CHANDRABABU NAIDU: జగన్ అర్జునుడు కాదు.. భస్మాసురుడు.. ఏపీని నెంబర్ వన్ చేస్తా: చంద్రబాబు

జగన్ రెడ్డి అభిమన్యుడు కాదు.. అర్జునుడు కాదు.. భస్మాసురుడు. చంద్రన్న కానుకలు, విదేశీ విద్య, రైతుల సబ్సిడీలు తీసేసిన వ్యక్తి జగన్ రెడ్డి.. తనకు ఇల్లే లేదంటున్నాడు. తాడేపల్లి, బెంగుళూరు, పులివెందుల, హైదరాబాద్, రుషికొండలో రూ.500 కోట్ల ప్యాలెస్‌లు కట్టుకోలేదా?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 28, 2024 | 04:35 PMLast Updated on: Jan 28, 2024 | 4:35 PM

Chandrababu Naidu Criticise Ys Jagan And His Rule Of Ap

CHANDRABABU NAIDU: ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ వన్ చేస్తానని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సీఎం జగన్‌ది భస్మాసుర హస్తం అని విమర్శించారు. నెల్లూరులో ఆదివారం నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీపై విమర్శలు చేశారు.

TSPSC: టీఎస్పీఎస్సీ బోర్డులో ఏపీ వ్యక్తి.. కొత్త వివాదంలో రేవంత్ సర్కార్‌..

“ఈ రాష్ట్రాన్ని, తెలుగువారిని ప్రపంచంలో నెం.1 స్థానంలో నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటా. నాకు కష్టం వస్తే వివిధ రాష్ట్రాలతో పాటు.. 80 దేశాల్లో ప్రజలు మద్దతు తెలిపారు. పేదవారిని ఆర్థికంగా బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటా. నేడు ఎక్కడ చూసినా విధ్వంసం, తుగ్లక్ విధానాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. అందుకే ‘రా కదలి రా’ అని పిలుపునిచ్చాం. జగన్ రెడ్డి ‘సిద్ధం’ అని మీటింగ్ పెట్టారు. మీరు సిద్ధమంటే టికెట్లిచ్చిన వైసీపీ నేతలందరూ పారిపోతున్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం వైసీపీ నాయకులకు కూడా “రా కదలి రా” అని పిలుపునిస్తున్నాం. జగన్ రెడ్డి అభిమన్యుడు కాదు.. అర్జునుడు కాదు.. భస్మాసురుడు. చంద్రన్న కానుకలు, విదేశీ విద్య, రైతుల సబ్సిడీలు తీసేసిన వ్యక్తి జగన్ రెడ్డి.. తనకు ఇల్లే లేదంటున్నాడు. తాడేపల్లి, బెంగుళూరు, పులివెందుల, హైదరాబాద్, రుషికొండలో రూ.500 కోట్ల ప్యాలెస్‌లు కట్టుకోలేదా? నేడు గ్రామాల్లో ఎక్కడ చూసినా అంధకారం నెలకొంది.

9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. మద్యం పేరుతో ప్రజల రక్తాన్ని తాగే వ్యక్తి జగన్. మద్యపాన నిషేధం అమలు చేయకుంటే ఓట్లు అడగబోనన్నారు. మరి ఇప్పుడు ఏం చేశారని ఓట్లు అడుగుతారు. త్వరలోనే ప్రజలు ఫ్యాన్ రెక్కలు విరిచి పక్కన పెడతారు. వైసీపీ హయాంలో అన్నదాతలు చితికిపోయారు. ఎక్కువ అప్పులున్న రైతు కుటుంబాల్లో రాష్ట్రం ప్రథమస్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానం, రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఏ వర్గం ఆనందంగా లేదు. ఆక్వా రంగం కుదేలైంది. ధాన్యం కొనుగోళ్లలో కమీషన్ల పర్వం సాగుతోంది. ‘ఆక్వా రంగాన్ని బాగు చేసే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటుంది” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.