బాక్సింగ్ డే టెస్ట్, భారత తుది జట్టు ఇదేనా ?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడోసారి గెలవాలనుకుంటున్న టీమిండియాకు అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. తొలి టెస్టులో ఆసీస్ ను చిత్తు చేసినప్పటకీ... తర్వాత అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో పుంజుకున్న కంగారూలు సిరీస్ ను సమం చేశారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడోసారి గెలవాలనుకుంటున్న టీమిండియాకు అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. తొలి టెస్టులో ఆసీస్ ను చిత్తు చేసినప్పటకీ… తర్వాత అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో పుంజుకున్న కంగారూలు సిరీస్ ను సమం చేశారు. ఇక మూడో టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి మిగిలిన రెండు టెస్టులపైనే ఉంది. సిరీస్ లో ఆధిక్యం సాధించేందుకు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరేందుకు కూడా ఇరు జట్లకు ఈ రెండు మ్యాచ్ లు కీలకం కానున్నాయి. దీంతో మెల్ బోర్న్ వేదికగా జరిగే బాక్సింగ్ డే టెస్ట్ సిరీస్ ను డిసైడ్ చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో భారత తుది జట్టుపై కసరత్తు జరుగుతోంది. భారీ మార్పులు కాకున్నా పేస్ బౌలింగ్ విభాగంలో ఒక మార్పు జరిగే ఛాన్సుంది. నిజం చెప్పాలంటే ఈ సారి ఆసీస్ పర్యటనలో బూమ్రా తప్పిస్తే మిగిలిన పేసర్లంతా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. హైదరాబాదీ పేసర్ సిరాజ్ అయితే తీవ్రంగా నిరాశపరిచాడు.
అసలు కంగారు గడ్డపై మంచి రికార్డున్న సిరాజ్ పూర్తిగా తేలిపోయాడు. బుమ్రా ఒకవైపు వికెట్లు తీస్తున్నా.. మరోవైపు నుంచి సపోర్ట్ లేకపోవడంతో ప్రత్యర్థి జట్టుకు అడ్వాంటేజ్ గా మారింది. దీంతో నాలుగో టెస్టుకు సిరాజ్ ను తప్పిస్తారన్న వార్త కూడా వినిపిస్తోంది.
అతని స్థానంలో హర్షిత్ రాణాను తీసుకునే అవకాశాలున్నాయి. బుమ్రా, ఆకాశ్ దీప్ తో పాటు రాణ పేస్ త్రయం మెల్ బోర్న్ పిచ్ పై నిలకడగా రాణిస్తే ఆసీస్ కు కష్టాలు తప్పవు. అటు మెల్ బోర్న్ పిచ్ ను దృష్టిలో ఉంచుకుని ఒక స్పిన్నర్ తోనే భారత్ ఆడనుంది. దీంతో గబ్బాలో కీలక ఇన్నింగ్స్ ఆడిన రవీంద్ర జడేజానే తుది జట్టులో కొనసాగనున్నాడు. ఇక బ్యాటింగ్ లో మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనింగ్ కాంబినేషన్ పై మాత్రం కాస్త సందిగ్థత నెలకొన్నప్పటకీ… రోహిత్ శర్మ మరోసారి మిడిలార్డర్ కే పరిమితమయ్యే ఛాన్సుంది.
ఇదిలా ఉంటే వరుస వైఫల్యాలతో ఇబ్బందిపడుతున్న గిల్ ను తప్పించి ధృవ్ జురెల్ కు ఛాన్స్ ఇస్తారన్న వార్త వినిపిస్తోంది. గిల్ మరోసారి తనకి ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అదే సమయంలో జురెల్ భారత్ ఏ తరపున ఆసీస్ పిచ్ లపై రాణించడంతో అతని వైపు మేనేజ్ మెంట్ మొగ్గు చూపే ఛాన్సుంది.