Sri Sri Daughter: జడ్జి అయిన మహాకవి శ్రీశ్రీ కూతురు
మహాప్రస్థానం సారథి, అభ్యుదయ కవితా వారధి శ్రీశ్రీ. ఆయన కుమార్తె నిడమోలు మాల కు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
శ్రీశ్రీ.. పలికేందుకు రెండు అక్షరాలే కావొచ్చు.. ఆయన కవితలు పరిచయం అయితే ప్రపంచం ఏంటో తెలుస్తుంది. ఆశే ఆయుధం అవుతుందని.. పోరాటంలో ఆనందం ఉంటుందని.. ఆకలి అమ్మలా పాఠం నేర్పుతుందని.. శ్రీశ్రీ కవితలు చదివితే అర్థం అవుతుంది ఇట్టే ! కష్టజీవికి ఇరువైపులా నిల్చేవాడే కవి అని కొత్త నిర్వచనం ఇచ్చిన ప్రజాకవి శ్రీశ్రీ. ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని కొత్తగా గొంతెత్తి సంచలనం సృష్టించిన మహాకవి శ్రీశ్రీ. ఆకాశమార్గాన పయనించే తెలుగు కవిత్వాన్ని భూమార్గం పట్టించి, భూకంపం పుట్టించి, అనితరసాధ్యం నామార్గం అని చాటిన అభ్యుదయ కవి. భావకవిత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేసి, అభ్యుదయ కవితా ప్రస్థానాన్ని శ్రీకారం చుట్టాడు.
శ్రీశ్రీ చనిపోయిన తర్వాత ఆయన కుటుంబం గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. వాళ్లంతా ఎక్కడ ఉంటున్నారు.. ఏం చేస్తున్నారనే విషయాలు ప్రచారంలో కూడా లేవు. ఐతే శ్రీశ్రీ కూతురుకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీశ్రీ కూతురును మద్రాసు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. శ్రీశ్రీ కుమార్తె జస్టిస్ నిడమోలు మాలా.. ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. గతేడాది మార్చిలో ఆమె అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఆమెకు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది.
శ్రీశ్రీ, సరోజ దంపతులకు నలుగురు సంతానం కాగా.. వారి చిన్న కుమార్తె మాలా. మద్రాస్ లా కాలేజీ నుంచి న్యాయవాది కోర్సులో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన మాలా.. మద్రాస్, పుదుచ్చేరి బార్ అసోసియేషన్‌లో 1989లో పేరు నమోదుచేసుకున్నారు. 32ఏళ్ల పాటు మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. ముందు ఆమె 2020లో పుదుచ్చేరి ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టారు. గతేడాది జస్టిస్ మాలాను మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. మాలా భర్త నిడుమోలు రాధా రమణ.. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.