Caste Census: తెలంగాణలో కులగణన.. బిల్లు ఆమోదించిన అసెంబ్లీ
జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే కుల గణన చేపడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు కొన్ని అనుమానాలు వచ్చే విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
Caste Census: తెలంగాణలో కులగణన చేపట్టబోతుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన బిల్లును శుక్రవారం అసెంబ్లీ ఆమోదించింది. ఈ మేరకు కులగణన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. తెలంగాణలో సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వేకు సంబంధించిన బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రతిపక్ష బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు స్వాగతిస్తూనే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
Malla Reddy: బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు.. మిషన్ మొదలు పెట్టేశారా? మల్లారెడ్డి మాటలతో కొత్త రచ్చ..
ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, మంత్రులకు మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. ఈ బిల్లును స్వాగతిస్తున్నామని, అయితే చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతమవుతుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దీనికి తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రెండ్రోజుల్లో బిల్లును ఆమోదించుకుందామన్నారు. అయితే, కులగణనకు చిత్తశుద్ధి అవసరమని, బిల్లు కాదని మంత్రి పొన్నం బదులిచ్చారు. కాగా, ఈ తీర్మానంపై చర్చ జరిగిన అనంతరం.. బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించిందని స్పీకర్ ప్రకటించారు. ఈ బిల్లు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర చర్చ జరిగింది. కులగణనపై తీర్మానం కాదు, చట్టం చేయాలని మాజీమంత్రి గంగుల కమలాకర్ కూడా డిమాండ్ చేశారు. బీసీ కులగుణనకు బిల్లు ప్రవేశపెడితేనే కార్యక్రమం ఫలప్రదం అవుతుందని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రంలో ఓబీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ పెట్టాలని గతంలో తమ ప్రభుత్వం డిమాండ్ చేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
బిల్లు కోసం అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే కుల గణన చేపడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు కొన్ని అనుమానాలు వచ్చే విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చర్చను ప్రతిపక్షం తప్పుదోవ పట్టిస్తోందన్నారు. మరోవైపు కులగణన తీర్మానంపై సీపీఐ హర్షం వ్యక్తం చేసింది.