Kishan Reddy: కిషన్ రెడ్డికి పగ్గాలిస్తే కేసీఆర్‌కు ఇచ్చినట్లేనా ? బీజేపీకి భారీ దెబ్బ పడబోతుందా ?
తెలంగాణ బీజేపీలో చకచకా పరిణామాలు మారిపోతున్నాయ్. బండి సంజయ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం.. ఆ తర్వాత ఆయన రాజీనామా చేయడం.. కిషన్‌రెడ్డికి తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగించడం గంటల వ్యవధిలో జరిగిపోయాయ్.
లుకలుకలతో సతమతం అవుతున్న బీజేపీపై.. ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న సంగతి ఎలా ఉన్నా.. కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించడం ద్వారా తెలంగాణ పార్టీకి ప్లస్సా.. మైనస్సా అనే చర్చే ఎక్కువ జరుగుతోంది. ఐతే కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడం అంటే.. బీజేపీ పార్టీ ఆఫీస్ తాళాలు కేసీఆర్ చేతుల్లో పెట్టడమే అనే చర్చ జరుగుతోంది. ఎన్నికల వేళ తెలంగాణలో కొత్త ప్రచారం ఊపందుకుంది. నిన్న మొన్నటివరకు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లు కనిపించిన రాజకీయం.. కర్ణాటక ఫలితాల తర్వాత పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ యుద్ధమే కనిపిస్తోంది ఇప్పుడు. ఇలా జరిగినా ఇంకోలా ఉండేదేమో సీన్.. కానీ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ ప్రచారం అందుకుంది. జరిగిన పరిణామాలు, జరుగుతున్న పరిణామాలను చూపించి.. ఇదే సాక్ష్యం అంటోంది హస్తం పార్టీ.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో బీజేపీ నేతలు మౌనం వహించడం.. ఈడీ, సీబీఐ సైలెంట్ అయిపోవడం.. ఇవన్నీ కారు, కమలం ఒకటే అని చెప్పడానికి సాక్ష్యాలు అంటూ కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఈ ప్రచారం ప్రభావం బీఆర్ఎస్ మీద ఎంత ఉంటుందో చెప్పడం కష్టమే కానీ.. బీజేపీ మీద భారీగా చూపిస్తుంది. ఇవన్నీ వదిలేస్తే.. గత ఎన్నికల్లో ఒక్కసీటు మాత్రమే గెలిచిన బీజేపీకి.. ఈస్థాయిలో జోష్ వచ్చిందంటే.. ఒకరకంగా బండి సంజయ్ కారణం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఏ దారిలో వెళ్లారు.. ఎలా వెళ్లారు అన్న సంగతి పక్కనపెడితే.. జనాల్లోకి దూకుడు మీద వెళ్లిపోయారు. ఆ దూకుడే బీజేపీని ఈ స్థాయిలో నిలబెట్టింది.
ప్రతిజ్ఞలు, పర్యటనలు, పాదయాత్రలు.. ఇలా ఎప్పుడూ జనాల్లోనే ఉంటూ.. జనాల్లో పార్టీని చర్చకు తీసుకువచ్చారు. ముఖ్యంగా యూత్‌లో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటిది ఇప్పుడు కిషన్ రెడ్డికి పగ్గాలు అంటే.. ఆ దూకుడు కనిపించే అవకాశం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి.. తెలంగాణలో మరోసారి.. కిషన్ రెడ్డి గతంలో రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. మాటల్లో కానీ, చేతల్లో కానీ.. కిషన్‌రెడ్డిలో పెద్దగా దూకుడుగా వ్యవహరించలేరు. ఇలా ఎలా చూసినా.. తెలంగాణ బీజేపీకి భారీ దెబ్బే అన్నది చాలామంది అభిప్రాయం. ఇదంతా ఎలా ఉన్నా.. బీఆర్ఎస్‌కు బీజేపీ బీ టీమ్ అనే ప్రచారం ఓ వర్గం జనాల్లో వినిపిస్తోంది. దూకుడు చూపిస్తే తప్ప ఇలాంటి ప్రచారాన్ని ఎదుర్కోవడం కష్టం. లేదంటే బీఆర్ఎస్‌కు బీజేపీ బీ టీమ్ అనే ముద్ర మరింతపడిపోతుంది. అది ఒకరకంగా కేసీఆర్‌కే ప్లస్ అవుతుంది.