చెన్నై నన్ను మళ్ళీ కొంటుంది దీపక్ చాహర్ కాన్ఫిడెన్స్
ఐపీఎల్ మెగా వేలానికి కౌంట్ డౌన్ మొదలైంది. మరో 10 రోజుల్లో సౌదీ సిటీ జెడ్డా వేదికగా ఆటగాళ్ళ వేలం జరగబోతోంది. ఈ మెగా ఆక్షన్ కోసం అటు ఫ్రాంచైజీలు, ఆటగాళ్ళే కాదు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఐపీఎల్ మెగా వేలానికి కౌంట్ డౌన్ మొదలైంది. మరో 10 రోజుల్లో సౌదీ సిటీ జెడ్డా వేదికగా ఆటగాళ్ళ వేలం జరగబోతోంది. ఈ మెగా ఆక్షన్ కోసం అటు ఫ్రాంచైజీలు, ఆటగాళ్ళే కాదు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎవరికి జాక్ పాట్ తగులుతుందో.. ఏ ఆటగాడు ఏ టీమ్ లోకి వెళతాడో అన్న ఉత్కంఠ పెరిగిపోతూ ఉంది. అటు కొందరు ప్లేయర్స్ తమను పాత ఫ్రాంచైజీలే కొనుగోలు చేస్తాయని నమ్మకంగా ఉన్నారు. తాజాగా ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ తనను చెన్నై సూపర్ కింగ్స్ మళ్ళీ కొంటుందంటూ వ్యాఖ్యానించాడు. గతంలో మెగా ఆక్షన్ కు ముందు కూడా చెన్నై తనను రిటైన్ చేసుకోలేదనీ, కానీ వేలంలో భారీ ధరకు సొంతం చేసుకుందంటూ గుర్తు చేసుకున్నాడు. ఈ ఏడాది ఏం జరుగుతుందో తనకు తెలియదన్న దీపక్ చాహర్ తన ప్రతిభ మీద తనకు నమ్మకం ఉందన్నాడు.
ఒకవేళ చెన్నై జట్టు తీసుకోకపోతే రాజస్థాన్ రాయల్స్ తన కోసం వేలం వేయాలని కోరుకుంటున్నట్టు ఈ ఫాస్ట్ బౌలర్ చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాళ్లలో ఒకడైన దీపక్ చాహర్ తన స్వింగ్ బౌలింగ్ తో పలు విజయాలను అందించాడు. 2022 లో ఈ ఫాస్ట్ బౌలర్ ను సీఎస్కే ఫ్రాంచైజీ 14 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గాయాల కారణంగా చాలా మ్యాచ్ లకు దూరమైన చాహర్ పేలవ ఫామ్ తో జట్టుకు భారంగా మారాడు. దీంతో అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ వేలంలోకి వదిలేసింది. కానీ ఇప్పటికీ సీఎస్కే యాజమాన్యంపైన దీపక్ చాహర్ నమ్మకంగా ఉన్నాడు. గత ఆరు సీజన్ల నుంచి చెన్నై తరపున ఆడుతున్న చాహర్ 76 వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే మెగావేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఐదుగురు కీలక ఆటగాళ్ళను రిటైన్ చేసుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో పాటు జడేజాకు 18 కోట్ల చొప్పున ఇచ్చింది. అలాగే లంక ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరానాకు 13 కోట్లు.. ఆల్ రౌండర్ శివమ్ దూబేకు 12 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్న చెన్నై ఫ్రాంచైజీ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మాత్రం అన్ క్యాప్డ్ కేటగిరీలో దక్కించుకుంది. ధోనీని కేవలం 4 కోట్ల రూపాయలతో రిటైన్ చేసుకుంది. రిటెన్షన్ కోసం 65 కోట్లు వెచ్చించిన చెన్నై సూపర్ కింగ్స్ 55 కోట్లతో వేలంలోకి వెళ్ళబోతోంది.