దేశ వ్యాప్తంగా లారెన్స్ బిష్ణోయ్ అనే పేరు వింటే చాలు ఒక్కొక్కరికి వెన్నులో వణుకు పుడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేయడం చూసి... నార్త్ ఇండియా షేక్ అవుతోంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాబా సిద్దిఖీని అతని ఆఫీస్ లోనే కాల్చి చంపడం చూసి వీడు మామూలోడు కాదు అంటూ లారెన్స్ బిష్ణోయ్ గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుతోంది. ఉండేది జైల్లో... బెయిల్ పిటీషన్ వేయడు, జైలు నుంచి బయటకు రాడు... కాని అనుకున్నవి అనుకున్నట్టు పక్కా లెక్కతో ఫినిష్ చేస్తూ... పోలీసులకే సవాల్ చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ ను చంపడానికి పాకిస్తాన్ నుంచి భారీగా ఆయుధాలు లారెన్స్ గ్యాంగ్ కొనుగోలు చేసింది అనే వార్తతో దేశం మొత్తం షాక్ అయింది. బాబా సిద్దిఖీని చంపిన తర్వాత తామే చంపామని అతని తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్ ప్రకటించాడు. ఏప్రిల్ లో సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన సమయంలో కూడా అన్మోల్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేసాడు. అసలు సినిమా ముందు ఉంది అంటూ హెచ్చరించాడు. ఒక వైపు అన్న దెబ్బకే దేశం వణుకుతున్న సమయంలో తమ్ముడు ఎక్కడ ఉన్నాడో తెలియకుండా తమ గ్యాంగ్ ఎంత పవర్ ఫుల్ అనేది సవాల్ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కీలక ప్రకటన చేసింది. అన్మోల్ ఎక్కడ ఉన్నాడో చెప్తే పది లక్షల రివార్డ్ ఇస్తాం అంటూ ప్రకటన చేసింది. ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నట్లు అనుమానిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ₹ 10 లక్షల నజరానా ప్రకటించింది . గ్యాంగ్‌స్టర్ గత ఏడాది నకిలీ పాస్పోర్ట్ దేశం నుంచి పారిపోయాడు. ఈ ఏడాది కెన్యా, కెనడా దేశాల్లో అతను ఉన్నట్టు ఎన్ఐఏ సమాచారం అందుకుంది. అక్కడి నుంచే గ్యాంగ్ కు ఆదేశాలు ఇస్తున్నాడు అన్మోల్. 2022లో నమోదైన రెండు కేసుల ఛార్జ్ షీట్లలో అన్మోల్ బిష్ణోయ్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. 2022 మే లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కూడా అన్మోల్ నిందితుడుగా ఉన్నాడు. సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగిన ఘటనలో అతనిపై ముంబై పోలీసులు అతనిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. బాబా సిద్ధిక్ హత్యకు ముందు స్నాప్‌చాట్ మెసేజింగ్ యాప్ ద్వారా అన్మోల్ బిష్ణోయ్‌తో టచ్‌లో ఉన్నారని ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. బాబా సిద్ధిక్, ఆయన కుమారుడు ఎమ్మెల్యే జీషన్ సిద్ధిక్‌ల ఫొటోలను దాడికి ముందు అన్మోల్ వారికి పంపినట్లు గుర్తించారు. దీనితో అతని కోసం ముంబై పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ గాలిస్తున్నారు.