Financial Crisis in India : ఆర్థిక సంక్షోభం సిగ్నల్స్.. ‘సేవింగ్స్’ సగానికి సగం డౌన్, ‘అప్పులు’ డబుల్
2047 సంవత్సరం కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అంటుంటే.. పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విడుదల చేసిన రిపోర్టులో ఇదే విధమైన అంశాలను ప్రస్తావించారు. దేశంలోని ప్రజల పొదుపులు గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో సగానికి సగం (55 శాతం) తగ్గి, ఏకంగా 47 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయినట్లు ఎస్బీఐ తాజా రీసెర్చ్ రిపోర్టు పేర్కొంది.
2047 సంవత్సరం కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటుంటే.. పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విడుదల చేసిన రిపోర్టులో ఇదే విధమైన అంశాలను ప్రస్తావించారు. దేశంలోని ప్రజల పొదుపులు గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో సగానికి సగం (55 శాతం) తగ్గి, ఏకంగా 47 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయినట్లు ఎస్బీఐ తాజా రీసెర్చ్ రిపోర్టు పేర్కొంది. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు దేశ ప్రజల అప్పుల భారం రెండింతలు పెరిగి రూ.15.6 లక్షల కోట్లకు చేరిందని నివేదికలో ప్రస్తావించారు. దేశంలోని చాలా ఫ్యామిలీల్లో సేవింగ్స్ తగ్గిపోయి, అప్పులు పెరగడం ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ఈ పరిణామాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగే ముప్పు ఉందని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్టు అభిప్రాయపడింది. గత ఏడాది వ్యవధిలో దేశ ప్రజలు చేసిన రూ.8.2 లక్షల కోట్ల అప్పుల్లో దాదాపు రూ.7.1 లక్షల కోట్లు బ్యాంకు లోన్లే ఉన్నాయన్నారు. ఇందులోనూ హౌసింగ్ లోన్లే ఎక్కువని చెప్పారు. ఇన్సూరెన్స్, పీఎఫ్, పెన్షన్ ఫండ్లలో దాదాపు రూ.4.1 లక్షల కోట్ల ప్రజల పెట్టుబడులు ఉన్నాయని నివేదిక వివరించింది. దేశ ప్రజల్లో ఎక్కువగా సేవింగ్స్ చేసే ఆర్థిక స్థోమత కలిగిన వారు.. ఆ డబ్బులను ఆస్తుల కొనుగోళ్లకు మళ్లిస్తున్నారని పేర్కొంది.
ఎస్బీఐ నివేదిక ఏం చెబుతోంది..?
గత రెండేళ్లలో చూసుకుంటే.. ప్రజలు తీసుకున్న లోన్లలో 55 శాతం రిటైల్ రంగంలోనే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా హోమ్, ఎడ్యుకేషన్, వెహికల్ లోన్స్ వాటా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి దేశ ప్రజలు తమ పొదుపు మొత్తాలను దాచుకోకుండా.. ఆస్తుల కొనుగోలుపై పెట్టుబడిగా పెడుతున్నారని ఎస్బీఐ నివేదిక విశ్లేషించింది. వాస్తవానికి భారత ప్రభుత్వ సాధారణ ఖర్చులకు, ఇతర నాన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ల వ్యయాలకు ప్రజల నుంచి జమయ్యే పొదుపే ప్రధాన ఆధారం. పొస్టాఫీసుల్లో జరిగే చిన్న మొత్తాల పొదుపును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే వాడుకుంటుంది. డిపాజిట్లలో వచ్చే నిధుల్లో కొంత శాతాన్ని బ్యాంకులు ప్రభుత్వ బాండ్లను కొనడానికి ఉపయోగిస్తాయి. ఆ బాండ్ల జారీ ద్వారా ప్రభుత్వం నిధుల్ని సమీకరించుకుంటుంది. నాబార్డ్ తదితర వ్యవసాయ సంబంధిత, పీఎఫ్‌సీ తదితర వ్యవసాయేతర సంస్థలు, ఎన్జీవోలు బాండ్ల జారీ ద్వారా పొదుపు నిధుల్నే పొందుతాయి. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా పొదుపుకు ఛాన్స్ లేకుండా పోవడం అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థలకు నిధుల లేమిని క్రియేట్ చేసే గండం ఉంది.
మన సేవింగ్స్ వేటి పై పెడుతున్నాం..?
గతంలో చేతిలో నాలుగు డబ్బులు ఉంటే మధ్య, ఎగువ మధ్య తరగతి వర్గాల ప్రజలు బ్యాంక్ డిపాజిట్లు, షేర్ మార్కెట్, బీమా పాలసీల వంటి ఫైనాన్షియల్ అసెట్స్‌లో పెట్టుబడి పెట్టేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా గోల్డ్, నివాస స్థలాలు, భవనాలు కొనేందుకు ఫండ్స్ ను వాడుతున్నారు. అయితే ఇందులో 80-90 శాతం స్థిరాస్తుల కొనుగోలుకే పోతోంది. స్థిరాస్తుల విలువ వేగంగా పెరుగుతున్నందున.. ప్రజల ఫోకస్ సేవింగ్స్ అకౌంట్లపై కంటే రియల్ ఎస్టేట్ పైనే ఎక్కువగా ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.