Chandrababu Naidu: కమ్మ సామాజిక వర్గం అతి చేష్టలే చంద్రబాబు నాయుడు కొంపముంచుతున్నాయా?

తెలుగుదేశం బలహీనత, చంద్రబాబు బలం కమ్మ సామాజిక వర్గమేనా. ఈ సామాజిక వర్గ రాజకీయాలు వ్యూహాత్మకంగా చేయడంలో టీడీపీ విఫలం అవుతోందా..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 25, 2023 | 07:40 AMLast Updated on: Sep 25, 2023 | 7:40 AM

Chandrababu Naidu Has Become A Problem Due To The Extreme Antics Of The Kamma Social Class

చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ , జగన్మోహన్ రెడ్డి వీళ్లు సామాజికవర్గ ప్రతినిధులు కాదు, పార్టీలకు నాయకులు. సామాజికవర్గ అభిమానం ఉన్నా అది వాళ్ల వాళ్ల సొంత వ్యవహారాలు లో చూపించుకుంటారు తప్ప జనం మీద రుద్దలేరు. ఓకే సామాజిక వర్గంతో రాజకీయం చేయాలనుకుంటే ఏ పార్టీకి మనుగడ ఉండదు. కానీ ఇప్పుడు చంద్రబాబుకి మాత్రం కమ్మ సామాజిక వర్గమే పెద్ద సమస్య అయిపోయింది. తెలుగుదేశం అంటే కమ్మ. కమ్మ అంటే తెలుగుదేశం. దీన్నెవరూ కాదనలేరు. తెలుగుదేశం స్థాపించడానికి ముందు.. కాంగ్రెస్ లో చాలామంది నేతలు కమ్మ వాళ్లే. ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించాక కాంగ్రెస్ ను వదిలి కమ్మవాళ్ళు మొత్తం టిడిపిలో చేరారు. కానీ ఎన్టీఆర్ ఏనాడు కేవలం కమ్మ పక్షపాతం చూపించలేదు. ఎందరో బీసీనేతల్ని, భిన్న వర్గాల వాళ్ళని, ఎస్సీలను, యువకులను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. దేవేంద్ర గౌడ్, కెసీఆర్, జె ఆర్ పుష్ప రాజ్, అయ్యన్నపాత్రుడు, ఎర్రం నాయుడు, యనమల రామకృష్ణుడు ఇలా ఎంతోమంది ఆ రోజుల్లో యువకులు, చదువుకున్నవాళ్లు టిడిపిలో చేరారు. రాను రాను ఏపీ రాజకీయాల్లో రెడ్డి వర్సెస్ కమ్మగా మారిపోవడంతో.. టీడీపీ పూర్తిగా కమ్మ రంగు వేసేసుకుంది.

ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో ఈ సామాజిక వర్గం అనుసరిస్తున్న తీరు మిగిలిన వర్గాల వారిని దూరం చేసింది. చంద్రబాబుని అరెస్టు చేస్తే జనం ఉద్యమాలు.. ఆందోళనలు చేయకపోవడానికి కారణం.. రావాల్సినంత సానుభూతి రాకపోవడానికి కారణం, చంద్రబాబు అరెస్టు కమ్మ వాళ్ల సమస్యగా మారిపోవడమే. పార్టీలో కూడా మిగిలిన నేతలు అది కేవలం కమ్మ సామాజిక వర్గ సమస్యగా చూశారు. ఏదో చేయాలి కాబట్టి నామ్ కే వాస్తే గా ఆందోళన చేశారు. హైదరాబాదు హైటెక్ సిటీ దగ్గర గాని, డాల్లాస్ లో, న్యూ జెర్సీలో, చంద్రబాబు అరెస్టు ని నిరసిస్తూ జరిగిన ఆందోళనలో పాల్గొన్నది 95% కమ్మవాళ్లే. సోషల్ మీడియాలో చంద్రబాబు అరెస్టు ని నిరసిస్తూ ప్రతిస్పందించేది కమ్మ వాళ్లే. అంతేకాదు చంద్రబాబు అరెస్టు సందర్భంగా గుండెలు ,గొంతుకలు చించుకొని విపరీతమైన ఓవరాక్షన్ చేసింది కమ్మ పత్రికలు, కమ్మ చానల్స్. అసలా చానల్స్ లో యాంకర్స్ మాట్లాడే తీరు చూస్తే సాధారణ జనానికి విపరీతమైన జుగుప్స కలిగింది.

నిజానికి చంద్రబాబుకి కులంతో సంబంధం లేకుండా మధ్యతరగతి, ఆపై మధ్యతరగతి తోపాటు అన్ని వర్గాల్లోనూ గౌరవం ఉంది. సానుభూతి ఉంది. ఆ గౌరవాన్ని సానుభూతిని కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు పూర్తిగా పోగొట్టింది. చంద్రబాబును అరెస్టు చేస్తే అదేదో తమ కులానికి జరిగిన అన్యాయంగా ప్రజెక్టు చేస్తూ చానల్స్ లో, సోషల్ మీడియాలో, అమెరికాలో, లండన్ లో చలారేగి మాట్లాడిన మాటలు మిగిలిన వాళ్ళందరినీ టిడిపికి దూరం చేస్తున్నాయి. చంద్రబాబు అరెస్టు అవ్వగానే కె రాఘవేంద్రరావు రియాక్ట్ అవుతారు. మా కుల పెద్ద.. మా పెద్దాయన అంటూ బండ్ల గణేష్ రోడ్డు ఎక్కుతాడు. తెలంగాణలో కమ్మ ఎమ్మెల్యేలు, కమ్మ ఓటర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల ఎమ్మెల్యే లు దగ్గరుండి ధర్నాలు చేయిస్తారు. అది కేవలం వాళ్ళ ఓట్ల కోసం అని ఇక్కడ అందరికీ తెలుసు. కూకట్పల్లి లో జరిగిన ఆందోళన లాంటివి కరీంనగర్ , మెదక్ లో ఎందుకు జరగవు? అక్కడ కమ్మ నాయకులు లేరు కమ్మ ఓట్లు లేవు. చంద్రబాబు అరెస్ట్ ని నిరసిస్తూ ఛలో రాజమండ్రి పెడితే అందులో ఉన్నవన్నీ కమ్మకార్లే.

సంక్షోభం లో కనీస వ్యూహం కూడా లేకపోతే ఎలా? ఇలాంటి సమయంలో అందరిని కలుపుకోవాలి.. కులం రంగు పడకుండా జాగ్రత్తగా ఉండాలి అనే జ్ఞానం కూడా కమ్మ సామాజిక వర్గానికి లేదు. వాడెవడో నా కంట్లో పొడిచాడు కాబట్టి నేను వాడి కడుపులో పొడవాలి. ఇదే ఆత్రుత. చంద్రబాబు కూడా తన సామాజిక వర్గం వారికి బాగా ప్రభావితం అయ్యారు. గతంలో కాంగ్రెస్.. ఆ తర్వాత వైసీపీ ఎలాగైతే రెడ్ల పార్టీగా వ్యవహరించాయో టిడిపి కూడా అలాగే ఉండాలని కొందరు కమ్మ స్నేహితులిచ్చిన సలహాలను బాబు అమలు చేస్తున్నారు. చంద్రబాబు కి కూడా ఏ స్థాయిలో కుల పిచ్చి పట్టింది అంటే కేవలం కమ్మ జర్నలిస్టుల పుట్టిన రోజులకు.. కమ్మ మీడియా మేనేజ్మెంట్లకు మాత్రమే ఈ మాజీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు చెప్తారు. ఇలాంటి చౌకబారు వేషాలు తటస్థంగా ఉండే వాళ్లకి చాలా బాధ కలిగిస్తుంటాయి. వాళ్లు టీడీపీ కి దూరం గా వెళ్లిపోయారు.

వైసీపీ నడిపేదే కుల రాజకీయం. ఏపీలో జనాన్ని కులాల కింద పూర్తిగా చీల్చేసి.. ముక్కలు ముక్కలు చేసి రాజకీయం నడిపిస్తున్న పార్టీ వైసీపీ. అలాంటి తరుణంలో.. అనుసరించాల్సిన వ్యూహాన్ని వదిలేసి టీడీపీ కాడిని కమ్మ కులం భుజానికి ఎత్తుకొని లాగాలని చూస్తుంది. వైసిపి నూటికి నూరు శాతం రెడ్ల పార్టీ. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ జగన్ ఏనాడు రెడ్ల గురించి బయట మాట్లాడడు. ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, కాపులు వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. అది వైసిపి వ్యూహం. కానీ కమ్మ సామాజిక వర్గం మాత్రం వైసీపీ తీసిన గోతిలో తానుగా వెళ్ళి పడుతుంది.
చిన్న చిన్న అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ లో కూడా ఒక ప్రత్యేక వర్గాన్ని మెయిన్ టైన్ చేసే కమ్మ వాళ్లు చంద్రబాబు అరెస్ట్ ను తమ ఇంటి సమస్యగా మార్చేసుకున్నారు. వినాయకుడి పూజ దగ్గర కూడా చంద్రబాబును రక్షించమని దండం పెట్టారంటే ఎంతగా ఈ సమస్యను మనసులోకి తీసుకున్నారో అర్థం అవుతుంది. తప్పులేదు. కానీ చంద్రబాబు అరెస్ట్ ని కేవలం ఒక కులం సమస్య గా మాత్రమే భావించినప్పుడు మిగిలిన జనం అంతా దూరంగా వెళ్లి నిలబడి చూస్తుంటారు. చంద్రబాబుకు సానుభూతి రాకపోవడానికి ఇదే ప్రధాన కారణం. చంద్రబాబుని అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ దెబ్బతీస్తుంది కమ్మవాళ్లే.