శ్రేయాస్ అయ్యర్ కు బై…బై.. కెప్టెన్ నే వదిలేస్తోన్న కేకేఆర్

ఐపీఎల్ రిటెన్షన్ జాబితా గడువు దగ్గరపడుతున్న వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని విధంగా పలువురు స్టార్ ప్లేయర్స్ కు ఫ్రాంచైజీలు షాకిస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 30, 2024 | 07:45 PMLast Updated on: Oct 30, 2024 | 7:45 PM

Bye Bye To Shreyas Iyer Kkr Is Leaving The Captain

ఐపీఎల్ రిటెన్షన్ జాబితా గడువు దగ్గరపడుతున్న వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని విధంగా పలువురు స్టార్ ప్లేయర్స్ కు ఫ్రాంచైజీలు షాకిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ మహ్మద్ షమీకి షాకిస్తే… ఇప్పుడు కోల్ కతా నైట్ రైడర్స్ ఏకంగా తమకు టైటిల్ అందించిన కెప్టెన్ నే వదిలేస్తోంది. గత సీజన్ లో నైట్ రైడర్స్ విజేతగా నిలవడంలో శ్రేయాస్ అయ్యర్ దే కీరోల్.. గంభీర్ మెంటార్ గా ఉన్నప్పటకీ గ్రౌండ్ లో జట్టును సమర్థవంతంగా లీడ్ చేసిన శ్రేయాస్ అయ్యర్ బ్యాట్ తోనూ రాణించాడు. అయితే కేకేఆర్ మాత్రం అతనికి గుడ్ బై చెబుతోందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ శ్రేయాస్ అయ్యర్‌ను సంప్రదించలేదని తెలుస్తోంది. జట్టు ఓనర్లకి శ్రేయాస్ అయ్యర్ కి మధ్య ఇప్పటివరకు ఎటువంటి చర్చలు కూడా లేవని సమాచారం. దీన్ని బట్టి చూస్తే కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి శ్రేయాస్ అయ్యర్ వైదొలగడం ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేకేఆర్ సైతం తమ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను రిటైన్ చేసుకునేందుకు ఎటువంటి ఆసక్తి చూపించడంలేదని తెలుస్తోంది.

దీంతో శ్రేయాస్ మెగావేలంలోకి రావడం ఖాయమైందని తెలుస్తోంది. ఒకవేళ వేలంలోకి వస్తే ఈ క్రికెటర్ ను తీసుకునేందుకు కొన్ని ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నాయి. గత సీజన్ లో బ్యాట్ పరంగా అతని ఫామ్ దీనికి కారణంగా చెప్పొచ్చు. ఐపీఎల్ 2024 సీజన్‌లో, శ్రేయాస్ అయ్యర్ 14 మ్యాచ్ లలో 351 పరుగులు చేయడంతో పాటు మూడోసారి కోల్ కతాను ఛాంపియన్ గా నిలిపాడు. శ్రేయాస్ వేలంలోకి వస్తే మాత్రం భారీ ధర పలకడం ఖాయం. ప్రధానంగా రెండు జట్లు అతని కోసం ప్రయత్నించే ఛాన్సుంది. పంత్ ఢిల్లీని వీడనున్నాడన్న వార్తల నేపథ్యంలో ఆ జట్టు శ్రేయాస్ కోసం బిడ్ వేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఢిల్లీకి శ్రేయాస్ అయ్యర్ ప్రాతినిథ్యం వహించాడు. శ్రేయస్ అయ్యర్ 2015లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అప్పట్నుంచి దాదాపు 6 సీజన్లపాటు దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 2015లో అయ్యర్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా అందుకున్నాడు.

తర్వాత పలు సీజన్లలో దిల్లీకి కూడా కెప్టెన్​గా వ్యవహరించిన అయ్యర్ 2020లో ఆ జట్టును ఫైనల్​ కు చేర్చాడు. కానీ టైటిల్ పోరులో ఢిల్లీని గెలిపించలేకపోయాడు. కాగా 2022 వేలంలో కోల్ కతా నైట్ రైడర్స్ 12.25 కోట్లకు శ్రేయాస్ ను దక్కించుకుంది. ఈ సారి అంతకంటే ఎక్కువ మొత్తమే అతనికి దక్కే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే కోల్ కతా ఆర్టీఎం ద్వారా శ్రేయాస్ ను మళ్ళీ తీసుకుంటుందేమోనన్న వార్తలు కూడా వస్తున్నాయి. వ్యూహాత్మకంగానే అతన్ని వేలంలోకి వదిలేస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. రిటెన్షన్ జాబితాను గురువారం సాయంత్రం లోపు ఫ్రాంచైజీలు సమర్పించాల్సి ఉంటుంది.