భారత క్రికెట్ లో గౌతమ్ గంభీర్ ఎలాంటి ఆటగాడో అందరికీ తెలుసు... సెహ్వాగ్ తో కలిసి ఎన్నో అద్భుతమైన ఆరంభాలనిచ్చాడు... 2011 వన్డే వరల్డ్ కప్ విజయంలో గంభీర్ ఎంతటి విలువైన ఇన్నింగ్స్ ఆడాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రిటైర్మెంట్ తర్వాత మెంటార్ గా, కోచ్ గా రాణిస్తున్నాడు. గంభీర్ మార్గనిర్దేశకత్వంలోనే కోల్ కత్తా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2024లో ఛాంపియన్ గా నిలిచింది. ఈ విజయంతోనే టీమిండియాకు కోచ్ గా అతన్ని బీసీసీఐ తీసుకుంది. ద్రావిడ్ తర్వాత కొన్ని ప్రత్యకమైన డిమాండ్లతో భారీ అంచనాల మధ్య కోచ్ గా గంభీర్ బాధ్యతలు తీసుకున్నాడు. కేకేఆర్ కు మూడుసార్లు ట్రోఫీ అందించిన గంభీర్.. టీమిండియాకు అదే సక్సెస్ అందిస్తాడని చాలా మంది ఆశ పడ్డారు. కానీ అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత భారత్ కొన్ని ఊహించని పరాభవాలను ఎదుర్కొంది. శ్రీలంకలో 27 ఏళ్ల తర్వాత ఓ వన్డే సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత స్వదేశంలో 12 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయింది. మరీ దారుణంగా న్యూజిలాండ్ చేతుల్లో 0-3తో వైట్ వాష్ అయింది. ఇక ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కూడా చేజార్చుకుంది. పదేళ్ల తర్వాత కంగారూలు మళ్లీ ఈ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. గత రెండు పర్యటనల్లో ఆస్ట్రేలియా గడ్డపై సంచలనాలు సృష్టించిన భారత జట్టు గంభీర్ కోచింగ్ లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. గెలవాల్సిన, డ్రా చేసుకోవాల్సిన మ్యాచ్ లలో కూడా ఓడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అగ్రెసివ్ ప్లేయర్ గా గుర్తింపు ఉన్న గంభీర్ నుంచి ఇలాంటి కోచింగ్ ఊహించలేకపోతున్నారు. హెడ్ కోచ్ గా గంభీర్ కు అసలు టీమ్ ను ఎలా ముందుకు నడిపించాలన్న ప్లానింగ్ ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతనికి ఆవేశం తప్ప ఆలోచన లేదని కొందరు అభిమానులు విమర్శిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి వాళ్లకు అసలు అవకాశాలు ఇవ్వకపోవడాన్ని ఉదాహరణగా చెబుతున్నారు. అలాగే చివరి టెస్టులో పేసర్ కు బదులు స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ను తీసుకోవడం కూడా చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సిరీస్ మధ్యలోనే అశ్విన్ లాంటి సీనియర్ స్పిన్నర్ రిటైరవడం, జట్టులో లుకలుకలున్నాయన్న వార్తలు, సీనియర్లు రోహిత్, విరాట్ కోహ్లి భవిష్యత్తుపై సందిగ్ధత.. ఇలా గంభీర్ కోచ్ అయిన తర్వాత అన్నీ ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా భారత జట్టు గతేడాది టీ20ల్లో తప్ప మిగిలిన ఫార్మాట్లలో అట్టర్ ఫ్లాప్ అయింది. చివరి 8 టెస్టుల్లో కేవలం ఒకే ఒక్కదాంట్లో గెలిచి.... ఆరింటిలో ఓడిపోయింది. ఈ వరుస పరాజయాలతోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. దీంతో గొప్ప ప్లేయర్ గొప్ప కోచ్ కాలేడా అన్న ప్రశ్న మళ్ళీ తలెత్తింది. ఇప్పుడు కొత్త ఏడాదిలోనైనా గంభీర్ వ్యూహాలు మారతాయా అనేది హాట్ టాపిక్ గా మారింది. వచ్చే నెలలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ఎలా సన్నద్ధం చేస్తాడనేది కూడా గంభీర్ కు సవాలే. డ్రెస్సింగ్ రూమ్ లో విభేదాలున్నాయంటూ వస్తున్న పరిణామాలను అధిగమించడం కూడా మరో ఛాలెంజ్ గా చెప్పొచ్చు.[embed]https://www.youtube.com/watch?v=pBKf1lZWonA[/embed]