Butter chicken dispute : బటర్ చికెన్ మీ బాబుదా ? కొట్టుకుంటున్న రెండు స్టార్ హోటల్స్
ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన బటర్ చికెన్, దాల్ మఖనీ ఎవరివి? వాటిపై హక్కు ఎవరికి ఉంది? బటర్ చికెన్, దాల్ మఖనీ కోసం ఢిల్లీకి చెందిన రెండు రెస్టారెంట్లు సిగపట్లు పడుతున్నాయి. ఈ రెండు వంటకాలను మొదట తయారు చేసింది తామంటే తామేనంటూ... గత కొన్నాళ్లుగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారం ముదిరి పాకాన పడటంతో న్యాయపోరాటానికి దిగాయి. దీంతో ఈ పంచాయితీ ఢిల్లీ హైకోర్టుకు చేరింది.
బటర్ చికెన్. ఈ పేరు వింటేనే నాన్‌వెజ్ ప్రియుల నాలుకలు నాట్యం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన భారతీయ వంటకం ఇది. మరి బటర్ చికెన్ మొదటగా ఎవరు తయారు చేశారో మీకు తెలుసా..? ఈ విషయంలోనే రెండు రెస్టారెంట్లు న్యాయ పోరాటం చేస్తున్నాయి.
ఢిల్లీ మోతీమహల్ రెస్టారెంట్ బాగా ఫేమస్. అలాగే దర్యాగంజ్ రెస్టారెంట్ కూడా. బటర్ చికెన్, దాల్ మఖనీ విషయంలో ఈ రెండు రెస్టారెంట్స్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాయి. దర్యాగంజ్ రెస్టారెంట్‌పై కేసు వేసింది మోతీ మహల్ రెస్టారెంట్. తమ వంటకాలను వాళ్లు కనిపెట్టినట్లు దర్యాగంజ్ చెప్పుకుంటోందని మోతీ మహల్ రెస్టారెంట్ ఆరోపిస్తోంది. దాల్ మఖనీని తమ పూర్వీకుడు హల్వాయి కుందన్‌లాల్ గుజ్రాల్ కనిపెట్టారని మోతీ మహల్ రెస్టారెంట్ చెబుతోంది. బటర్ చికెన్, దాల్ మఖనీని కనుగొన్నది మేమే అనే ట్యాగ్ లైన్‌ను మోతీ మహల్ వినియోగిస్తోంది. అది తమ బ్రాండ్ ఐడెంటిటీ అని ఆ సంస్థ చెబుతోంది. తమ వ్యాపారాన్ని, మోతీ మహల్ పేరును దర్యాగంజ్ రెస్టారెంట్ దెబ్బతీస్తోందని మోతీ మహల్ యజమానులు ఆరోపిస్తున్నారు.
భారతీయ వంటకాల చరిత్రలో బటర్ చికెన్, దాల్ మఖనీ గడిచిన 70యేళ్ళుగా పాపులర్ అయ్యాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వీటిని తయారుచేశారు. ప్రస్తుతం పాకిస్తాన్…. పెషావర్ సిటీలోని ఓ రెస్టారెంట్‌లో కుందన్ లాల్ గుజ్రాల్, కుందన్‌లాల్ జగ్గీ అనే ఇద్దరు వంటగాళ్లు పనిచేసేవారు. దేశ విభజన తర్వాత వాళ్ళిద్దరూ ఢిల్లీకి వచ్చారు. కుందన్ లాల్ గుజ్రాల్ మోతీ మహల్ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. ఓ రోజు అనుకోకుండా మిగిలిపోయిన తందూరీ చికెన్‌ను టమోటా, బటర్ గ్రేవీలో వేసి వండటంతో బటర్ చికెన్ తయారైందనేది ఓ కథనం. దాన్ని మోతీమహల్ రెస్టారెంట్‌లోనే మొదటిసారిగా తయారు చేశారని ఆ రెస్టారెంట్ నిర్వాహకులు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. అయితే కుందన్ లాల్ జగ్గీ వారసులు చెబుతున్నదాని ప్రకారం… 1947లో బటర్ చికెన్ ఆవిష్కరణ జరిగింది. రెస్టారెంట్ కట్టేసే సమయంలో కొందరు కస్టమర్లు రాగా… వారికి వడ్డించడానికి ఏమీ లేకపోవడంతో మిగిలిపోయిన తందూరీ చికెన్‌ను టమోటా, బటర్ గ్రేవీలో వేసి వండటం ద్వారా బటర్ చికెన్ తయారైంది అనేది దర్యాగంజ్ వాదన. కుందన్ లాల్ జగ్గీ వారసులే ఇప్పుడు దర్యాగంజ్ రెస్టారెంట్ నడిపిస్తున్నారు.
ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రాగా… దర్యాగంజ్ రెస్టారెంట్‌కు నోటీసులిచ్చింది కోర్టు. మే 29కి విచారణ వాయిదా వేసింది. దర్యాగంజ్, మోతీమహల్ ఈ రెండు రెస్టారెంట్లు బటర్ చికెన్, దాల్ మఖనీ ఆవిష్కర్తలం తామంటే తామని ప్రచారం చేసుకుంటున్నాయి. ఢిల్లీలోని దర్యాగంజ్ ఏరియాలోనే మొదటగా మోతీమహల్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. తమ గ్రూప్ వ్యవస్థాపకుడు కుందల్ లాల్ గుజ్రాల్ వీటిని కనుగొన్నారని మోతీ మహల్ వాదన. ఆయన వల్లే ప్రపంచవ్యాప్తంగా ఈ భారతీయ వంటకాలకు గుర్తింపు వచ్చిందని చెబుతోంది. అయితే, మోతీ మహల్ వాదనను దర్యాగంజ్ తోసిపుచ్చింది. తమ సంస్థ వ్యవస్థాపకుడైన కుందన్ లాల్ జగ్గి ఈ వంటకాలను కనిపెట్టారని దర్యాగంజ్ తరఫు న్యాయవాది వాదించారు. నిజానికి పాకిస్థాన్‌లోని పెషావర్‌లో మోతీ మహల్ రెస్టారెంట్ అనేది మోతి మహల్ గుజ్రాల్, దర్యాగంజ్ జగ్గీల జాయింట్ వెంచర్ అని వాదించారు. ఒక నెలలోగా సమాధానం ఇవ్వాలని దర్యాగంజ్ రెస్టారెంట్‌కు హైకోర్టు నోటీసులిచ్చింది.
బటర్ చికెన్, దాల్ మఖనీ ఈ రెండు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన భారతీయ వంటకాలు. వీటి టేస్ట్ సటిల్‌గా ఉండటంతో పాటు… కాస్త తియ్యగా, కాస్త స్పైసీగా ఉండటంతో బ్రిటీషర్లకు బాగా నచ్చింది. వాళ్ళ వల్లే ప్రపంచమంతా పాకింది.