కంగారూ గడ్డపై ఒకే ఒక్కడు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా బుమ్రా
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ ఆధిపత్యానికి తెరపడింది. వరుసగా మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవాలన్న ఆశలు బాక్సింగ్ డే టెస్టుతోనూ ముగిసిపోాగా.. కనీసం సిరీస్ ను సమం చేయాలన్న లక్ష్యం కూడా నెరవేరలేదు.
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ ఆధిపత్యానికి తెరపడింది. వరుసగా మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవాలన్న ఆశలు బాక్సింగ్ డే టెస్టుతోనూ ముగిసిపోాగా.. కనీసం సిరీస్ ను సమం చేయాలన్న లక్ష్యం కూడా నెరవేరలేదు. ముఖ్యంగా బ్యాటర్ల సమిష్టి వైఫల్యం ఈ సిరీస్ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అలాగే బౌలింగ్ లోనూ బూమ్రా తప్పిస్తే మిగిలిన వారంతా తేలిపోయారు. ఆసీస్ గడ్డపై గత టూర్ లో అద్భుతంగా రాణించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ సైతం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. బూమ్రా ఒక్కడే వికెట్లు తీస్తూ గెలుపుపై ఆశలు రేకెత్తించినా మిగిలిన బౌలర్లు చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు.ఓవరాల్ గా ఈ సారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే బుమ్రా అనే చెప్పుకోవాలి. 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో బుమ్రా నిలకడ అసాధారణమనడంలో ఎలాంటి డౌట్ లేదు.
ఎన్నో అంచనాలతో సిరీస్ ఆడిన బుమ్రా.. అంతకు ముంచి రాణించాడు. సిరీస్‌లో 32 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. దీంతో ఈ భారత ఫాస్ట్ బౌలర్ అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న బుమ్రా.. అంతకముందు ఇంగ్లాండ్, సౌతాఫ్రికా గడ్డపై ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. దీంతో మూడు ఫారెన్ కంట్రీస్ పై ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్న తొలి భారత క్రికెటర్ గా బుమ్రా అరుదైన రికార్డ్ సాధించాడు. 2021 ఇంగ్లాండ్ గడ్డపై.. 2024 లో సౌతాఫ్రికాపై బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ప్రస్తుతం టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్న బుమ్రా టాప్ ర్యాంక్ ను మరింత పదిలం చేసుకున్నాడు.
బుమ్రా తర్వాత 21 వికెట్లతో కమ్మిన్స్ రెండో స్థానంలో నిలిచాడు. భారత బౌలర్లందరూ ఈ సిరీస్ లో 48 వికెట్లు తీసుకుంటే బుమ్రా ఒక్కడే 32 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టులో 8 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. రెండో టెస్టులో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మూడో టెస్టులో 9 వికెట్లు.. నాలుగో టెస్టులో మరో 9 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చివరిదైన సిడ్నీ టెస్టులో 2 వికెట్లు తీశాడు. అయితే వెన్ను నొప్పితో రెండోరోజే మైదానాన్ని వీడాడు. తర్వాత స్కానింగ్ లో నొప్పి తీవ్రత ఎక్కువగా ఉందని తేలడంతో భారత్ ఈ స్టార్ బౌలర్ లేకుండానే రెండో ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది. బుమ్రా బౌలింగ్ చేయడానికి రాకపోవడంతో ఆసీస్ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఫలితంగా ఎటాకింగ్ బ్యాటింగ్ తో సిడ్నీ టెస్టులో గెలిచారు. మొత్తం మీద కంగారూలకు వారి సొంతగడ్డపైనే బుమ్రా కంగారు పుట్టించాడు.