18 ఏళ్ళకే వరల్డ్ ఛాంపియన్, చెస్ జగజ్జేత గుకేశ్
ప్రపంచ చదరంగంలో మరో శకం మొదలైంది. 18 ఏళ్ళ వయసులోనే వరల్డ్ చెస్ ను శాసిస్తున్నాడు భారత్ కు చెందిన గుకేశ్ దొమ్మరాజు... ఈ యువ సంచలనం తాజాగా వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. పిన్న వయసులోనే విశ్వవిజేతగా నిలిచిన చెస్ ప్లేయర్ గా రికార్డులకెక్కాడు.
ప్రపంచ చదరంగంలో మరో శకం మొదలైంది. 18 ఏళ్ళ వయసులోనే వరల్డ్ చెస్ ను శాసిస్తున్నాడు భారత్ కు చెందిన గుకేశ్ దొమ్మరాజు… ఈ యువ సంచలనం తాజాగా వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. పిన్న వయసులోనే విశ్వవిజేతగా నిలిచిన చెస్ ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. రసవత్తరంగా సాగిన టైటిల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్, చైనాకు చెందిన డింగ్ లిరెన్ పై విజయం సాధించాడు. 14వ రౌండ్‌లో కూడా ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. కానీ ప్రత్యర్థిని కీలక సమయంలో తనదైన ఎత్తులతో నిలువరించిన గుకేశ్‌నే విజయం వరించింది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌ను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు.
గుకేశ్ కెరీర్ అంతా సంచలనాల మయమే… ఏడేళ్ళ వయసులో చెస్ ఆడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి పిన్న వయసులో భారత గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందడం , వరుస విజయాలతో వరల్డ్ చాంపియన్ గా నిలవడం వరకూ అతను చెన్నైకి చెందిన ఈ కుర్రాడు ఇటీవలే ప్రతిష్ఠాత్మక వరల్డ్ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచి తానేంటో నిరూపించుకున్నాడు. తనకంటే ఎంతో బలమైన, అనుభవజ్ఞులైన గ్రాండ్‌మాస్టర్లతో తలపడి అతను ఈ అసాధారణ ఘనతను సాధించాడు. క్యాండిడేట్స్‌తో విజేతగా నిలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా రికార్డు నమోదు చేశాడు.
తొలిసారి క్యాండిడేట్స్ లో పాల్గొన్న గుకేశ్ పై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. ఈ టోర్నీలో వరల్డ్ టాప్ 3లోని ఇద్దరు ప్లేయర్స్ తోపాటు రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ ఛాలెంజర్ గా నిలిచిన ప్లేయర్స్ పాల్గొన్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గత మూడు వారాలుగా గుకేశ్ తన విజయ పరంపరను కొనసాగించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 37 ఏళ్లుగా భారత నంబర్‌వన్‌గా ఉన్న దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్‌ను దాటి మన దేశం తరఫున అగ్రస్థానాన్ని అందుకున్నప్పుడే గుకేశ్ ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు అదే జోరులో సాధించిన తాజా విజయంతో ఈ టీనేజర్ చెస్ చరిత్రలో తనకంటూ కొత్త అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.
గుకేశ్ ఐదేళ్ల క్రితం 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయసులో గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించి ఆ ఘనతను అందుకున్న రెండో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. దానికే పరిమితం కాకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ జూనియర్ నుంచి సీనియర్ స్థాయి వరకు సరైన రీతిలో పురోగతి సాధిస్తూ వరుస విజయాలు అందుకున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 8వ స్థానానికి చేరిన అతను 2700 ఎలో రేటింగ్ దాటిన అరుదైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. వేర్వేరు వ్యక్తిగత టోర్నీలు గెలవడంతో పాటు ఆసియా క్రీడల్లో భారత జట్టు రజతం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 2022లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో తొలి 8 గేమ్‌లలో ఎనిమిదీ గెలిచి ఎవరూ సాధించని అరుదైన రికార్డును సాధించాడు.
ఇదిలా ఉంటే గుకేశ్ తల్లిదండ్రులది ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా.. అతని చెస్ శిక్షణ కోసం చెన్నైలో స్థిరపడ్డారు. తండ్రి రజినీకాంత్ ఈఎన్‌టీ వైద్యుడు కాగా, గుకేశ్ తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్‌గా ఒక ఆస్పత్రిలో పని చేస్తున్నారు. గుకేశ్‌తో పాటు టోర్నీల కోసం ప్రయాణించేందుకు ఆయన చాలాసార్లు తన వృత్తిని పక్కన పెట్టి మరీ కొడుకు కోసం సమయం కేటాయించారు. చివరికి వారి త్యాగం ఫలించి 18 ఏళ్ళకే జగజ్జేతగా నిలిచాడు. అందుకే ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచిన క్షణంలో ఉద్వేగానికి లోనైన గుకేశ్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఏది ఏమైనా ప్రపంచ చదరంగంలో మరోసారి భారత పతాకం రెపరెపలాడడం ప్రతీ క్రీడాభిమానికీ సంతోషానిస్తోంది.