CM Jagan: ఆగస్టులో ఏపీ అసెంబ్లీ రద్దు కాబోతోందా? కేబినెట్ భేటీ వెనక అసలు వ్యూహం ఇదేనా ?
కేబినెట్ మీటింగ్ ఎప్పుడు పెట్టుకుందామని.. కేబినెట్‌లో ఉన్న ఒకరినో ఇద్దరినో చర్చించి మరీ నిర్ణయం తీసుకుంటారు. ఆనవాయితీ అనుకున్నా.. అన్నీ మంచు శకునములే చూడాలనుకున్నా.. జరగేది ఇదే ప్రతీసారి. ఏపీలో మాత్రం హడావుడిగా మంత్రివర్గ సమావేశం ప్రకటన వచ్చేసింది. అదీ సీఎం రాష్ట్రంలో లేనప్పుడు ! జగన్ ఢిల్లీ టూర్‌లో ఉండగానే.. జూన్ 7న కేబినెట్ మీటింగ్ అని ఇక్కడ ప్రకటన వచ్చేసింది.
జగన్ హస్తిన పర్యటనకు.. ఈ ప్రకటనకు మధ్య లింక్ ఉందా.. అందరూ అనుకున్నది.. అంతా ఊహించిందే జరగబోతుందా అనే చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో ! ముందస్తు ఎన్నికల గురించి ఏపీ జరుగుతున్న చర్చ కొత్తదేమీ కాదు. అలాంటిదేమీ లేదని జగన్ పదేపదే చెప్తున్నా.. ఆయన అడుగులు, నిర్ణయాలు మాత్రం.. ముందస్తు ఖాయం అనిపించేలా చేశాయ్ చాలాసార్లు ! ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఏపీలో ముందస్తు ముహూర్తం ఫిక్స్ అయిందా.. అందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారా.. కేంద్రం పెద్దలను కలిసి ఇదే చెప్పారా.. వాళ్ల నుంచి గ్రీన్‌సిగ్నల్ కూడా వచ్చేసిందా అనే డిస్కషన్ నడుస్తోంది ప్రతీచోట.
రాబోయే ఎన్నికలే ప్రధాన అజెండగా.. జూన్ 7న కేబినెట్ మీటింగ్ జరగబోతోంది. ముందస్తుకు సంబంధించి కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని.. ఆగస్ట్‌లోనే అసెంబ్లీని రద్దు చేసే దిశగా చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయనే టాక్ నడుస్తోంది. అదే జరిగితే.. తెలంగాణతో పాటు డిసెంబర్‌లోనే ఏపీలో ఎన్నికలు జరుగుతాయ్ అన్నమాట. ఎన్నికలను ఆరు నెలలు ముందుకు జరిపేందుకు ఢిల్లీ పెద్దల నుంచి కూడా జగన్ అనుమతి తీసుకున్నారని.. ఢిల్లీలో అనుమతి వచ్చాకే ఇక్కడ ప్రకటన వచ్చిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతోంది.
రాజకీయాల్లో ఏది బయటకు చెప్తారో అది నిజం కాదు అన్నట్లు.. వైసీపీ తీరు కూడా అలానే కనిపిస్తోంది. ముందస్తు లేదు అనే మాట వినిపించిన ప్రతీసారి.. ఉంది అనే మాట వినిపిస్తోంది వెనకాల నుంచి ! నిజంగా ముందుగా ఎన్నికలు జరగడం.. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం జగన్‌కు, వైసీపీకి చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ! ఆరు నెలలు ముందుగా ఎన్నికలు జరగడం కారణంగా.. రాజకీయంగా, ఆర్థికంగా, బలం బలగం పరంగా.. వైసీపీకి కలిసివచ్చే అవకాశాలు ఉంటాయ్. వీటికితోడు వివేకా కేసు.. వైసీపీని ఇబ్బంది పెడుతోంది.
ఆ కేసు విచారణ తుది దశకు చేరుకోవడం.. అవినాశ్ రెడ్డి అరెస్ట్ దాదాపు ఖాయంగా కనిపిస్తుండడంతో.. అదే నిజం అయితే జరగబోయే నష్టం నుంచి బయటపడాలంటే.. ముందుగానే ఎన్నికల సైరన్ మోగించాలి. అందుకే ముందస్తుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని.. ఎన్నికలకు సంబంధించి దాదాపు నిర్ణయం తీసుకున్నారని.. కేబినెట్ భేటీ తర్వాత ఇలాంటి ప్రకటనే రావడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇది నిజం అయినా.. కాకపోయినా.. ముందస్తు అనేది మాత్రం వైసీపీకి మాండేటరి అన్నది మాత్రం నిజం.