The Great British Loot: బ్రిటన్ రాజకుటుంబంలో మన సంపదెంత…? బ్రిటీషోళ్లు దోచుకున్నదెంత? ఆ సంపద తిరిగొస్తుందా?

తెల్లోళ్లు మన దగ్గర నుంచి భారీ సంపదను దోచుకెళ్లారు. సంస్కృతికి, సంపదకు పుట్టినిల్లైన భారత్ నుంచి దొరికినవన్నీ ఎత్తుకెళ్లారు. కళ్లు చెదిరే సంపద చూసి, దోచుకోవడం మొదలుపెట్టారు. ఓడలకు ఓడలు బ్రిటన్‌కు కేవలం సంపదతోనే తరలిపోయాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 10, 2023 | 12:02 PMLast Updated on: Apr 10, 2023 | 12:02 PM

British Stole Jewels From India Not Only Kohinoor These Valuable Things From India And The World

The Great British Loot: బ్రిటీషోళ్లు మన దగ్గర్నుంచి ఎంత దోచుకున్నారు అంటే.. అసలు వాళ్లు దోచుకెళ్లనిదేంటి అనే మరో ప్రశ్న పుడుతుంది. వాళ్లు మన దగ్గర్నుంచి కళ్లుచెదిరే, వెలకట్టలేని సంపదను దోచుకెళ్లారు. అపురూప ఆభరణాలు, కళాఖండాలు ఇలా వాళ్ల కళ్లు పడ్డవేవీ మిగల్లేదు. ఇంతకీ ఇప్పుడీ సంపద విషయం ఎందుకూ అంటారా? మా దగ్గర్నుంచి దోచుకున్నది మాకు తిరిగి ఇవ్వండి అన్న డిమాండ్లు పెరుగుతున్న సమయంలో అసలు బ్రిటీష్ రాజకుటుంబ ఖజానాలో మన వస్తువులేమున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
భారత్ నుంచి బ్రిటీషోళ్లు ఏం ఎత్తుకెళ్లారంటే ఎవరైనా టక్కున చెప్పే సమాధానం కోహినూర్ అనే. అయితే, అదొక్కటేనా? ఇంకేం ఎత్తుకెళ్లలేదా? అంటే ఎందుకు లేదు. చాలానే ఉన్నాయి. తెల్లోళ్లు మన దగ్గర నుంచి భారీ సంపదను దోచుకెళ్లారు. సంస్కృతికి, సంపదకు పుట్టినిల్లైన భారత్ నుంచి దొరికినవన్నీ ఎత్తుకెళ్లారు. కళ్లు చెదిరే సంపద చూసి, దోచుకోవడం మొదలుపెట్టారు. ఓడలకు ఓడలు బ్రిటన్‌కు కేవలం సంపదతోనే తరలిపోయాయి. తమకు విధేయులుగా ఉన్న రాజ్యాల నుంచి పన్నులు, బహుమతుల రూపంలో, తమకు ఎదురు తిరిగిన రాజ్యాలను నాశనం చేసి జరిమానా రూపంలోనూ సంపదనంతా దోచుకున్నారు. మా దగ్గర్నుంచి ఎత్తుకెళ్లిన వెలకట్టలేని సంపదను మాకు ఇచ్చేయండి అంటూ వివిధ దేశాల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వస్తుండటంతో బ్రిటన్‌లోని మ్యూజియం అధికారులు, చరిత్రకారులు ఏ వస్తువు ఎక్కడ్నుంచి అక్కడకు చేరిందనేది ఆరా తీస్తున్నారు.
నిజాం నవాబు కానుక
బ్రిటన్ రాజుగా త్వరలో కింగ్ చార్లెస్-3 ప్రమాణం చేయబోతున్నారు. ఈ సమయంలో బ్రిటన్ రాచకుటుంబ సంపద మూలాలపై బ్రిటీష్ మీడియా ఫోకస్ పెట్టింది. కానీ రాజకుటుంబ ఖజానాలో ఉన్న సంపదలో ఏది, ఎప్పుడు, ఎక్కడ్నుంచి వచ్చిందన్నదానికి సంబంధించి పూర్తి వివరాలు లేవు. అందులోని లక్షల వస్తువుల్లో మన దగ్గర్నుంచి దోచుకున్నవి ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. వాటి మూలం భారత్‌లోనే అని తెలిసినా ఎక్కడ్నుంచి అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. కొన్నింటిపై మాత్రం స్పష్టత ఉంది. కింగ్ ఛార్లెస్ తల్లి క్వీన్ ఎలిజిబెత్ తన వెడ్డింగ్ గిఫ్ట్‌గా 3వందల వజ్రాలు పొదిగిన ప్లాటినమ్ నెక్లెస్‌ను ఎంచుకున్నారు. అందుకు అయిన ఖర్చును చెల్లించింది ఎవరో తెలుసా? హైదరాబాద్‌ నిజాం నవాబు.

తమ తరపున విలువైన బహుమతిని ఇవ్వదలచుకున్న నిజాం… దాన్ని ఎంచుకునే అవకాశం ఎలిజిబెత్‌కే ఇచ్చారు. ఆ బిల్లు మొత్తాన్ని నిజామే చెల్లించారు. ఆ విలువైన నగతో క్వీన్ ఎలిజిబెత్ ఉన్న ఫోటో 1953 నుంచి 1971వరకు పోస్టల్‌ స్టాంప్‌పై ఉండేది. అయితే రాయల్ కలెక్షన్స్‌లో ఉన్న ప్రతి ఆభరణానికీ ఇలాంటి మూలాలు లేవు. కోహినూర్ మన గుంటూరు నుంచే వెళ్లిందని చెబుతున్నా దానికి సంబంధించిన పూర్తి వివరాలు లేవు. బ్రిటన్ రాజకుటుంబంలో ఉన్న ఇలాంటి ఎన్నో నగలు ఎక్కడ్నుంచి ఎలా అక్కడికి చేరాయన్నదానిపై ఎలాంటి సమాచారం లేదు. వీటి మూలాల గురించి ఎంతోమంది చరిత్రకారులు, స్వతంత్ర నిపుణులు ఎన్నో పరిశోధనలు జరిపారు.

The Great British Loot
గంటకొకటి ధరించినా..
కింగ్ ఛార్లెస్‌కు అత్యంత ఇష్టమైన, నడుముకు ధరించే బంగారు నగను పంజాబ్ ఆక్రమణ సమయంలో చిన్నపిల్లవాడైన యువరాజు దులీప్ సింగ్ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ సంపాదించింది. కోహినూర్ కూడా అదే సమయంలో బ్రిటన్‌కు చేరింది. దీర్ఘచతురస్రాకార, షట్కోణ పచ్చలు పొదిగిన ఈ నగ గురించి బ్రిటన్ రాయల్ కలెక్షన్స్ ట్రస్ట్ ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. పంజాబ్‌ ఆక్రమణ సమయంలో భారత్‌ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ దోచుకున్న అరుదైన ఆభరణాలు, కళాఖండాలను చూసి క్వీన్ విక్టోరియాకు మూర్చ వచ్చినంత పనైందట.

గంటకొకటి పెట్టుకున్నా కొన్నేళ్ల పాటు తిరిగి ధరించాల్సిన అవసరం రానన్ని బంగారు ఆభరణాలు అవి. 1851 గ్రేట్ ఎగ్జిబిషన్‌లో వాటిని ప్రదర్శించారు. ఆ తర్వాత వాటిలో కొన్నింటిని క్వీన్ విక్టోరియాకు బహుకరించారు. కింగ్ ఛార్లెస్‌ నడుముకు ధరించే ఆ బంగారు నగ కూడా అందులో ఒకటి. 1840 సమయంలో మహారాజా షేర్‌సింగ్ కోసం దీన్ని తయారుచేశారు. ఆ తర్వతా అది వారసత్వంగా దులీప్‌సింగ్‌కు వచ్చింది. చివరకు లాహోర్‌ ఒప్పందంలో భాగంగా అది బ్రిటన్‌కు చేరి, క్వీన్ విక్టోరియా వద్దకు వచ్చింది. నిజానికి మహారాజా రంజిత్‌సింగ్ దాన్ని తన గుర్రాన్ని అలంకరించేందుకు వాడేవారని కూడా చెబుతారు. ప్రస్తుతం అది బ్రిటన్ విండ్‌సర్‌ క్యాజిల్‌లో ఉంది.
లక్షల ఆభరణాలు
బ్రిటన్ రాజకుటుంబ ఖజానాలో కొన్ని లక్షల బంగారు ఆభరణాలున్నాయి. వాటిలో చాలావాటికి రికార్డులు లేవు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం వెలుగొందిన సమయంలో వాటిని దారుణ పరిస్థితుల్లో స్వాధీనం దోచుకున్నట్లు చెప్పుకోవచ్చు. బ్రిటన్ రాజవంశ ఖజానాలోనే మరో అరుదైన వజ్రాభరణం ఉంది. ఓ అరుదైన కెంపు చుట్టూ రెండు వరసల్లో వజ్రాలు అమర్చి నీలం రంగులో తళుకులీనే బంగారు ఆభరణాన్ని బికనీర్‌ నుంచి సంపాదించినట్లు తెలుస్తోంది. అలాగే గ్వాలియర్ మహారాజా బహుకరించిన ఓ అరుదైన వజ్రాలు పొదిగిన నెక్లెస్‌, మైసూర్ మహారాజా బహుకరించిన రింగ్‌ కూడా ఆ జాబితాలో ఉన్నాయి. చాలా సందర్భాల్లో అప్పటి ఈస్ట్‌ ఇండియా అధికారులు తాము దోచుకున్న సంపదను బ్రిటన్‌కు పంపేవారు. తమ విధేయతను చాటుకోవడానికి రాజకుటుంబానికి కానుకలుగా అందించేవారు. అలా ఎన్నెన్నో మన గడ్డను దాటి పరాయి గడ్డపైకి చేరిపోయాయి.

The Great British Loot
వారికే తెలియనంత సంపద
1875-76లో కింగ్‌ ఎడ్వర్డ్‌ V11 భారత్‌లో పర్యటించారు. ఆ సమయంలో దాదాపు వందమంది సంస్థానాధీశులు ఆయన్ను కలిశారు. ప్రతి ఒక్కరూ తమ విధేయతను చాటుకోవడానికి, అతిథిని గౌరవించడానికి ఎంతో విలువైన, అపురూపమైన బహుమతులు అందించారు. వాటినే బ్రిటన్‌, యూరోప్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు కూడా. ప్రస్తుతం దొంగిలించిన, దోచుకున్న కళాఖండాలను వెనక్కు ఇవ్వాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయం బ్రిటన్ రాజకుటుంబానికి తెలుసు. అయితే ఏ వస్తువు ఎక్కడిదో వారికే తెలియదు. అది జరగాలంటే ముందు ఆ వస్తువులను ఓ పద్ధతి ప్రకారం కేటగిరీలుగా విభజించాల్సి ఉంటుంది. అయితే 2017లో బ్రిటన్ ప్రభుత్వం ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.

దాని ప్రకారం బాల్‌మోరల్, విండ్‌సర్‌, సాండ్రింగమ్ వంటి రాజప్రాసాదాల్లో ఎలాంటి సోదాలకు అనుమతి లేదు. బ్రిటన్‌లోని మ్యూజియంలు గతంలో తమ పాలకులు బలవంతంగా తీసుకున్న కొన్ని వస్తువులు, కళాఖండాలను వెనక్కు ఇవ్వడం ప్రారంభించాయి. కానీ రాజవంశం అలా ఇవ్వడం మొదలుపెడితే కొన్ని లక్షల వస్తువులను వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది. 1870 దశకం చివర్లో ఈస్ట్‌ ఇండియా కంపెనీకి కేంద్రంగా ఉన్న ఇండియా హౌస్‌కు ముప్పు ఏర్పడినప్పుడు అందులోని అంతులేని సంపదను విక్టోరియా ఆల్బర్ట్‌ మ్యూజియంకు తరలించారు. 1857లో తొలి స్వాతంత్ర్య సంగ్రామం తర్వాత భారత పాలకులుగా ఈస్ట్‌ ఇండియా కంపెనీని తొలగించి రాజకుటుంబం పరిధిలోకి తెచ్చారు. అప్పట్నుంచి జరిగిన దండయాత్రలు, దురాక్రమణలు, పిల్లలు లేని రాజుల నుంచి లాక్కున్న రాజ్యాల్లోని సంపద బ్రిటన్ రాజకుటుంబానికి చేరింది.
నాగరికతకు సాక్ష్యాలు
మనకు స్వాతంత్ర్యం వచ్చిన ఎన్నో సంవత్సరాల తర్వాత బ్రిటన్‌లోని మ్యూజియంలు మన దగ్గర నుంచి అక్కడకు చేరిన సంపద వివరాలను బయటపెట్టడం ప్రారంభించాయి. విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం తమ బేస్‌మెంట్‌లో మూలుగుతున్న 30వేలకు పైగా కళాఖండాల వివరాలను వెల్లడించింది. వాటిని ప్రదర్శనకు ఉంచింది. బ్రిటీష్ మ్యూజియంలోని రిలిజియన్‌ రూమ్, బుద్దిస్ట్‌ రూమ్‌లో మధ్యయుగం నాటి జైన్, బుద్దిస్ట్ కళాఖండాలు కొన్ని వేలున్నాయి. వాటి విలువను లెక్కగట్టడం అసాధ్యం.. అవి కేవలం విలవైనవే కాదు మన సంస్కృతికి చిహ్నాలు కూడా. ప్రపంచం కళ్లు తెరవకముందే విలసిల్లిన మన నాగరికతకు ప్రత్యక్ష సాక్ష్యాలు అవి. భారత ఉపఖండం నుంచి దోచుకున్న అరుదైన, లెక్కగట్టలేని సంపదతో లండన్‌లో గ్రేట్‌ ఇండియన్ మ్యూజియం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన స్వాతంత్య్రానికి ముందు వచ్చింది. దాన్ని మనం కట్టే పన్నులతోనే నిర్వహించాలని కూడా చూశారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు.
మనవి అనుకున్నవాటిని బ్రిటన్ నుంచి ఇప్పటికిప్పుడు మనం తీసుకునే పరిస్థితుల్లో లేము. ఒకవేళ మనం అడిగినా ఆ అపురూప, వైభవ చారిత్రక సంపదను తిరిగి ఇచ్చేంత పెద్దమనసు బ్రిటన్‌కు లేదు. ఆ రాజకుటుంబానికి అసలే లేదు.. కాబట్టి అవి మావే అని మనం చెప్పుకుని తృప్తి పడటం మినహా మరేం చేయలేం. లక్షల కోట్ల విలువ చేసే ఆభరణాలను తిరిగి తేలేకపోయినా కనీసం మన సంస్కృతికి సాక్ష్యాలైన అపురూప కళాఖండాలనైనా వెనక్కు తీసుకు వచ్చే ప్రయత్నం చేయగలగాలి.