పాక్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ఔట్ ? సౌతాఫ్రికాలో నిర్వహించే ఛాన్స్
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన ఓవరాక్షన్ కు మూల్యం చెల్లించుకోనుందా... అంటే అవుననే అనాల్సి వస్తోంది. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాక్ బోర్డు ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలుపెట్టింది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన ఓవరాక్షన్ కు మూల్యం చెల్లించుకోనుందా… అంటే అవుననే అనాల్సి వస్తోంది. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాక్ బోర్డు ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలుపెట్టింది. అయితే ఈ టోర్నీలో పాల్గొనే 8 దేశాల్లో భారత్ కూడా ఒకటి.. అన్ని దేశాలు పాక్ వెళ్లేందుకు అంగీకరించినా… భారత్ మాత్రం అక్కడ ఆడేది లేదని తేల్చి చెప్పింది. ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్ లో మ్యాచ్ లు ఆడమని, తమ మ్యాచ్ లు తటస్థ వేదికలో నిర్వహించాలని ఐసీసీని కోరింది. దీనిపై ఐసీసీ సానుకూలంగానే ఉన్నా పాక్ క్రికెట్ బోర్డు మాత్రం ఒప్పుకోవడం లేదు. గతంలో ఆసియాకప్ హైబ్రిడ్ మోడల్ తరహాలోనే నిర్వహించినా ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా స్వదేశంలోనే జరుపుతామంటూ హడావుడి చేస్తోంది. అవసరమైతే టోర్నీ నుంచి తప్పుకుంటాం తప్ప హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించమంటూ ఓవరాక్షన్ చేస్తోంది. ఇలాంటి బెదిరింపులకు భయపడని బీసీసీఐ పాక్ వెళ్ళేది లేదని ఐసీసీకి మరోసారి తేల్చి చెప్పింది.
దీంతో ఏం చేయాలనే దానిపై ఐసీసీ మల్లగుల్లాలు పడుతోంది. భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీ నిర్వహిస్తే అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఖాయం. అటు రెవెన్యూ పరంగా, ఇటు క్రేజ్ పరంగానూ ఎలా చూసినా ఐసీసీకి నష్టమే మిగులుతుందని చెప్పొచ్చు. దీంతో పాక్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య రెడీ అవుతోంది. టోర్నీని రద్దు చేయడం లేదా వాయిదా వేయాలనే ఆలోచనలో ఐసీసీ ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్ కు పాకిస్థాన్ అంగీకరించకపోతే.. సౌతాఫ్రికా వేదికగా ఈ టోర్నీని నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.
భారత్‌ను కాదని ఈ టోర్నీని నిర్వహించలేమని, ఆర్థికపరమైన సమస్యలు వస్తాయని ఐసీసీ చెబుతోంది. క్రికెట్ బోర్డుల్లో అత్యంత సంపన్నమైన బోర్డు బీసీసీఐకి వ్యతిరేకంగా ఐసీసీ నడుచుకునే పరిస్థితి లేదు. పైగా వచ్చే నెల మొదటి వారంలోనే ఐసీసీ ఛైర్మన్‌గా బీసీసీఐ సెక్రటరీ జై షా బాధ్యతలు చేపట్టనున్నాడు. దీంతో భారత్‌కు వ్యతిరేకంగా ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు అవకాశమే లేదు. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు వెనక్కి తగ్గి హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహించాల్సి ఉంటుంది. లేకుంటే ఆ జట్టే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే భారత్ రాకుంటే ఆ జట్టు స్థానంలో మరో టీమ్‌కు అవకాశం ఇవ్వాలని కూడా పీసీబీ.. ఐసీసీని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ ఐసీసీ భారత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తే.. టోర్నీ నుంచి తప్పుకొని న్యాయ పోరాటం చేస్తామని కూడా పీసీబీ హెచ్చరించినట్లు తెలుస్తోంది. కానీ ఐసీసీ మాత్రం వాటిని పట్టించుకోకుండా టోర్నీ తరలింపుపై ఫోకస్ పెట్టింది. తాజా పరిణామాలతో పాక్ క్రికెట్ బోర్డుకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.