Chandrababu: చంద్రబాబు గారూ.. ఇంకెప్పుడు తెలుసుకుంటారు..?
చంద్రబాబుకు వయసు మీద పడే కొద్దీ చాదస్తం పెరిగిపోతున్నట్టు కనిపిస్తోంది. అసందర్భంగా, అనాలోచితంగా కొన్ని కామెంట్స్ చేసేస్తున్నారు.
చంద్రబాబుకు వయసు మీద పడే కొద్దీ చాదస్తం పెరిగిపోతున్నట్టు కనిపిస్తోంది. అసందర్భంగా, అనాలోచితంగా కొన్ని కామెంట్స్ చేసేస్తున్నారు. ఇది ఆయనకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. ఇంకో విధంగా చెప్పాలంటే ఆయనే ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా తెలంగాణ విషయంలో చంద్రబాబు చేసిన కామెంట్స్ వివాదానికి కారణమయ్యాయి. తెలంగాణ ప్రజలకు అన్నం పరిచయం చేసింది తామేనంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీంతో ఆయనపై తెలంగాణ నేతలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
తెలంగాణలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ బాగా బలంగా ఉండేది. అయితే విభజన తర్వాత ఆ పార్టీ ప్రభావం కనుమరుగైపోయింది. అయితే కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో దేశమంతా పార్టీని విస్తరించేందుకు నడుం బిగించారు. దీంతో మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టేందుకు టీడీపీకి అవకాశం దొరికింది. పైగా ఇప్పటికీ తెలంగాణలో టీడీపీని అభిమానించే వాళ్లు ఉన్నారు. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా జరిగింది. దీంట్లో పార్టీ అధినేత చంద్రబాబు కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు.. తెలంగాణపై నోరు జారారు. టీడీపీ రాకముందు తెలంగాణలో జొన్నలు, రాగులు, సజ్జలు లాంటివి తినేవాళ్లని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కిలో రెండు రూపాయల బియ్యం పథకం అమల్లోకి వచ్చాక తెలంగాణ ప్రజలు అన్నం వండుకోవడం మెదలుపెట్టారని చంద్రబాబు అన్నారు. ఈ కామెంట్స్ తెలంగాణ వాసులకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నాయి. చంద్రబాబు కామెంట్స్ పై మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. 15వ శతాబ్దం నుంచి తెలంగాణ బిర్యానీకి ప్రసిద్ధి అని చెప్పారు. కాకతీయుల కాలం నుంచే గొలుసుకట్టు చెరువులతో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదని.. అన్ని రకాల పంటలు పండేవని గుర్తు చేశారు. చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు నోరు జారడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో తెలంగాణపై ఆయన మాటలు వివాదాస్పద మయ్యాయి. హైదరాబాద్ ఐటీ అంతా తన ఘనతేనని.. హైదరాబాద్ ను తానే కట్టాననడం ఇప్పటికీ ట్రోల్ అవుతూ ఉంటుంది. హైదరాబాద్ అభివృద్ధి అంతా తన ఘనతే అని చెప్పుకోవడంపై ఇప్పటీ తెలంగాణ వాసులు మండిపడుతుంటారు. నిజాం కాలం నుంచే హైదరాబాద్ కు ప్రపంచపటంలో గుర్తింపు ఉండేదని చెప్తుంటారు. అహంకారంతోనే చంద్రబాబు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని.. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబు ఇంకా అర్థం చేసుకోవట్లేదని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ఇలాంటి మాటలు తగ్గించుకుంటే మంచిది. లేకుంటే మళ్లీ మళ్లీ ట్రోల్స్ కు గురికావాల్సి ఉంటుంది.