China Debt Crisis: పైన పటారం.. లోన లొటారం.. చైనా నెత్తిన అప్పుల కుంపటి

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. అమెరికాను తలదన్ని సూపర్ పవర్‌గా నిలిచే వ్యూహాలు. హాంకాంగ్ మాదే.. తైవాన్ మాదే అంటూ హూంకరింపులు.. దేశంలో ఎక్కడ చూసినా ఆకాశహార్మ్యాలు.. దేశం అంటే అభివృద్ధి అంటే ఇలా ఉండాలి అనుకునేంతగా పరుగులు.. మన పొరుగు దేశం చైనా గురించి ఇలా చాలా చెప్పుకోవచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 12, 2023 | 08:13 PMLast Updated on: Jul 12, 2023 | 8:13 PM

China Is Financially Trapped In A Debt Quagmire Due To Government Orders To Banks To Disburse Loans To Real Estate Investors

చైనాను ,అక్కడి కమ్యూనిస్టు పాలకులను, అక్కడి ఆర్థిక వ్యవస్థను చూసి.. చైనా‌లో ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే..ఎందుకంటే చైనా పైన పటారం..లోన లొటారంలా తయారైంది. అక్కడి ఆర్థిక వ్యవస్థ గాలి బుడగను తలపిస్తోంది. ప్రపంచంపై గుత్తాధిపత్యం సాధించేందుకు.. మేమే తోపు అని చెప్పించుకునేందుకు చైనా వేస్తున్న అడుగులు ఆదేశానికి గుది బండగా మారుతున్నాయి.

ఖజానా ఖాళీ అయినా ఇతర దేశాలకు అప్పులు
మింగ మెతుకు లేదు మీసాలకు సంపెగ నూనె అని మనకొక ముతక సామెత ఉంది. చైనా ఆర్థిక వ్యవస్థ దీనికి ఏమాత్రం తీసిపోలేదు. ఓవైపు దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయి రాష్ట్రాల అప్పుల భారాన్ని మోయలేక చస్తుంటే.. చైనా మాత్రం చాలా ఉదారంగా ఇతర దేశాలకు అప్పులు ఇచ్చుకుంటూ పోతోంది. వివిధ దేశాలకు వివిధ రూపంలో భారీగా సాయం అందించి ఆయా దేశాలు తాము చెప్పినట్టు తల ఆడించేలా చేయడంలో ఆరితేరిన చైనా పాలకులు.. శ్రీలంక, పాకిస్థాన్ సహా 150కి పైగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారీగా నిధులు సమకూర్చుతున్నారు. ఇలా ఇవ్వడం వెనుక ఆయా దేశాల మీద ప్రేమ కంటే.. చైనా ఆశించే స్వల్పకాలిక, ధీర్ఘకాలిక ప్రయోజనాలు వేరే ఉన్నాయి. దేశాలకు ఇచ్చిన అప్పుల విలువ దాదాపు ఒక ట్రిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఒకవైపు బయట దేశాలకు పెద్ద ఎత్తున అప్పులు , సాయం అందిస్తున్న డ్రాగన్ దేశం.. మరోవైపు సొంత దేశంలో వివిధ రాష్ట్రాలు మోస్తున్న అప్పుల విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. ఒకరకంగా చైనా పరిస్థితి ఎలా ఉందంటే అప్పులిచ్చే వాడే.. అప్పుల్లో కూరుకుపోయినట్టు ఉంది.

ఇంతకీ చైనా నెత్తిన ఎంత అప్పు ఉంది ?
చైనా అప్పు ఇదిగో ఇంతా అని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం లెక్కలన్నీ అత్యంత రహస్యంగా ఉంటాయి. అయితే చైనా ప్రజలు, ప్రభుత్వం, సంస్థలు , రాష్ట్రాలు ఇలా మొత్తంగా ఎంత అప్పు ఉంది అన్నదానిపై ప్రముఖ ఆర్థిక సంస్థ జేపీ మోర్గాన్ ఓ అంచనాకు వచ్చింది. చైనా వార్షిక ఆర్థిక అవుట్ పుట్ తో పోల్చితే అప్పులు 282 శాతానికి చేరుకున్నాయంట. అమెరికాతో పాటు ఇతర అభివృద్ధి చెందిన దేశాలకంటే ఇది చాలా ఎక్కువ. ఓవరాల్ గా 26 ట్రిలియన్ డాలర్ల అప్పు పేరుకుపోయి ఉండవచ్చన్నది ఒక లెక్క. చైనాలో పరిస్థితులు విచిత్రంగా కనిపిస్తున్నాయి. మిగతా ప్రపంచ దేశాలకు భిన్నంగా చైనాలో ఆర్థిక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను అప్పులను పోల్చుకుంటే…చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. కానీ చైనా విషయంలో మాత్రం ఎకానమీ ఏస్థాయిలో పుంజుకుంటుందో అదే స్థాయిలో ఆదేశ అప్పులు కూడా కొండల్లా పేరుకుపోతున్నాయి.

చైనా అప్పుల కుప్పులుగా మారడానికి కారణం ఏంటి ?
అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. విచ్చలవిడితనం చివరకు వినాశనానికే దారితీస్తుంది. చైనాలో గడిచిన రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం దారుణమైన సంక్షోభాన్ని చూస్తోంది. 2021 జులై నుంచి ప్రాపర్టీ రంగం కుప్పకూలడం మొదలుపెట్టింది. ప్రపంచం ముందు చైనాను అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చూపించేందుకు అక్కడి పాలకులు రియాల్టీ రంగానికి పెద్ద పీట వేశారు. నిర్మాణ రంగంతో పాటు , స్థానిక ప్రభుత్వాలకు కుప్పలు తెప్పలుగా బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేశారు. ఒకరకంగా చైనా సెంట్రల్ బ్యాంక్ తో పాటు ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులపై బీజింగ్ విపరీతమైన ఒత్తిడి చేసింది. ఉదారంగా రుణాలు ఇవ్వాలని ప్రెజర్ చేసింది. దీంతో బ్యాంకులు ప్రభుత్వ ఆదేశాలు కాదనలేక.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, స్థానిక సంస్థలకు అడిగిందే తడవుగా లోన్లు మంజూరు చేశాయి.

రియాల్టీ రంగం నేల చూపులు చూడటంతో బడాబడా ప్రాజెక్టుల వైపు ప్రజలు చూడటం మానేశారు. దేశీయ బ్యాంకులతో పాటు విదేశాల నుంచి అప్పులు తెచ్చి రియాల్టీ సెక్టార్ పై ఇన్వెస్ట్ చేసి బిల్డర్లు చేసి అప్పులు తీర్చలేక చేతులెత్తేశారు. గడిచిన రెండేళ్లలో ఎంతో మంది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ దివాళా తీశారు. ఇక స్థానిక ప్రభుత్వాలు కూడా తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. పైకి చైనా ఆర్థిక వ్యవస్థ మేడిపండులా కనిపిస్తుంది… వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తే.. స్థానిక ప్రభుత్వాలు ఎంత సంక్షోభంలో ఉన్నాయో అర్థమవుతుంది. లోకల్ గవర్నమెంట్స్ ను ఆదుకునేందుకు చైనా ప్రభుత్వం local government financing vehicles ను ఏర్పాటు చేసింది. మార్జిన్లు లేకుండా వీటికి లోన్లు ఇవ్వాలని బ్యాంకులకు షరతు విధించింది. అంతేకాదు రుణం తీర్చే కాలపరిమితిని పదేళ్ల నుంచి ఏకంగా 25 ఏళ్లకు పెంచింది. దీంతో బ్యాంకులు కూడా ఆర్థిక వెసులుబాటు లేక కుప్పకూలే స్థితికి చేరుకున్నాయి.

చైనాను ముంచేస్తున్న స్థానిక ప్రభుత్వాలు
చైనా రియాల్టీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఒక ఎత్తైతే.. స్థానిక ప్రభుత్వాలు చేస్తున్న అప్పులు మరొక ఎత్తు. స్థానికంగా ఉండే స్థాలాలను అమ్ముకోవడం ద్వారా, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కు ఇవ్వడం ద్వారా లోకల్ గవర్నమెంట్స్ కు ఆదాయం సమకూరేది. అయితే ఒక్కసారిగా రియాల్టీ రంగం కుప్పకూలిపోవడంతో స్థానిక ప్రభుత్వాల ఆదాయం కూడా పడిపోయింది. బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన అప్పులను మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయడం మొదలు పెట్టాయి స్థానిక ప్రభుత్వాలు. దీంతో ఏటికేడు.. ఆయా ప్రభుత్వాల అప్పులు బాహుబలిగా పెరుగుతూ వచ్చాయి. దేశ విదేశాల నుంచి తెచ్చిన అప్పులను ప్రొడక్టవిటీ కోసం ఖర్చు చేస్తే.. ఎక్కడైనా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. కానీ ఎలాంటి కేవలం ప్రజలకు సౌకర్యాలు కల్పించడం పైనే అప్పులన్నీ ఖర్చు చేయడంతో ప్రభుత్వాలకు చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితి వచ్చింది. అన్నీ కలిపి చైనా ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారుతున్నాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం ఆపకపోతే.. చైనా ఆర్థిక వ్యవస్థ తిరోగమించినా ఆశ్చర్యం లేదన్నది అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల మాట.