టీఆర్ఎస్ ఇక లేదు బిజెపిలో విలీనం…?
తెలంగాణా రాజకీయాల్లో ఇక తెరాస అనే మాట వినపడదా…? కేసీఆర్ ఇక తెలంగాణా నాయకుడు కాదా…? ఆయనను బిజెపి తనలో కలుపుకోవడానికి రంగం సిద్దం చేసిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తాజాగా ఆర్ టీవీ బయట పెట్టిన ఒక్క కథనం తెలంగాణాలోనే కాదు దేశ రాజకీయాల్లో సంచలనం అవుతోంది. భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితిని కలిపేస్తున్నారు. కవితను, తనను కాపాడుకోవడానికి కెసిఆర్ చేస్తున్న రాజకీయమే ఇది అంటూ ఆర్ టీవీ స్పష్టంగా చెప్పింది.
లిక్కర్ స్కాం లో కవితను అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కెసిఆర్ ఒకరకంగా నరకం చూస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అవ్వడమే జీర్ణించుకోలేని కెసిఆర్ కు కవిత అరెస్ట్ తో పాటుగా తనను కూడా అరెస్ట్ చేయవచ్చు అనే వార్తలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు తనను కాపాడుకోవాలి… అలాగే కవితను బయటకు తీసుకు రావాలి అంటే బీజేపి తో మాత్రమే సాధ్యం అవుతుంది. అందుకే కెసిఆర్ నానా కష్టాలు పడుతున్నారు. ఏకంగా బిజెపితో విలీనం అనే మాట మాట్లాడినట్టుగా తెలుస్తోంది.
కేంద్రంలో బిజెపితో సఖ్యతగా ఉన్న పార్టీల కోసం కెసిఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి అన్నీ కాకుండా ఏకంగా బిజెపి తో వెళ్తే కేటిఆర్ కూడా సీఎం కావొచ్చు అనే భావనలోనే కెసిఆర్ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ తన దూకుడుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరిని కాంగ్రెస్ లో చేర్చుకుని అసలు సభలో బలం లేకుండా చేసే అవకాశం ఉంది. అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే బీఆర్ఎస్ ను బిజెపిలో కలిపేసి తాను రాజ్యసభ తీసుకుంటే… రాష్ట్రంలో రేవంత్ ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టవచ్చు అని కెసిఆర్ భావిస్తున్నారు.
నలుగురు రాజ్యసభ ఎంపీ పదవులు తనకు ఇవ్వాలని కెసిఆర్ అడిగినట్టు సమాచారం. ఇదే సమయంలో కవిత కోవర్ట్ గా మారి… కేజ్రివాల్ నే ప్రధాన దోషిగా చేసి తాను అప్రూవర్ గా మారితే బెయిల్ రావడమే కాకుండా… రాష్ట్రంలో తన తండ్రికి, సోదరుడుకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని బిజెపి ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అయితే దీనికి కవిత అంగీకరించకపోవడం తో కేటిఆర్, హరీష్ రంగంలోకి దిగి నేడు రాత్రి ఆమెతో సమావేశం అయ్యే ప్రయత్నం చేస్తున్నారట. మరి ఏం జరగబోతుంది ఏంటీ అనేది త్వరలో స్పష్టత రానుంది. బీఆర్ఎస్ విలీనం జరిగితే మాత్రం కేటిఆర్ వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్ధి కానున్నారు.