిని చూసి ఆనందంతో తన్మయత్వానికి గురైయ్యాడు ప్రియుడు. ఈ వీడియోను తమ ప్రేమకు చిహ్నంగా చిత్రీకరించుకొని యూట్యూబ్ లో పోస్ట్ చేశారు.
ఈ వీడియో వైరల్ కావడంతో వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆలయ సిబ్బంది పోలీసులను కోరారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పుడు అసలైన మలుపు తిరిగింది వీరి ప్రేమ కథా చిత్రం. వీరికి ప్రముఖ బాలీవుడ్ సినిమా నటి మద్దతుగా నిలిచారు. ఆమె పేరు రవీనా టాంజర్. కేజీఎఫ్ లో రాజకీయ నాయకురాలి పాత్ర పోషించి అందరికీ సుపరిచితురాలు అయ్యారు. తన ఇన్ స్టాగ్రామ్ లో వారిద్దరి ఫోటోను జత చేస్తూ ఒక సందేశాన్ని రాసుకొచ్చారు. ‘ ప్రేమించుకునే భక్తులకు దేవాలయం కంటే పవిత్రమైన స్థలం ఎక్కడ దొరుకుతుంది. పైగా ఇక్కడ ఆ దేవుని ఆశీర్వాదం కూడా లభిస్తుంది. అలాగే ప్రేమకు దేవుడు ఎప్పుడూ వ్యతిరేకం కాదు, పోనీ వ్యతిరేకంగా ఎప్పుడు మారాడో చెప్పాలన్నారు. అందరిలాగా వెస్ట్రన్ కల్చర్లో రోజాలు, గులాబీలు, చాక్లెట్లు, కొవ్వొత్తులు, రింగులు వంటి విలువైన వస్తువులు ఇచ్చి తమ ప్రేమను వెలువరచడమే మంచిదని భావిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అలాగే తమ ప్రేమ సఫలీకృతం కావాలని, దేవుడి ఆశీర్వాదం కోరుకున్న ప్రేమికుల జంటపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలపాలన్నారు’.
ఇలా వీడియోలు తీసి పోస్ట్ చేసిన వారిపై కొన్ని మంచి కామెంట్లు వస్తుంటే.. మరికొన్ని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరి కొందరు శివుడితో ఆటలా అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఏమిటీ పరాచకాలు దైవ సన్నిధిలో అంటూ మండిపడుతున్నారు. ఇంకొందరు ఇలాంటి చర్యలు పాల్పడకుండా ఆలయ ప్రాంగణంలోకి ఫోన్లు నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. పబ్లిక్ కామెంట్స్ ఇలా ఉంటే.. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీలు ఈ వీడియోపై పూర్తిస్థాయిలో వ్యతిరేకతను తెలుపుతున్నాయి. ఇలాంటి సమయంలో బాలీవుడ్ నటి నుంచి వచ్చిన మద్దతు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచిచూడాలి.
T.V.SRIKAR