పెర్త్ లో ఎర్త్ ఎవరికో ? బౌన్సీ పేస్ పిచ్ రెడీ

ఆస్ట్రేలియా అంటేనే పేస్, బౌన్సీ పిచ్ లు స్వాగతం పలుకుతాయి... ఇక్కడి పిచ్ లపై టెస్ట్ ఫార్మాట్ లో బ్యాటింగ్ చేయాలంటే చుక్కలు కనిపిస్తుంటాయి.. దిగ్గజ ఆటగాళ్ళు సైతం ఇబ్బందిపడిన పిచ్ లు ఆసీస్ లోనే చూస్తుంటాం.. ఇలాంటి వికెట్ల పైనే కంగారూలు ప్రత్యర్థి జట్లకు చెక్ పెట్టి పైచేయి సాధిస్తుంటారు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 13, 2024 | 05:53 PMLast Updated on: Nov 13, 2024 | 5:53 PM

Bouncy Pace Pitch Ready In Perth

ఆస్ట్రేలియా అంటేనే పేస్, బౌన్సీ పిచ్ లు స్వాగతం పలుకుతాయి… ఇక్కడి పిచ్ లపై టెస్ట్ ఫార్మాట్ లో బ్యాటింగ్ చేయాలంటే చుక్కలు కనిపిస్తుంటాయి.. దిగ్గజ ఆటగాళ్ళు సైతం ఇబ్బందిపడిన పిచ్ లు ఆసీస్ లోనే చూస్తుంటాం.. ఇలాంటి వికెట్ల పైనే కంగారూలు ప్రత్యర్థి జట్లకు చెక్ పెట్టి పైచేయి సాధిస్తుంటారు.. ఈ సారి కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం పేస్, బౌన్సీ పిచ్ లు రెడీ అవుతున్నాయి. తొలి మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న పెర్త్ లో బౌన్సీ వికెట్ సిద్ధమైంది. పేసర్లు ఈ పిచ్ పై పండగ చేసుకోవచ్చని క్యూరేటర్ చెబుతున్నాడు. పిచ్ గురించి అడిగినప్పుడు ఇది ఆస్ట్రేలియా, అందులోనూ పెర్త్ అనీ, వికెట్ పేసర్లకే పూర్తిగా అనుకూలిస్తుందంటూ ఒక్క మాటలో క్యూరేటర్ తేల్చేశాడు.

పెర్త్ లో ఆస్ట్రేలియాకు తిరుగులేని రికార్డుంది. ఇక్కడ ఆడిన అన్ని టెస్టుల్లోనూ కంగారూలదే గెలుపు… భారత్ తో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్ కూడా ఇక్కడ మ్యాచ్ లు గెలవలేకపోయాయి. చివరిసారిగా పెర్త్ లో పాక్ తో తలపడిన కంగారూలు 360 రన్స్ తేడాతో గెలిచారు. పాక్ ను రెండో ఇన్నింగ్స్ లో కేవలం 89 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇక 2018 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఇక్కడ మ్యాచ్ ఆడి పరాజయం పాలైంది. 146 పరుగుల తేడాతో ఆసీస్ విక్టరీ కొట్టింది. ప్రస్తుతం జట్టులో ఉన్న పాట్ కమ్మిన్స్, మిఛెల్ స్టార్క్, హ్యాజిల్ వుడ్ సైతం అప్పుడు చెలరేగిపోయారు. రెండు ఇన్నింగ్స్ లలోనూ ఆసీస్ పేసర్లదే పైచేయిగా నిలిచింది. నాలుగో ఇన్నింగ్స్ లో ఇక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.

అయితే 2018 పర్యటనలో పెర్త్ లోనే విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో 123 పరుగులతో భారత్ ను ఆదుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ మరోసారి కోహ్లీపైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం వైఫల్యాల బాటలో ఉన్న విరాట్ పెర్త్ లో రాణిస్తే మాత్రం భారత్ కు కలిసొస్తుందని చెప్పొచ్చు. అటు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ కూడా ఈ పిచ్ నుంచి ఎదురయ్యే సవాల్ ను ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. 2018లో పెర్త్ వేదికగా నిరాశపరిచిన రాహుల్, ఇటీవల ఆసీస్ ఏ జట్టుతో మ్యాచ్ లోనూ ఫ్లాపయ్యాడు. బ్యాటర్లకు ఛాలెంజ్ విసురుతున్న పెర్త్ వికెట్ ఎవరికి ఎర్త్ పెడుతుందో అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.