Telangana Elections: సీఎం అభ్యర్థి లేకుండా.. కేసీఆర్ ను ఢీకొంటే.. ! ?
తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరో చెప్పకుండా ప్రతిపక్షాలు ఎన్నికలకు వెళ్లగలిగే సత్తా ఉందా..
ప్రతి ఒక్కరికి ఒక టైం ఉంటుంది.. ఇప్పుడు తెలంగాణలో కారు టైం నడుస్తోంది.. సీఎం కేసీఆర్ పట్టుకున్నదల్లా బంగారం అవుతోంది.. ఆయన బరిలోకి దింపే ప్రతి ఒక్కరూ లీడర్లుగా ఆవిర్భవిస్తున్నారు.. దీన్నిబట్టి కేసీఆర్ చరిష్మా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సీఎం సీటు అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మాత్రమే గుర్తుకు వస్తున్నారు. మరెవరినీ సీఎంగా తెలంగాణ ప్రజలు ఊహించుకునే పరిస్థితి లేదు. కేసీఆర్ లా డైనమిక్ వ్యవహరించే స్వేచ్ఛను ఇతర ఏ పార్టీలు కూడా వాటి లీడర్లకు ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ లో కేసీఆర్ ఒక్కరే వర్గం.. కానీ ఇతర పార్టీల్లో ఎన్నెన్నో వర్గాలు.. కుమ్ములాటలు. ఇదంతా తెలిసినా కాంగ్రెస్, బీజేపీలు కనీసం సీఎం అభ్యర్థి లేకుండా ఎన్నికల బరిలోకి దూకుతున్నాయి. సీఎం అభ్యర్థి ఎవరు ? అనే ప్రశ్నకు ఆన్సర్ చెప్పలేని స్థితిలో విపక్షాలు జనంలోకి వెళితే ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది ఈజీగా అంచనా వేయొచ్చు.
కాంగ్రెస్ వర్గపోరులో బిజీ..
తెలంగాణ కాంగ్రెస్ విషయానికి వస్తే.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టాక పార్టీ ఫామ్ లోకి వచ్చింది. కానీ దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల నాయకులు రేవంత్ కు అడుగడుగునా అడ్డు తగిలే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. రేవంత్ కు సహకరించే ఆలోచన వారికి ఉన్నట్టు కనిపించడం లేదు. తమ వర్గం వారికి, వారసులకు ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకోవడంపై పెడుతున్న ఫోకస్ లో.. పావులా వంతు ఫోకస్ కూడా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లడంపై కాంగ్రెస్ నేతలు పెట్టడం లేదనే వాదన ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి కీలక నేతల చేరికల వల్ల కాంగ్రెస్ గెలుస్తుందని భావించడం తప్పే అవుతుంది. కీలక నేతలు కొన్ని జిల్లాలను మాత్రమే ప్రభావితం చేయగలుగుతారు. కానీ సీఎం అభ్యర్థిత్వం కలిగిన ఒక నాయకుడు మాట్లాడితే.. యావత్ రాష్ట్రం ఆసక్తిగా వింటుంది. ఒక నిర్ణయం తీసుకుంటుంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థులుగా సీతక్క లేదా భట్టి విక్రమార్క ఉంటారనే చర్చ జరిగినా.. అధిష్టానం నుంచి దీనిపై అధికారిక ప్రకటనేదీ రిలీజ్ కాలేదు. దీంతో దిక్సూచి లాంటి సీఎం అభ్యర్థి లేకుండానే ఎన్నికల సముద్రాన్ని ఈదేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. కర్ణాటకకు తెలంగాణకు చాలా తేడా ఉంది. అక్కడ కేసీఆర్ లాంటి డైనమిక్ లీడర్ సీఎంగా లేకపోవడంతో కాంగ్రెస్ గెలుపు ఈజీ అయింది. సంక్షేమ పథకాలతో జనాకర్షణ ఎలా చేయాలో కేసీఆర్ కు కూడా బాగా తెలుసని హస్తం పార్టీ మర్చిపోకూడదు.
బీజేపీకి నో క్లారిటీ..
బీజేపీకి కూడా ప్రస్తుతానికి సీఎం అభ్యర్థిపై క్లారిటీ లేదు. అయితే బీసీలకే సీఎం సీటు ఇస్తామని ఆ పార్టీ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకు ఇదే సరైన నినాదమని కమలదళం జాతీయ నాయకత్వం భావిస్తోంది. తెరపైకి రకరకాల వ్యక్తుల పేర్లు వినిపించినా.. ఎవరికి సీఎం అభ్యర్థిత్వం కట్టబెడతారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉండిపోయింది. అయితే 2019 పార్లమెంటు ఎన్నికల తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ ను నియమించారు. తాజాగా ఆయనకు జాతీయ స్థాయి పార్టీ పదవిని కేటాయించారు. ఇక డాక్టర్ కే లక్ష్మణ్ ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా నియమించారు. ఈ నిర్ణయాలన్నీ బీసీలకు బీజేపీని చేరువ చేసే దిశగా తీసుకున్నవేనని అంటున్నారు. ఇక కిషన్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది.