చాహల్ కొట్టావుగా జాక్ పాట్, రూ.18 కోట్లు పలికిన స్పిన్నర్
ఐపీఎల్ వేలం అంటేనే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్... అనామక ఆటగాళ్ళపై కోట్ల రూపాయల వర్షం కురుస్తుంది... అంచనాలు పెట్టుకున్న స్టార్ ప్లేయర్స్ కు తక్కువ ధరే పలుకుతుంది... వేలం జరిగిన ప్రతీసారీ సంచలనాలు నమోదవుతూనే ఉంటాయి.
ఐపీఎల్ వేలం అంటేనే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్… అనామక ఆటగాళ్ళపై కోట్ల రూపాయల వర్షం కురుస్తుంది… అంచనాలు పెట్టుకున్న స్టార్ ప్లేయర్స్ కు తక్కువ ధరే పలుకుతుంది… వేలం జరిగిన ప్రతీసారీ సంచలనాలు నమోదవుతూనే ఉంటాయి. తాజాగా సౌదీ అరేబియన్ సిటీ జెడ్డా వేదికగా ఐపీఎల్ వేలంలో తొలిరోజే ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. పలువురు ప్లేయర్స్ కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. ముఖ్యంగా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ జాక్ పాట్ కొట్టాడు. కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయాడు. ఏకంగా 18 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది . ఈ స్పిన్నర్ కు ఇంత భారీ ధర వస్తుందని ఎవ్వరూ ఊహంచలేదు. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు ఆడిన చాహల్ ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు.
2022 నుంచీ రాయల్స్ కే ప్రాతినిథ్యం వహిస్తూ అదరగొడుతున్నాడు. 2024 సీజన్‌లో 15 మ్యాచ్‌లల్లో 18 వికెట్లను పడగొట్టి తన స్పిన్ మ్యాజిక్ ను చూపించాడు. ఐపీఎల్ లో 200 వికెట్లను పడగొట్టిన మొట్టమొదటి బౌలర్ చాహలే. తొలుత చాహల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీ పడ్డాయి. ఆ తరువాత డ్రాప్ అయ్యాయి. దీనితో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోటీ నెలకొంది. నాణ్యమైన్ స్పిన్ బౌలర్ కోసం పోటీపడ్డ పంజాబ్ చివరికి భారీ ధరకే అతన్ని సొంతం చేసుకుంది. టీ20ల్లో 5 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ రికార్డు కలిగి చాహల్.. 2011లో ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్ కెరీర్ ప్రారంభించాడు. 2014-21 మధ్య విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ లో ఉన్నాడు. 160 మ్యాచ్‌లలో చహల్ 7.84 ఎకానమీతో 205 వికెట్లు పడగొట్టాడు. ఆరుసార్లు 4 వికెట్లు, ఒకసారి 5 వికెట్లు తీసుకున్నాడు. 2022లో రాయల్స్ ఫైనల్‌కు చేరినప్పుడు చహల్ పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు.
ఆ సీజన్‌లో అతను కీలక పాత్ర పోషించి 17 మ్యాచ్‌లలో 27 వికెట్లు తీసుకున్నాడు. ఆర్‌సీబీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా ఘనత సాధించాడు. పురుషుల టీ20 అంతర్జాతీయ చరిత్రలో భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గానూ నిలిచాడు. కాగా గత ఐపీఎల్ వేలంలో చాహల్ 6.5 కోట్లకు రాజస్థాన్ తీసుకోగా… ఈ సారి ఏకంగా రెండున్నర రెట్లు ఎక్కువ ధర పలికాడు. తద్వారా లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన స్పిన్నర్ గా రికార్డు సృష్టించాడు.