Child Marriage: మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న40ఏళ్ళ వయస్కుడు..
అఖండ భారతం.. అందులో ఒకవైపు అన్నింట అమ్మాయిలే అగ్రస్థానం. మరోవైపు బేటీ పడావో బేటీ బచావో అన్న నినాదం. ఇంత స్థాయిలో సమాజం పరుగులు తీస్తుంటే ఇంకా బాల్య వివాహాలు అక్కడక్కడా చిగురిస్తూనే ఉన్నాయి. పచ్చని వనంలా శోభిల్లాల్సిన భావివనిత మెడలో మాంగళ్యం అనే విషాన్ని చిమ్ముతూ మహిళల జీవితాను నాశనం చేస్తున్నారు కొందరు. తాజాగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం చాలా దుర్మార్గమైన చర్యగా చెప్పాలి. నేటి ఆధునిక యుగంలోనూ ఇలాంటవి వెలుగులోకి వస్తున్నాయంటే వీరు సమాజానికి ఎంత వెనుకబడి ఉన్నారో అర్థం చేసుకోవాలి. తాజాగా నిజామాబాద్ లో ఇలాంటి ఘాతుకం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.
మన దేశంలో బాల్య వివాహాలు ఎప్పుడో రద్దైయ్యాయి. వీటి కోసం అనేక సంస్కరణలు జరిగాయి. కందుకూరి విరేశలింగం అప్పట్లోనే బాల్య వివాహాల నిర్మూలనకు పాటుపడ్డారు. తమదైన శైలిలో సమాజాన్ని మేల్కొల్పడం కోసం విద్వన్మనోహరణి,వివేకవర్థిని, హాస్య సంజీవిని అనే మహిళా అభ్యుదయం కోసం పత్రికలు కూడా నడిపారు. ఇక దశాబ్ధాల కాలంగా మన ప్రభుత్వాలు బాల్య వివాహాలను రద్దు చేస్తూ చట్టాలు కూడా తీసుకొచ్చింది. వీటిని ఖచ్చితంగా అమలయ్యేలా ప్రణాళికలు కూడా రచిస్తోంది. గతంతో పోలిస్తే చాలా వరకూ బాల్య వివాహాలు తగ్గాయని చెప్పాలి. అయితే మన దేశంలో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. కొన్ని వెలుగులోకి వస్తే మరికొన్ని తెరచాటున దాగి ఉంటాయి.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన నిజామాబాద్ జిల్లా నవీనపేట మండలంలోని ఒక తాండాలో శుక్రవారం చోటు చేసుకుంది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాండాకు చెందిన 13 ఏళ్ల బాలికకు తమ కుటుంబ సభ్యులు వివాహం చేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో ఫకీరాబాద్ కు చెందిన సాహెబ్ రావు అనే 42 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తితో వివాహం చేశారు. కొందరు గ్రామస్థుల సహాయంతో ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ లోపే సదరు పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆ బాలికను తీసుకొని వెళ్లి పోయారు. ఇదిలా ఉంటే బాల్యవివాహాన్ని అడ్డుకనేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను, అధికారులను అక్కడి ప్రాంత వాసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ వివాహానికి సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవల్సిందిగా జిల్లా బాలబాలికల రక్షణ కార్యదర్శి హైమద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు డీసీపీఓ చైతన్య కుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. పెళ్లి చేసుకున్న సాహెబ్ రావుకు ఇద్దరు కొడుకులు ఉన్నట్లు అక్కడి ప్రాంతం వారు చెబుతున్నారు. ఇందులో చైల్డ్ హెల్ప్ లైన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జోత్స్న దేవితోపాటూ తదితరులు పాల్గొన్నారు.
T.V.SRIKAR