Northern Railway: ఒక్క ఎలుకను పట్టడానికి 41వేలు.. ఇదేందయ్యా ఇది.. అది అంత స్పెషలా
ఎలుకలు పట్టేందుకు రైల్వే శాఖ ఖర్చు పెట్టిన మొత్తం లక్షల్లోనే ఉండటం గమనార్హం.
ఎలుకలు.. ప్రతీ ఇంటిని వేధించే సమస్యే ! ఎలుకలు తిరుగుతున్నాయ్ కదా అని.. వాటిని పట్టుకునేందుకు ఆస్తులు అమ్ముకోలేం కదా ! సంబంధం లేకుండా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా.. మొత్తం చూడండి.. మీకే అర్థం అవుతుంది అసలు వ్యవహారం. ఒక్క ఎలుకను పట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి.. ఓ బోను, రెండు ఉల్లిగడ్డలు.. ఇలా లెక్కేస్తే వంద రూపాయల్లోపే కదా ! ఇంకా పకడ్బందీగా చేసినా.. వెయ్యి రూపాయలు అవుతుంది అనుకుందాం. కానీ వాళ్లు మాత్రం ఒక్క ఎలుకను పట్టుకోవడానికి 41వేల రూపాయలు ఖర్చు చేశారు. ఇదేందయ్యా ఇది.. నేనెప్పుడూ వినలే అని ఆశ్చర్యపోకండి. ఇదే జరిగింది నిజంగా ! రైల్వే శాఖ ఒక్కో ఎలుకను పట్టుకోవడానికి 41వేలు ఖర్చు చేసి ఔరా అనిపించింది.
నార్తన్ రైల్వే లక్నో డివిజన్ క్రియేట్ చేసిన రికార్డ్ ఇది. చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద కోరినప్పుడు.. రైల్వే శాఖ స్వయంగా ఈ వివరాలు తెలియజేసింది. నార్తన్ రైల్వే లక్నో డివిజన్ 2020 నుంచి 2022 వరకు ఎలుకలను పట్టడం కోసం 69లక్షల 50వేల రూపాయలు ఖర్చు పెట్టింది. పట్టిన ఎలుకలు ఎన్నయ్యా అని లెక్క తీస్తే. కేవలం 168 మాత్రమే ! 69 లక్షలు డివైడెడ్ బై 168 ఎలుకలు.. ఆ లెక్కన ఒక్కో ఎలుకకు 41వేల రూపాయలు ఖర్చు చేశారన్న మాట.
ఈ లెక్కలు చూసిన ఎవరికైనా కళ్లు గింగిరాలు తిరగడం ఖాయం. ఎలుకలు పట్టడం, చెదల నివారణ ఇవన్నీ ప్రాథమిక మెయింటెనెన్స్ కింద రైల్వే లెక్కలు వేస్తుంది. నార్తన్ రైల్వే పరిధిలో ఢిల్లీ, అంబాలా, లక్నో, ఫిరోజ్ పూర్, మొరాదాబాద్ డివిజన్లు ఉన్నాయ్. చంద్రశేఖర్ గౌర్ నార్తన్ రైల్వే వ్యాప్తంగా సమాచారం కోరగా.. ఒక్క లక్నో డివిజన్ మాత్రమే క్లియర్‌గా సమాచారం ఇచ్చింది. ఎలుకల కారణంగా జరిగిన నష్టం ఎంత అన్న గౌర్ ప్రశ్నకు లక్నో డివిజన్ కూడా సమాచారం ఇవ్వలేదు. నష్టపోయిన గూడ్స్, వస్తువులకు సంబంధించిన సమాచారం లేదని తెలిపింది. అంబాలా డివిజన్ 2020 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు ఎలుకలు, చెదల నివారణకు 39లక్షల 30వేలు ఖర్చు చేసింది.