డూ ఆర్ డై మ్యాచ్ కు చెన్నై రెడీ, లక్నోపై సీఎస్కే తుది జట్టు ఇదే
ఐపీఎల్ 2025 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్లాప్ షోతో నిరాశపరుస్తోంది. ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్ లలో ఐదింట పరాజయం పాలైంది. ముంబయి ఇండియన్స్ పై విజయంతో ప్రారంభించి.. ఆ తర్వాత ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కేకేఆర్ పై ఓడింది.

ఐపీఎల్ 2025 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్లాప్ షోతో నిరాశపరుస్తోంది. ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్ లలో ఐదింట పరాజయం పాలైంది. ముంబయి ఇండియన్స్ పై విజయంతో ప్రారంభించి.. ఆ తర్వాత ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కేకేఆర్ పై ఓడింది. ఐపీఎల్ చరిత్రలో ఇన్ని మ్యాచులు వరుసగా ఓడిపోవడం సీఎస్కేకు ఇదే తొలిసారి. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో సీజన్ నుంచి తప్పుకోవడంతో.. గత మ్యాచులో ధోనీ కెప్టెన్సీ వహించినా రాత మారలేదు. దీంతో చెన్నై జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి.
ఇకపై ఆడే ప్రతీ మ్యాచు సీఎస్కే జట్టుకు ఎంతో కీలకంగా మారింది. ప్రస్తుతం చెన్నై జట్టు చేతిలో 8 మ్యాచులు ఉన్నాయి. అందులో కనీసం 7 మ్యాచులు గెలవాలి. మరి ధోనీ సారథ్యంలో సీఎస్కే ముందడుగు వేస్తుందా లేదంటే ప్లే ఆఫ్స్ చేరకుండానే ముందుగానే నిష్క్రమిస్తుందా అనేది ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే ఇప్పుడు సీఎస్కే.. లక్నో సూపర్ జెయింట్స్ తో ఏకానా స్టేడియంలో తలపడేందుకు సిద్ధమైంది. గత మ్యాచుతో పోలిస్తే ఈ సారి సీఎస్కే తుది జట్టులో ఓ మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. టాప్ ఆర్డర్ లో రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే రూపంలో ఇద్దరు న్యూజిలాండ్ ప్లేయర్లు ఉన్నారు. వీరిద్దరు భారీగా పరుగులు చేసి సీఎస్కేకు మంచి ఆరంభం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ గత మ్యాచులో వీరు విఫలమయ్యారు. రుతురాజ్ గైక్వాడ్ తప్పుకోవంతో మూడో స్థానంలోకి రాహుల్ త్రిపాఠి వచ్చాడు. కానీ గత మ్యాచులో ఇతడు విఫలమయ్యాడు.
మిడిలార్డర్‌లో సీఎస్కేకు నలుగురు ఆల్ రౌండర్లు ఉన్నారు కానీ సరైన బ్యాటర్లు లేరు. మిడిలార్డర్‌లో సాలిడ్ బ్యాటింగ్ ఆప్షన్ లేక సీఎస్కే ఈ సీజన్ లో తడబడుతోంది. విజయ్ శంకర్, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మిడిలార్డర్‌లో ఆడతారు. కెప్టెన్ ధోనీ లోయర్ మిడిలార్డర్ లో వచ్చే అవకాశం ఉంది. లేదంటే చివర్లో ఓవర్లలో వస్తాడు. బౌలర్లలో స్పిన్ విభాగం నూర్ అహ్మద్ ప్రదర్శనతో బలంగా ఉంది. రవిచంద్రన్ అశ్విన్, జడేజా రాణించాల్సిన అవసరం ఉంది. మతీశా పతిరణ, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్ పేస్ విభాగాన్ని చూసుకుంటారు. మొత్తంగా గత మ్యాచుతో పోలిస్తే ఈ సారి దీపక్ హుడా.. లక్నో మ్యాచు బరిలోకి దిగకపోవచ్చు. మతీశా పతిరణ ఎంట్రీ ఇస్తాడు. ధోనీ కెప్టెన్సీ మ్యాజిక్ పై బోలెడు ఆశలు పెట్టుకున్న అభిమానులు లక్నోపై విజయం అందిస్తాడని ఎదురుచూస్తున్నారు.