టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్... ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడే అవకాశాలు మెరుగయ్యాయి. భారత పేస్ ఎటాక్ ను లీడ్ చేస్తున్న బుమ్రా ఇటీవల సిడ్నీ టెస్ట్ సందర్భంగా వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. మ్యాచ్ మధ్యలోనే తప్పుకున్నాడు. స్కానింగ్ తర్వాత సర్జరీకి వైద్యులు రిఫర్ చేయడంతో మెగాటోర్నీకి అతను దూరమవుతాడని అనుకున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉన్న స్పెషలిస్ట్ దగ్గరకు బుమ్రా వెళ్ళనున్నాడు. ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి అతను కోలుకునే పరిస్ఖితి ఉందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించే టీమ్‌లో బుమ్రా పేరును సెలెక్టర్లు చేర్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెన్నునొప్పి ఎక్కువగా ఉండడంతోనే సిడ్నీ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ చేయలేదు. ఈ వెన్నునొప్పికి సంబంధించి న్యూజిలాండ్ ఆర్థోపెడిక్ సర్జన్ రోవాన్ షౌటెన్‌ను సంప్రదించాడు. 2023లో బుమ్రా వెన్ను గాయానికి రోవాన్ ఆధ్వర్యంలోనే సర్జరీ జరిగింది. మరోసారి గాయం తిరగబెట్టే అవకాశం ఉండటంతో బుమ్రా ఈ సర్జన్ సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్‌తో రోవాన్ టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. బుమ్రా గాయానికి సంబంధించిన అప్‌డేట్‌ను రోవాన్ స్వయంగా బీసీసీఐ వర్గాలతో చెప్పబోతున్నట్లు సమాచారం. మెడికల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతాడా లేదా అన్న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఐసీసీ రూల్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను జనవరి 12లోపు ఇండియా ప్రకటించాల్సివుంది. అయితే ఇదే ఫైనల్ టీమ్ కాదని, తొలుత టెంపరరీ టీమ్‌ను ప్రకటించి...గాయలు, ఫామ్ ప్రకారం తుది జట్టును ఫైనల్ చేయాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బుమ్రా ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేయగలడని తేలితేనే తుది జట్టులో చోటు దక్కుతుంది. ఈ విషయంలో రాజీ పడే పరిస్థితి లేదని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఎందుకంటే ఆసీస్ టూర్ లో బుమ్రాపైనే ఎక్కువగా భారం పడడం ప్రస్తుత వెన్నునొప్పికి కారణమైందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకే బుమ్రా లాంటి బౌలర్ విషయంలో బీసీసీఐ మరింత జాగ్రత్తగా వ్యవహరించనుందని బోర్డు వర్గాలు వెల్లడించాయి.[embed]https://www.youtube.com/watch?v=jUURWumh2zw[/embed]