Revanth Reddy: కాంగ్రెస్ లోకి మరో బీఆర్ఎస్ సీనియర్ నేత.. రేవంత్ మంతనాలు సఫలమయ్యేనా..?

తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఒకరు కొన్ని పార్టీలో కొత్తగా చేరుతుంటే మరి కొందరు ఉన్న పార్టీలో నుంచి బయటకు వస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ కు మరో కీలక నాయకుడు రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 18, 2023 | 12:37 PMLast Updated on: Oct 18, 2023 | 12:37 PM

Brs Senior Leader Mallipeddi Sudhir Reddy Is Getting Ready To Join Congress

మేడ్చల్ అనగానే మల్లారెడ్డి పేరు గుర్తుకొస్తుంది. అక్కడి నుంచే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కేబినెట్లో కొనసాగారు. పైగా కేసీఆర్ కుటుంబంతో ఎనలేని సంబంధాన్ని కలిగి ఉన్నారు. అటు రాజకీయంగా, ఇటు కుటుంబ పరంగా మంచి సఖ్యతను కలిగి కాలం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో మల్లా రెడ్డికి పోటీగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్దమౌతున్నారు. ఇందులో భాగంగా నేడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి కలువనున్నారు. పార్టీలోకి రావల్సిందిగా కోరనున్నారు.

సుధీర్ రెడ్డి రాజకీయ అనుభవం..

మల్లిపెద్ది సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ లో కీలక నేతగా కొనసాగారు. 2014 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ తరఫున మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత 2018 లో జరిగిన ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ మేడ్చల్ పార్లమెంట్ సభ్యుడు మల్లారెడ్డిని తీసుకొచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టింది. అనూహ్యంగా ఆయన గెలిచారు. కేబినెట్లో మంత్రిగా కూడా కొనసాగారు. దీంతో సుధీర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ముగిసిపోయినట్లే అని భావించరు కొందరు. పైగా మల్లా రెడ్డి మంత్రి అయినప్పటి నుంచి ఈ ఇద్దరి నేతలకు మధ్య సఖ్యత కుదరడంలేదు. ఎడముఖం, పెడముఖంగా ఉన్నారు. గతంలో ఈ ఇరువురి విషయంలో మాజీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాజా జనగాం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. ఇద్దరి మధ్య సత్సంబంధాలు కుదిర్చేందుకు కృషి చేశారు. అవి బెడిసికొట్టాయి. అందులో భాగంగా సుధీర్ రెడ్డికి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి, ఆయన కుమారుడు శరత్ చంద్రా రెడ్డికి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని ఇప్పించే ప్రయత్నం చేశారు. తాజాగా కూడా మేడ్చల్ నియోజకవర్గాన్ని మల్లారెడ్డికే కేటాయించింది బీఆర్ఎస్ అధిష్టానం. దీంతో కాంగ్రెస్లోకి వెళ్లి ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నిలబడి గెలవాలని చూస్తున్నారు.

కాంగ్రెస్ అవకాశవాద రాజకీయం..

ఇలా బీఆర్ఎస్ తో పాటూ మల్లారెడ్డికి మధ్య రాజకీయ వైరం, ఆధిపత్య పోరు పెరిగిపోవడంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. అందుకే రేవంత్ రెడ్డి బరిలోకి దిగి కాంగ్రెస్లోకి ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సుధీర్ రెడ్డి మాత్రం తనకు మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తేనే కాంగ్రెస్లో చేరుతానని భీష్మించుకొని కూర్చున్నారు. పైగా సుధీర్ రెడ్డి రేవంత్ రెడ్డికి సమీప బంధువు కూడా. ఇదిలా ఉంటే మేడ్చల్ నుంచి హర్షవర్థన్ రెడ్డి, జంగయ్య యాదవ్, నక్క ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్క్రీనింగ్ కమిటీలో కూడా వీరి పేర్లు పరిశీలనకు వచ్చాయి. ఇలాంటి సందర్భంలో సుధీర్ రెడ్డికి టికెట్ ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి. టికెట్ ఇస్తే కాంగ్రెస్ పాజిటివ్ ఓట్లు, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు, బీఆర్ఎస్ వ్యతిరేకతతో పాటూ మల్లారెడ్డి నెగిటివ్ ఇంపాక్ట్ తీవ్రంగా ప్రభావం చూపి సుధీర్ రెడ్డి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాకున్న అనుకూల వాతావరణం మిగిలిన నేతలకు లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నమ్మిన నేతలకు నిరాశ తప్పదా..

కాంగ్రెస్ ను నమ్మి గడిచిన దశాబ్ధ కాలంగా పనిచేస్తున్న వారికి తీవ్ర నిరాశే ఎదురవుతుందని తెలుస్తోంది. గతంలో ప్రకటించిన తొలి జాబితాలో చాలా మంది బీఆర్ఎస్, బీజేపీ నుంచి వచ్చిన వారికే చోటు కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు బాహాటంగా విమర్శిస్తే మరికొందరు లోలోపల గుసగుసలాడుకుంటున్నారు. ఇలా అసమ్మతి నేతలు కాంగ్రెస్ ను వీడి ఇతర పార్టీల్లోకి తొంగి చూడటం వల్ల కాంగ్రెస్ కు కొంత వరకూ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పైగా ఇప్పుడు ఈ మేడ్చల్ నుంచి కూడా ఇలాంటి పరిణామాలే ఎదురైతే గతంలో టికెట్ తమకే వస్తుందని ఆశించిన వారి పరిస్థితి ఏంటి.. వారికి ఏం చెప్పి బుజ్జగిస్తుందో చూడాలి.

T.V.SRIKAR