బుమ్రా సరికొత్త చరిత్ర, ఐసీసీ ర్యాంకింగ్స్ లో రికార్డ్

2024ను బుమ్రా నామ సంవత్సరంగా చెప్పేయొచ్చు... ఎందుకంటే గత ఏడాది బుమ్రా ఫామ్ మామూలుగా లేదు.. మన పేస్ ఎటాక్ ను అద్భుతంగా లీడ్ చేస్తున్న బుమ్రా ఫార్మాట్ తో సంబంధం లేకుండా రికార్డుల మోత మోగించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 2, 2025 | 10:05 PMLast Updated on: Jan 02, 2025 | 10:05 PM

Bumrah Creates New History Sets New Record In Icc Rankings

2024ను బుమ్రా నామ సంవత్సరంగా చెప్పేయొచ్చు… ఎందుకంటే గత ఏడాది బుమ్రా ఫామ్ మామూలుగా లేదు.. మన పేస్ ఎటాక్ ను అద్భుతంగా లీడ్ చేస్తున్న బుమ్రా ఫార్మాట్ తో సంబంధం లేకుండా రికార్డుల మోత మోగించాడు. టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఈ స్టార్ పేసర్ ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ అదరగొడుతున్నాడు. నాలుగు టెస్టుల్లో ఏకంగా 30 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో 200 వికెట్ల మైలురాయితో పాటు ఆసీస్ గడ్డపైనా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్ల రికార్డును కూడా సాధించాడు. అద్భుతమైన ఫామ్ లో ఉన్న బుమ్రా తాజాగా మరోసారి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో 904 పాయింట్లతో అశ్విన్ పేరిట ఉన్న రికార్డును తాజాగా బుమ్రా 907 రేటింగ్ పాయింట్లతో బ్రేక్ చేశాడు.

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో బుమ్రా తన నంబర్ వన్ ర్యాంకును మరింత పదిలం చేసుకున్నాడు. మెల్‌బోర్న్ టెస్టులోనూ అద్భుతంగా రాణించిన ఈ స్టార్ పేసర్.. 907 రేటింగ్ పాయింట్లకు చేరుకున్నాడు. ఓవరాల్ గా అతని రేటింగ్ పాయింట్స్ ఆల్ టైమ్ లిస్టులో 17వ స్థానంలో ఉంది. ఈ లిస్టులో ఇంగ్లండ్ మాజీ పేస్ బౌలర్ సిడ్నీ బార్నెస్ 932 పాయింట్లతో టాప్ లో ఉన్నాడు. అతని తర్వాత జార్జ్ లోమాన్ 931, ఇమ్రాన్ ఖాన్ 922, ముత్తయ్య మురళీధరన్ 920 పాయింట్లతో తర్వాతి మూడు స్థానాల్లో ఉన్నారు. బాక్సింగ్ డే టెస్టులో బుమ్రా మరో ఘనతను కూడా సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసుకున్న భారత పేస్ బౌలర్ గా నిలిచాడు. తన 44వ టెస్టులోనే అతడు ఈ రికార్డు అందుకున్నాడు. అత్యంత వేగంగా 200 వికెట్లు తీసుకున్న ఇండియన్ బౌలర్లలో బుమ్రా.. జడేజాతో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. అశ్విన్ 37 టెస్టుల్లోనే 200 వికెట్లతో టాప్ లో ఉన్నాడు.

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులోనూ బుమ్రా 9 వికెట్లు తీశాడు. అటు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా తాజా ర్యాంకుల్లో ఒక స్థానం మెరుగుపరచుకొని మూడో ర్యాంకుకు చేరాడు. అటు పాకిస్థాన్ తో బాక్సింగ్ డే టెస్టులో రాణించి ఏడు వికెట్లు తీసిన సౌతాఫ్రికా పేస్ బౌలర్ మార్కో యాన్సెన్ కూడా ఆరు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంకులో నిలిచాడు.