KTR: దేశంలోనే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం.. ఎప్పుడూ ప్రజల్ని లైన్‌లో నిలబెట్టలేదు: కేటీఆర్
కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని నమ్మి, గొప్పగా పని చేసిన బీఆర్ఎస్ నేతలను కూడా ప్రజలు తిరస్కరించారు. గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు సహా పోడు పట్టాల పంపిణీ వంటి అనేక పథకాల్ని అమలు చేసినప్పటికీ.. గిరిజన ప్రాంతాల్లోనూ ప్రజలు బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వలేదు.
KTR: తమ పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ వందలాది సంక్షేమ పథకాల్ని అమలు చేసిందని, అయితే కాంగ్రెస్ పార్టీలాగా ఏనాడూ ప్రజల్ని లైన్‌లో నిలబెట్టలేదని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గురువారం జరిగిన మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. “కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామని అనుకోలేదు. అందుకే.. ఇష్టారీతిన హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని నమ్మి, గొప్పగా పని చేసిన బీఆర్ఎస్ నేతలను కూడా ప్రజలు తిరస్కరించారు.
Kadiyam Srihari: కాంగ్రెస్‌లో కుమ్ములాటలు మొదలు.. 2028లో అధికారం బీఆర్ఎస్‌దే: కడియం శ్రీహరి
గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు సహా పోడు పట్టాల పంపిణీ వంటి అనేక పథకాల్ని అమలు చేసినప్పటికీ.. గిరిజన ప్రాంతాల్లోనూ ప్రజలు బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వలేదు. ఈ అంశాలపై ఆత్మవిమర్శ చేసుకుని ముందుకెళ్తాం. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలేదని అంటున్నారు. కానీ, 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చాం. దేశంలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. 73 శాతం జీతాలు పెంచిన ఘనత కూడా కేసీఆర్‌దే. 29 లక్షల పింఛన్లను 46 లక్షలకు పెంచాం. ఇలాంటి అనేక అంశాల్ని చెప్పుకోవడంలో విఫలమయ్యాం. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది. పనులకంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే గెలిచేవాళ్లం. వందలాది పథకాలు అమలుచేసినప్పటికీ.. ఎప్పుడూ ప్రజల్ని లైన్‌లో నిలబెట్టలేదు.
ప్రజల సౌకర్యం చూశామే తప్ప రాజకీయ ప్రయోజనం, ప్రచారం గురించి పట్టించుకోలేదు. ప్రజలు మమ్మల్ని పూర్తిగా తిరస్కరించలేదు. బీఆర్ఎస్ మూడో వంతు సీట్లు గెలుచుకుంది. స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ వరకు పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. అన్నింటికీ మించి కేసీఆర్ లాంటి బలమైన నాయకుడు ఉన్నాడు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.