Chepa Mandu: మళ్లీ వివాదాస్పదమౌతున్న చేపప్రసాదం పంపిణీ..
మృగశిర కార్తె వచ్చిందంటే హైదరాబాద్ వాసులకు, ఆస్తమా పేషెంట్లకు గుర్తొచ్చేది చేపప్రసాదం. బత్తిని కుటుంబ సభ్యులు పంపిణీ చేసే ఈ చేపప్రసాదం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా చాలా ఫేమస్. శాస్త్రీయ నిర్ధారణ గురించి కాసేపు పక్కన పెడితే.. ఈ చేప మందు వేసుకుంటే ఉబ్బసం వ్యాధి తగ్గుతుందనేది చాలా మంది నమ్మకం.
అందుకే వేల సంఖ్యలో చేప ప్రసాదం తీసుకునేందుకు హైదరాబాద్‌కు వస్తుంటారు చాలా మంది. అయితే ఎంతో మంది నమ్మే ఈ ప్రసాదం చుట్టూ ఏళ్ల నుంచి ఓ వివాదం చుట్టుకుని ఉంది. చేప ప్రసాదం శాస్త్రీయం కాదని జనవిజ్ఞాన వేదిక గతం నుంచి చెప్తోంది. ఇదే విషయంలో హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. శాస్త్రీయ ఆధారం లేనందున దీన్ని మందు అని పిలవకూడదని తెలిపింది. అయితే అప్పటి నుంచి చేపప్రసాదం పేరుతో దీన్ని పంపిణీ చేస్తున్నారు బత్తిని కుంటుంబ సభ్యులు.
ఇప్పుడే కాదు.. సుమారు 175 ఏళ్ల నుంచి బత్తిని కుటుంబ సభ్యులు తరతరాలుగా ఈ ప్రసాదం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా గత మూడేళ్ల నుంచి చేపప్రసాదం పంపిణీ జరగలేదు. ఈ సంవత్సరం కరోన భయం తగ్గడంతో చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. చేప పిల్లలను సమకూర్చే బాధ్యత కూడా తీసుకుంది. దీంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేపప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశారు బత్తిని కుటుంబ సభ్యులు. ప్రసాదం తీసుకునేందుకు వచ్చే పేషెంట్ల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. జూన్ 9 నుంచి రెండు రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేపప్రసాదం పంపిణీ జరగనుంది. అయితే శాస్త్రీయ ఆధారాలు లేకుండా చేపప్రసాదం పంపిణీ చేయడం కోర్టు దిక్కరణ అవుతుందని మరోసారి వాదన మొదలు పెట్టింది జనవిజ్ఞాన వేదిక.