Chandrababu Case: రెండు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ లభించి చంద్రబాబుకు కాస్త ఊరట కలిగింది. కానీ ఏపీ ప్రభుత్వం పెట్టిన మరికొన్ని కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. రెండు కేసులపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది.
Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులతో ఈమధ్యే మధ్యంతర బెయిల్ పొందారు. ఆ తర్వాత ఆయనకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ కూడా ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ మంగళవారం నాడు సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇది కాకుండా చంద్రబాబుపై మరికొన్ని కేసులు పెట్టింది ఏపీ సర్కార్. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసు, ఇసుక కేసులు నడుస్తున్నాయి. వీటిల్లో ఇసుక స్కాం కేసులో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరుగుతోంది.
లిక్కర్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సాగనుంది. ఈ రెండు కేసుల్లో చంద్రబాబు, లిక్కర్ కేసులో కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై హైకోర్టులో విచారణ జరగనుంది. వీటిపై తీర్పు ఎలా వస్తుందనేది టీడీపీ వర్గాల్లో ఉత్కంఠగా ఉంది. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి జగన్ ప్రభుత్వం వేధిస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టి… ఆయనకు శిక్ష తప్పదంటున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు. అనారోగ్యం పేరుతో బయటకు వచ్చినంత మాత్రాన చేసిన తప్పులు మానిపోవని విమర్శిస్తున్నారు.